మాట్లాడే వాళ్లు ఎవరూ లేక అందరితో మాట్లాడతావు నువ్వు
కప్పిపుచ్చుకోలేవు లోపల నిండుకున్న
అంతంలేని నలుపు లోయలని
కళ్ళ కింద వ్యాపిస్తోన్న నీడల ఛాయలనీ
గబ్బిలాలైన చూపులనీ ఎడారులనీ:
మాట్లాడేవాళ్లు ఎవరూ లేక ఆహ్వానిస్తావు అందరినీ నువ్వు
నిన్ను చూసి తప్పించుకునేవాళ్ళనీ
నిన్ను చూసి పరిహసించే వాళ్ళనీ
నిన్ను ఓదార్చి వాడుకునే వాళ్ళనీ
నిన్ను వాడుకుని విసిరేసే వాళ్ళనీ
నీలోని ఆ నిశ్శబ్ధాన్ని భరించలేక
నీలోని ఆ నిశ్శబ్ధాన్ని పూరించలేక
అంతిమంగా అందరూ ఒంటరే అని తెలిసీ తప్పించుకోలేక
వాళ్ళనే, నిన్ను శబ్ధంగా మార్చిన వాళ్ళనే
నిన్ను బోలు వాచకంగా మార్చిన వాళ్ళనే
వాళ్ళనే ఆహ్వానిస్తావు నీ ఏకాంతపు తోటలోకి
వాళ్ళ కత్తులతో వాళ్ళ హింసలతో
వాళ్ళనే ఆహ్వానించి దీవిస్తావు నీ
ఆ పరిపూర్ణ వేదనతో నివేదనలతో:
చీకటి చెట్ల మధ్య నుంచి ఈ శీతల రాత్రిలో
రాలిపడుతొందోక రామచిలుక
నలుపు వలయపు నీటిలో తెగిపడుతొందొక
నీలి నింగిలో నివ్వెరపోయిన నెలవంక
ఆగి, ఆగీ ఆగీ వీస్తోందోక తనువును తహ
తహలాడించే ఒక పురాతన స్మృతి గీతిక
తెలియదా నీకైనా సునయినా
నెత్తురు రుచి మరిగిన నరలోహపు లోకమే ఇది అని
దేహపు రుచి మరిగిన లోహమానవ కాలమే ఇది అని
తెలియదా నీకైనా సునయినా
వదన వ్యసనాలలో, యంత్రనగరిలో మంత్ర తెరలలో
ఒకరినొకరు కడతేర్చుకుని చిట్లే అద్దాల చిత్తరువిదని?
అందుకే/నా నీకు సునయినా, నీ నల్లటి నయనాల నిండా
ఊరికే కొంత పిచ్చి నవ్వు. ఊరికే కొన్ని దిగంతాల
శరీరం ఎక్కిళ్ళు పెట్టె ఏడుపు. ఎందుకు వచ్చామో
ఎందుకు పోతామో తెలియని మహా కాంతి లోకాల
సప్తరంగుల అనామక దిగులూ, మృత్యువూ?
అందుకే, మాట్లాడే వాళ్లు ఎవరూ లేనందుకే ఎవరూ
ఎటూ ఎలాగూ రానందుకే
మాట్లాడుకుంటావు నీలో నువ్వు, నాతో నువ్వు=
ఇంతకూ, నువ్వు లేని రాత్రిలో నీకై తిరిగి తిరిగి
నువ్విచ్చే పాలకై వెదికి వెదికి
గదిలో ఒక మూల తెగిపడిన
ఆ బూడిద రంగు పిల్లి కూనను చూసావా నువ్వు
నా అనంత నిర్యాణాల నా అనంత పునర్జన్మల
పురాకృత పురాస్మృతుల
మల్లెమొగ్గల జాడల వెన్నెల అలలైన సునయినా?
*13-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి