పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఆగస్టు 2012, మంగళవారం

అనిల్ డాని // యదార్ధ నాటకం //



యాభై ఏళ్ల కిందటి ఒక భయానక దృశ్యం
వళ్ళు గగుర్పొడిచే జీవితపు యదార్థ నాటక
సన్నివేశం సరి దిద్దలేని శాపం అదే నా జీవితం

జీవితం తెలియని రోజులు
అమ్మ చేతి ముద్దలు
చింతగింజ ఆటలు,గుజ్జనగుళ్ళు
అమాయకపు చూపులు
పన్నెండేళ్ళ వయసు
పాలుగారే బుగ్గలు
బడి కి వెళుతూ పాఠాలను .
వల్లెవేయడమే తెలుసు అదే
నా బాల్యపు తీపి గురుతు

ఓ రోజు ఆ రోజు అమావాస్య ! ఏమో నాకూ తెలీదు
ప్రకృతి కూడా పసిగట్టలేదు, నాకు పట్టబోయే ఖర్మ
రోజుకూసే కోడి కూయలేదు, పూచే మందారం కొమ్మ
పూయలేదు అప్పుడే శంకించాను ఆనాటి అనర్ధం
మా ఇంటికి వచ్చిందో అనర్ధం ముసలాడి రూపం లో

పిల్ల బెషుగ్గావుంది,నీ అప్పులన్నీ ఎగిరిపోతాయి
నాన్న కళ్ళలో ఆశ,ఆశపడ్డ అందలం ఎదురైనట్టు
ముహూర్తాలతో పనిలేదు పిల్లనీదే
పొద్దున్నే కూసే కోడి కూర ఐయింది
నా పాలబుగ్గపై చిటికపడింది ఆశ గా

ఆశల తరాజులో నా జీవితం లెక్క తెలిపోయిందో రోజు
ముస్తాబు చేసి టౌను గౌను వేసి , పౌడేరూ కాటుకా పెట్టి
పట్టీలు పెట్టి ఎత్తుమడాల చెప్పులేసి ఘల్లు ఘల్లున
సాగింది నా పయనం నా కు తెలియకుండానే నరకానికి
పెద్ద ఇంటి పెత్తనానికి బయలు దేరింది నేను అనేపిచ్చి పిల్ల

బాగా ఎరిగిన మొహమే మా ఇంట్లో కోడి కూర తిన్న తాతే గా
ఏమి కాదు నాన్న సర్దుబాటు , అమ్మ మొహం లో తత్తర పాటు
ఎప్పుడు వెళ్తాం ఇంటికి అమ్మకి నా ప్రశ్న?ఇది నీ ఇల్లే నాన్న జవాబు
అర్ధం కాలేదు చిన్న పిల్లగా హ హ హ హ హ అని నవ్వులు బోసి తాత వి

ఒంటరిని సాయంకాలానికి పెద్ద మేడ లో దీపపు కాంతి లో
చెమటే వుంది నాతొ పాటు నా వంటికి అతుక్కుని
భయం చేతులు కాళ్ళు వణికించింది చలికాలం కాకపోయినా
పెద్ద మంచం ఎక్కలేకపోయా తనే ఎక్కించాడు
నిద్ర లో పెద్ద మెలకువ ఏదో జరుగుతుంది
పెద్ద గొడ్డలితో చిన్న పండును నరికిన అనుభవం
ఇంక ఎప్పటికి నిద్ర పట్టలేదు రాత్రి ఒక నరకం ఎప్పటికి

పట్టు చీర వంటి కి బరువైంది తను ఉన్నంత కాలం
తాళాల గుత్తి నా నడుముని వంచేసింది తనులేని కాలం
చూపుల అర్ధాలను జీవిత నిఘంటువులో వెతుక్కుంటూ
ముప్పైల నిండు యవ్వనం లో తెల్లటి చీర వైధవ్యాన్ని వెక్కిరిస్తూ అద్దం
వోడలేక ,ఆడలేక ఆట మద్యలో మానలేక
లేని రాని పెద్దరికం నటిస్తూ, మనసు చచ్చినా
విధవ దేహంతో బతుకుతూ జీవిస్తున్నా జీవచ్చవంలా

యాభై ఏళ్ల కిందటి చిన్నారి పెళ్ళికూతురిని.

*13-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి