పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఆగస్టు 2012, మంగళవారం

బూర్ట వెంకటేశ్వర్లు || నువ్వూ-నేనూ-ప్రేమా ||

నువ్వు మొదటిసారిగా నా కళ్ళలో కదలాడావు
లేత రావిఆకు గుర్తొచ్చింది
దిరిసెన పూవు చెంపను తాకినట్టనిపించింది

నేల యెదమీద వరిపొలం ఒయ్యారంగా ఊగినట్టుగా
సన్న జాజితీగ అల్లుకున్నట్టుగా
గడ్డిపూవుమీద సీతాకోక వాలినట్టుగా
నల్లమబ్బులనుండి వెన్నెల వాగు దూకినట్టుగా
నువ్వు మొదటిసారి నా మనసులో రూపు కట్టావు
నువ్వు మొదటిసారిగా నా హృదయాన్ని
ఎగిరే పక్షిని చేశావు

నా పూరిపాక
బంగారు కాంతితో మెరిసిపోతోంది
పిల్లబాట
జలతారు నదిలా సాగిపోతోంది
ఊరపిచ్చుక
వరిగొలకను కంఠాభరణం చేసుకుంటోంది
రాజహంసొకటి
నా హృదయంతో కలిసి ఎగురుతోంది
నువ్వు మొదటిసారి నన్నొక ప్రేమికుణ్ణి చేశావ్.

*13-08-2012

1 కామెంట్‌:

  1. -ఆర్.దమయంతి.16 ఆగస్టు, 2012 3:43 PMకి

    * లేత రావిఆకు గుర్తొచ్చింది..
    *నల్లమబ్బులనుండి వెన్నెల వాగు దూకినట్టుగా..
    బావుందండి.
    -ఆర్.దమయంతి.

    రిప్లయితొలగించండి