పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఆగస్టు 2012, మంగళవారం

భవాని ఫణి ||స్వాతంత్ర్యానికి జన్మదినం ||

మన స్వాతంత్ర్యానికి పుట్టినరోజు ....
అరవయ్యిదేళ్ళు నిండిన పసిపాప పాపం !!
పుట్టినప్పటి నుండి
ఏడుస్తూనే ఉంది

ముద్దు ముద్దుగా తనగురించి
చెప్పాలనుకుంటుంది
తన ఉనికి భాష ఎవరికీ
అర్ధమే కాక దిక్కుతోచక ఏడుస్తుంది

అందరి కన్నీటి ప్రవాహలకి
తన చిట్టి చేతుల్ని అడ్డం పెట్టి ఆపాలనుకుంటుంది
ఆపలేని ఆశక్తతకి
తానే వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది

నిజాయితీ తినేసి, ఐకమత్యం తాగేసి
తొందరగా పెద్దయి పోవాలనుకుంటుంది
పెట్టలేని అమ్మ పేదరికాన్ని అర్ధం చేసుకోలేక
ఉక్రోషంతో మళ్ళీ ఏడుస్తుంది

చిన్ని చిన్ని అడుగులు వేసి
అభివృద్ది తలుపులు తీసుకుని
అనంత లోకాల్లో
విహరించాలనుకుంటుంది

అవినీతి రొచ్చులో
కూరుకుపోయిన
కాళ్ళని కదపలేక
మరింత ఏడుస్తుంది

తోటి పిల్లలతో కలిసి
స్నేహ గీతాలు పాడాలనుకుంటుంది
గొంతు నులుముతున్న
స్వార్ధం పట్టు వదిలించుకోలేక
ఊపిరాడక ఏడుస్తుంది

ఎప్పుడైనా అప్పుడప్పుడు నవ్వుతుంది...
నిద్దట్లో, గాంధీ తాత గుర్తొచ్చినపుడు

ఎప్పుడైనా అప్పుడప్పుడు నవ్వుతుంది ...
గతజన్మ జ్ఞాపకాలు పలకరించినపుడు

ఎప్పుడైనా ఆపుడప్పుడు నవ్వుతుంది
ఇలా తన పుట్టినరోజునాడు
అందరూ తనకి శుభాకాంక్షలు చెప్పినపుడు !!

*13-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి