పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, ఆగస్టు 2012, శుక్రవారం

బాలు || ఏం చెప్పాలి!||


అమ్మా నాన్న కష్టం
ఒక్కొక్క చెమట చుక్క రాల్చి
కూడ పెట్టిన డబ్బుతో
పై చదువులకు పట్టణం
పంపితే...

ఈ చదువులు
నేర్పేదేమిటో
నాకు తెలియటం లేదు
చదువు అయినాక
ఉద్యోగం వేట ప్రారంబిస్తే....

చదివిన చదువుకు
చేయలిసిన పనికి
ఇచ్చే జీతానికి
చేయించుకునే పనికి
ఏదోలా ఏడుదామంటే...

పొనీ..ఉద్యోగం
ఇస్తాడా..!
లేదు
ఏదో కోర్సు
పేరు చెప్పి
బాగా డిమాండుంది
ఒంట పట్టించుకురా అంటాడు

ఆ కోర్సు
ఈ కోర్సు
అని
అన్ని కోర్సులు
తలకు పట్టిస్తే...

కామ్ స్కిల్ల్స్
మెరగు చేయమని
ఆంగ్లములో
నాలుగు చివట్లతో
సన్మానిస్తాడు

అతి కష్టం మీద
మెరుగులు దిద్దు కొంటె
అనుభవము వుంటే మేలు
కొత్తవారికి అవకాశాలు తక్కువేనంటు
సగౌరవంగా సాగానంప్పుతాడు

ఏమి చదువులు ఇవి!
వెనక్కు తిరిగితే
ఇరవైకి పైబడి
వెక్కిరిస్తున వయస్సు

నాన్నా బ్యాంకులో
డబ్బు వేయమని
అడిగే దైర్యం లేదు
నాన్న నాకోసం
బాకీకి వెనుకాడడు

ఆకలి బాద చంపుకోలేక
కాలి డొక్కను
నెలకు అంచి
బోర్ల పడుకుంటే
నెల తల్లి సముదాయించింది

ఇంటికి పోవాలి అంటే భయం
అవమానాల హారాలతో
మాటల గునపాలతో
సిద్దంగా వుంటారు
అమ్మలక్కలు

అటు పక్కన నుంచో
ఇటు పక్కన నుంచో
వదినగారు అంటూ
చెక్కర కోసం వచ్చి
చక్కర్లు తిరిగేల మాట్లాడుతుంది
ఓ ఆవిడా..

నా దారిద్ర్యాన్ని
దండోరా వేస్తూ
నాలుగు
వీదులకు
చేరవేస్తుంది
ఇంకో ఆవిడా..

కమ్మగా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందో..?
ఎన్ని బాధలు ఉన్నా..
రాత్రికి అమ్మ
అన్నం ముద్దలు కలిపి
నోట్లో పెడుతూ
ఏరా అయ్యా..
సరిగా తినడం లేదా!
సగం సిక్కిపోయినావు
అంటూ అడుగుతుంటే....
ఏం చెప్పాలి..!

బాలు*29-08-2012*

ఈడూరి శ్రీనివాస్ ||అంకురం||


గాఢాంధకారంలో జగత్తు
గాఢ నిద్రలో నేను
ఇంతలో ఏదో అలజడి
ఒక స్త్రీ మూర్తి రోదన
నేను ఏదో ద్రవంలో
తేలుతున్న భావన
నెమ్మదిగా కిందికి జారుతున్నా
అలా మొద్లైంది
నా తొలి ప్రయాణం
అంతలోనే ఏదొ అడ్డంకి
స్త్రీ మూర్తి ఊపిరి బిగించింది
నన్ను ఏదో శక్తి బయటికి నెట్టింది
నాకు భయంతో ఏడుపొచ్చింది
అక్కడున్న అందరికీ నవ్వొచ్చింది
మగ బిడ్డ అన్న మాట వినిపించింది
సరిగ్గా అప్పుడే....అంకురించింది
పురుషాహంకారం!!!

30/8/2012

ఆమె - 2 // ప్రవీణ కొల్లి //


ఊరికే జలపాతం ఆ కొలువులో
పారే సెలయేరు తన లోగిలిలో
సూరీడుతో సావాసం
కాలంతో సహవాసం
పరుగు పరుగుల ఆరాటం
అలుపెరగని అస్తిత్వపు ఆశయం ఆమెది ...

కంటతడిని గుండె అడుగున
గుండె వ్యధను మునిపంటి అంచున దాచేసి,
కన్నుల్లో స్తైర్యం
చేతల్లో విశ్వాసం
చెరగని చిరునవ్వు శక్తిగా
అహంకారానికి ఎదురు నిలిచి
మగువగా తనను తాను ఎక్కుపెట్టి
ఉద్యోగం, వ్యాపారం అది ఇది అన్నింటా
ఎదిగి ఎదిగి ఒదిగి ఒదిగిన నిరంతర శ్రామికరాలు ఆమె....

సాయం మాత్రమే నాది
బాధ్యత నీదే సుమా!
ఇదిగిదిగో తరతరాల ఇల్లాలి నియమాలు
సౌక్యపు పరిధి దాటితే
ఎత్తి పొడుపులు గునపాలు
మేడిపండు తెలియకనా?
ద్వందవైకరి మారునా?
ఆత్మీయత భాద్యతల నడుమ నలిగిన హృదయపు నిబ్బరం ఆ దొరసానిది..

ఆమెదంతా
బయట ఎదిగే పోరాటం
ఇంట ఒదిగే ఆరాటం
వెరసి, సరితూకపు తూనిక ఆమె.....

30/8/2012

మోహన్ రుషి // బ్రూటస్ నే! //


నమ్ముతాననే చెప్పింది కానీ
మాటలో బలం లేదని తెలుస్తూనే ఉంది!

నాతోనే ఉంటానని చెప్పింది కానీ
ఉండకపోవడానికి సంబంధించిన స్థిరచిత్తమే ప్రస్ఫుటించింది!

ఇంకెవరూ లేరనే చెప్పింది కానీ
నేను చేసిన మానని గాయాల ప్రస్తావనే కనిపించింది!

తనని నేను భరించలేననే చెప్పింది కానీ
బండలతో సహజీవనం సాధ్యం కాదనే వినిపించింది!

కూలిన రాజ్యాలను పునర్ నిర్మించొచ్చేమో కానీ
చెదిరిన ఆ పిచ్చుక గూడును
ఏ గడ్డిపోచలతోనూ తిరిగి కట్టలేనని
చెద పట్టిన మనసుకు తెలుస్తూనే ఉంది!

30/8/12

కిరణ్ గాలి || Casanova ||


నేనెప్పుడూ
ప్రేమించలేదు
ప్రేమించబడనూ లేదు

నాకోసం ఎక్కడా ఒక్క వెచ్చటి కన్నీటిచుక్క నేలరాలిన దాఖలాలు లేవు
ఏ అందమైన మునివేళ్ళూ తమ డైరీలో నన్ను ఆజన్మ ఖైదుగ బంధించలేదు
ఏ మూసిన కనురెప్పలు తమ మనఃఫలకంపై నన్ను మురిపెంగా ముద్రించుకోలేదు
ఏ ఆలింగనము దేహన్నిదాటి నన్ను తమ ఆత్మతో స్పృశించిన స్మృతి లేదు

నేనెప్పుడూ ఎవరి ఊహల రాకకై కలలపట్టాలను కాలంపై పరచలేదు
ఎవరి అమోదంకోసం చిక్కటిరక్తాన్ని చిందించిన చారిత్రక ఘట్టాలు లేవు
ఎవరి స్మృతులను రాజేసి నిశీధిలో నిద్రలేనిరాత్రినై చలికాచుకున్న గుర్తులేదు
ఎవరి నిర్దాక్షిణ్య నిష్క్రమణ...ఘడియైనా నా గడియారపు బాహువులను ఆపలేదు

***

అవును నిజం..నేనెప్పుడూ ప్రేమించలేదు..ప్రేమించబడనూలేదు..
అలాగని ప్రేమంటే నాకెటువంటి అపనమ్మకమూ అనంగీకారము లేదు

ప్రయత్నించాను అదేపనిగా ఒక "నిన్ను", మరొక "తనను", మరెన్నొ "తనువులను"
వాంచించాను అతిపవిత్రంగా మనసుని, ఆత్మని....ఏ శరతులులేని శరీరాన్ని

***

వెన్నెల్లో తడుస్తూ మెత్తటిఇసుక పాదాలకు జతనైనప్పుడుకూడా
నా చూపు దిగులుమేఘాలనడుమ మౌనంగా దుఃఖించే చంద్రునిపైనే

అలలుఅలలుగా ముద్దులు పెదవులతీరంపై ఎగిసిపడుతున్నా
నా చూపు ఎందుకో సుదూరాన దారితప్పిన ఒంటరిఓడపైనే

కారులో కోరికల గేర్లుమారి లిబిడోమీటర్ గిర్రున తిరుగుతున్నప్పుడు కూడ
నా చూపు రేర్ వ్యు మిర్రర్లో రొప్పుతూ వెంటాడుతున్న జ్ఞాపకాల జాగిలాలమీదే

పబ్బులో పావురాయిరెక్కలు నన్ను గూడులోకిరమ్మని గోముగా గుంజుతున్నా
నా చూపు లేత పిడికిటిలో చలనము, రంగు లేని రబ్బరు బూర మీదే

ప్రేమని వ్యక్తీకరించడానికి స్పర్శ అవసరం
ప్రేమని అనుభూతించడానికి కూడా అదే మార్గం
కాని కేవలం స్పర్శకోసమె అయితే
ప్రేమనే అందవికారమైనముసుగు తొడగనవసరంలేదుకదా?

***

ఒక స్నేహం, ఒక స్వాంతన, ఒక సాంగత్యం, ఒక సంగమం
ఎవరి కారణాలు, వారి కుండవచ్చు.
ఎవరి నిర్వచనాలు వారు ఇచ్చుకొవచ్చు
దాహమెదైతెనేమి ఎలగోల దప్పిక తీరాలిగా

కోరుకున్న వారినెవరిని కాదనలేదు
అందుకోగలిగినంతా అందించాను
ఒకరి తర్వాత ఒకరిని, ఒకరు కుదరక పోతె మరొకరిని
ప్రేమించె గలిగే లౌక్యం లోక జ్ఞానం లేని వాడిని

నేనిక్కడే ఈ తనువుల తపొవనంలొ
నా దేహపు గుంజను పాతి నా చుట్టూ నేనే
వలయమై నిరంతరంగా పరిభ్రమిస్తున్నా
ఏ పువ్వో వచ్చి నాపై శాశ్వతంగా వాలక పోతుందా అని

***

మోహాల వేటలో,
నిస్సుగ్గు నగ్నత లాంటి చిటికెడు ప్రేమ కొసం
అనేకానెక శరీరాలను అన్వ్యేశిస్తూ
కాలి పోయి రాలి పోయిన
నా యవ్వనానికి అంకితమిస్తూ
...ఒకానొక కాసనొవాను

***

నువ్వు ప్రేమించావా? సులువైన ప్రశ్న
నిన్ను ఎవరైన నిజంగా ప్రేమించారా? నీకెప్పటికి జవాబు దొరకదు

సులువైన ప్రశ్నకి కూడ నీ దగ్గర సమాధానం లేనప్పుడు
"తొలిసారివై" ఏ దేహాన్ని తాకకు

Date: 30.08.2012

మనోజ్ఞ || గులాబీలు ||


ఒకే తోట గులాబీలవి..

కొన్ని కోవెలలో స్వామి అర్చనకు.
కొన్ని వెలయాలితో చీకట్ల సరసాలకు..
కొన్ని పాడె మీద పార్ధివ అంతిమయాత్రకు.

*ప్రసాదం శిరసా గృహ్ణామి*
అంటూ..
కళ్ళకద్దుకుని జడలో పెట్టుకున్నవి కొన్ని.

* ఐ లవ్ యూ *
అంటూ..
ప్రేయసి కళ్ళల్లోకి చూస్తూ ఇస్తున్నవి కొన్ని..

*ఏయి !! నిన్నసలూ *
అంటూ...
మీదపడ్డ కామదాహాలకు
పక్కమీద నలిగిపోయినవి కొన్ని..

రాజకీయ నాయకుల
నాటకాల చేష్టలకు
అతిశయంబైనవి కొన్ని..

అంతిమ యాత్రలో
పార్థివం నుంచి క్రింద పడిపోతూ,
చక్రాల కింద నలిగిపోతున్నవి కొన్ని..

""ఇంద, అర్చన చేసిన పుష్పమిది. జడలో పెట్టుకో""..

"ఛీ.. అది ముట్టుకోకు! శవం మీద నుంచి పడింది! "..

" ఇది నా మనసనుకో. నీకు అర్పిస్తున్నాను ప్రియా"

"అబ్బా... నలిగిపోయింది. అసహ్యం" !!

పాపం!!!
ఒకే తోట గులాబీలవి !!!!

28.08.2012

యజ్ఞపాల్ రాజు II సంయుక్తాక్షరం II


అదొక సంయుక్తాక్షరం
ముగురమ్మల మూలపుటమ్మలా
మూడింటి సంగమం
మూర్తీభవించిన
మాతృత్వం
పోతపోసిన
సౌందర్యం
అలవిగాని
మార్దవం
ఇదీ అని చెప్పలేని
అద్భుతతత్వం
ప్రకృతి మొత్తాన్నీ
తనలో నింపుకున్న
అర్థం
ప్రేమకు మరో రూపం
శక్తిని పోలిన అస్థిత్వం
చిరు అక్షరం
భావం అద్భుతం
రాసేముందు
రచయిత సందేహిస్తాడు
ఊహించేముందు
కవి ఆలోచిస్తాడు
గీసేముందు
చిత్రకారుడు
ఒక్క క్షణం ఆగుతాడు
మలచేముందు
శిల్పి తనను తాను
తరచి చూసుకుంటాడు
ఆ అక్షరంలోని ఆంతర్యాన్ని,
అంతరార్థాన్ని
సంపూర్ణంగా అందుకోగలమా అని
ఆ అక్షరం
"స్త్రీ"

30/8/2012

క్రాంతి శ్రీనివాసరావు || నేనూ...అతనావిడ నీడా.....||


నేనింకా నిద్రను వ్రేలడుతూ వుండగానే
కిరణాలు తలుపు కొట్టిన శబ్దం
కిటికీ సందుల్లోంచి
తోసుకొనివచ్చింది

తలుపులు తెరచి సూర్యుణ్ణి
పలకరిద్దామనుకొనేలోపే

వాళ్ళావిడ నాలోంచి దూసుకొని
నావేషం వేసుకొని ఇంట్లో కొచ్చేసింది

పెద్దముత్తయుదువ ముఖం చూసి
శకునం బావుందనుకొన్నాను

వరండాలో తీరిగ్గా చదువుతున్నగాలిని
న్యూస్ పేపరు అడిగితీసుకొని

కాఫీరాగం తీయాలని గొంతుసవరించుకొంటున్న
పాల ప్యాకెట్టు తెచ్చుకొని

కప్పు. కాఫీ చాయాదేవికి ఇచ్చి
కబుర్లు చెప్ప చెప్పమన్నాను

ఆయనకెవరడ్డమొచ్చినా
నే నొస్తూనేవుంటాను

పారదర్శకత నీలో లేనప్పుడు
పరవసించే రంగులెన్ని తొడుక్కొన్నా
నల్లని నీడై నిను వెంబడిస్తాను
నిజాయుతీ జాడలు నీలో లేవని
నీ అంతరంగం నే వెళ్ళడిస్తాను

వాడికిరణాలతోఆయన పొడుస్తున్నప్పుడు
నీడ నయనాలతో నేను కాపాడుతుంటాను
అని చెబుతుండగానే
తెనెపీక కుడుస్తూ వస్తున్న మనవడు
తననీడను తనతో రావద్దని మారాంచేస్తున్నాడు

కర్లపాలెం హనుమంత రావు॥ (ఇం)ప్యూర్లీ పాలిటిక్స్!॥


1
బొగ్గు మంటతో
కాగ్ తోంది
దేశం
2
బొగ్గు ఇనుము బాక్షైట్
రత్న గర్భ నాదేశం
గర్భాదానమే అక్రమంగా జరిగిపొయింది
3
2-జీ ఒక 'వేలం' వెర్రి
'బొగ్గు' ఆ వేలం కూడా లేని వెర్రి
4
గోద్రా
నరేంద్రుడి
'మోడీ'
5
బొమ్మ న్యాయం
బొరుసు అన్యాయం
రెండూ బొరుసులే ఉన్న నాణెం-రాజకీయం
6
అన్నా రాజకీయ పార్టీ
హస్తానికి రిపార్టీ
9
నల్లధనం-
ఏ కనిపించని నాలుగో సింహం
నోట్లో!
10
మంత్రివర్యా... తిన్నంగుండు
తప్పుతుంది
తిరుపతి గుండు!
11
రైతు దేశానికి వెన్నెముక…
సరే!
వెన్నెముక లేని పాలనా మనది!
12
నెలలు నిండకమునుపే
బడికడుపు నుండి బయటకొచ్చేస్తున్నారు
ప్రీమెచ్యూర్ డ్ బేబీస్!
13
ఓబులాపురం గనుల కేసు-
గాలితో చేసే యుద్ధం కాదు గదా
చివరికి!
14
జెడి కాల్ లిస్ట్ కేసులో
తత్కాల్ బుక్ చేసుకున్నాడు
వెంకట రెడ్డి!
16
వాన కావాలా!
వరుణయాగం ఎందుకు
ఉప్పల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడించు!
17
విద్యుత్
రిలయన్స్ గాలికి పెట్టిన దీపం!
18
కరువు వలన భక్తుల రాక తగ్గింది
వర్షాల కోసం దేవుడూ
ప్రార్థిస్తున్నాడు!
19
తివిరి
ఇసుమునా
'తైలంబు' తీయవచ్చు!


30-08-2012

భాస్కర్ II యోధులు II


"..చావు
సహజమైన
చోట
బతకడం నిత్యం
యుద్ధమైన
చోట
సమస్యలు వేధిస్తున్న
చోట
గుండెల్లో చూపులు
గునపాలుగా మారి
శూలాలై పొడుస్తున్న
సమయంలో ..
అంతా నా వాళ్ళుగా
అనుకున్న చోట
లోకం ..సమాజం
ఏకమై
వెంటాడుతున్న క్షణంలో
అలుపెరుగక
పోరాటం చేసే వాళ్ళకు
అన్నిటిని..అందరిని
వదిలేసి ఉద్యమించే
వాళ్ళే యోధులుగా
మిగిలి పోతారు ..
అలలు వస్తాయని
సముద్రం వెనక్కి
వెళుతుందా
తుపాను వస్తుందని
వర్షం ఆగిపోతుందా
కానే కాదు ..ఎదురొడ్డి
నిలిచే వాళ్ళను
గెలుపు వరిస్తుంది
వెన్ను చూపని
వాళ్ళను
విజయం ముంగిట
వాలి పోతుంది
సవాళ్ళను చూసి
జడుసుకునే వాళ్ళు
ఎన్నటికి ..ఎప్పటికి
గమ్యాన్ని చేరుకోలేరు
తెగువ చూపిన వాళ్ళే
యోదులవుతారు ..
వాళ్ళే విజేతలుగా
నిలుస్తారు .."
తేది : ౩౦.08 .12

డా.పులిపాటి గురుస్వామి || బై బై చెప్పే చేతులు ||


నిన్ను చూడటానికి వచ్చానా !
నా కళ్ళ భాషను
హత్తుకోకుండానే ఆనందం ప్రకటిస్తావ్

ఈ ఒక్క క్షణమే
మనసు మీదుగా
అన్ని మూసిన కిటికీలను తెరవలేక

నువ్వూ నేను చీకటికి తెలియం
చీకటైన నువ్వు తెలుసు స్పష్టంగానే

బేరలు చేడిపేస్తే మనం దగ్గరే
నీ చుట్టూ ఎన్నున్నాయో
నా చుట్టూ ఎన్నున్నాయో
ఎప్పుడు లెక్క కట్టాలె

దూరం నుండే చేతులూపుకుంటూ
గుండెను బలవంతంగా
జోకొట్టుకుంటున్నాం.

30, ఆగస్టు 2012, గురువారం

బాలు|| పాడు వాన ||


ఆరుబయట బల్కాన్ని
కుర్చీలో నేను
జోరున వర్షం
ఎదురుగా వేప చెట్టు
ఇంద్రధనస్సు మద్య
ఒక్కొక చినుకు
చెట్టుపై పడుతుంది
చిర్రుజల్లు తుంపర్లు
నా మోము మీద పడుతున్నాయి

హఠాత్తుగా ఒక మెరుపు
ఆకాశంలో కాదు
మా ఎద్దురుగా ఉన్న డాబామీద
గులాబి రంగు పంజాబీ డ్రెస్లో
రెండు చెత్తులు గాలిలోకి తిప్పుతూ
మొహాన్ని ఆకాశం వైపు పెట్టి
ఒక్కొక చినుకును ఆస్వాదిస్తున్నది

నా కళ్ళు రెప్పవేయటం మరచి
ఒక వింత చూస్తున్నట్లు
చూస్తున్నాయి....
చరడంతా పెద్దవి చేసుకొని

ఆ లేత గులాబీ డ్రెస్
పసుపు పచ్చని
తన శరీరానికి
బిగుతుగా అతుకుపోయి
తెగ సంబరపడుతుంది

నువ్వే కాదు
మేము అస్వాదిస్తున్నాము
తన అందాన్ని అని
వాన చినికులు చెప్పుకుంటున్నాయి

ఆ ఆనందాల భామ
అందచందాలు
ఓ పది నిమషాలు
చుసానోలేదో

పాడు వాన
నా మీద కక్ష కట్టి
ఆగిపోయింది
తను వెళ్ళిపోయింది

నేను మాత్రం
మళ్ళి ఎప్పుడు!
వర్షం పడుతుందా
అని చూస్తున్న
తన రాక కోసం...

బాలు*28-082012*

నరేష్ కుమార్ // చేతబడి //

ఇపుడు
మేమేం చేయగలం..!?
ఆత్మగౌరవానికి
చితిని సిద్దం
చేయటం తప్ప

మేం మహా మాంత్రికులం
అన్న పచ్చబొట్టు
నుదుటిపై
దిద్దించుకున్నాక
మరిక మేమేం చేయగలం...!?

మంత్రగాళ్ళనీ....,
రాక్షసులనీ...
శరీరాలను వేలాడేసుకునే
శిలువలని
మోసుకుంటూ
పరిగెత్తుతూనే ఉన్నాం.....

ఐనా...!
క్షణంలో
ప్రాణం తీసె
మనిషిపేరు వింటే...
ఇపుడు
కాష్మోరా
వణికి పోతున్నాడు.....,
తననెక్కడ
డ్రైనేజి గుంటలో
పూడ్చేస్తారో నని
పాతాల కుట్టి
పారిపోయాడు....
తందూరి పొయ్యి ని
చూసిన
ఆరథ్యుంగ
ఒళ్ళు చల్లబడింది...

ఇప్పుడు
క్షుద్ర గణాలకు
ఇల్లేది...?
స్మశానాలన్నీ
కబ్జా చేసారుగా..!

మా వెంట్రుకలూ, గోళ్ళూ...
కత్తిరించుకొని
మా మీద
మేమే
చేతబడి
చేసుకోవాలిప్పుడు.
(mantragaadanea anumanam toa gramam nundi tarimi kotti bhumini laageasukunte paripoai vachi granit minelo kulee gaa maarina oka orissa girijanunni vinnaka) 29/08/12

నగరంలో పద్యం మరణిస్తుంది //కోడూరి విజయకుమార్ //


శిరసు చుట్టూ ప్రదక్షిణలు చేసే
రంగురంగుల సీతాకోకలు కొన్ని
సీతాకోకల చుట్టూ అల్లుకునే
కొన్ని అక్షరాలు...

పద్యం ప్రాణం పోసుకొంటోన్న అలికిడి
చెవుల్లోంచి గుండెలోకీ, శిరసులోకీ దూసుకొచ్చి
సీతాకోకల్ని చెదరగొట్టే
గడియారం అలారం మోత
ప్రాణం పోసుకొంటోన్న పద్యం కంపిస్త్తుంది

కాసేపు దినపత్రికలు మోసుకొచ్చిన లోకాల్లోకి....
పాలితుల దయనీయ వెతలనార్పే
చల్లని మాటలు ప్రవహించాల్సిన పవిత్ర ప్రాంగణం
ఒకరి బాగోతాల లెక్కల్ని మరొకరు విప్పుకున్న
రాబందుల రాకాసి శబ్దాల నిలయమైన విషాదం
గుక్కెడు నీళ్ళివ్వని మహానగరాన్ని శపించి
మృత్యుబిలంలోకి జారిన ఒక పేదలబస్తీ
నాగరిక జీవనశైలి మొహాన్ని వెక్కిరిస్తూ
పట్టపగలు పగలబడి నవ్విన యాసిడ్‌ బాటిల్‌
లేచి నిలబడి పద్యాన్ని అందుకోవాలని చూస్తాను
ఆఫీసుటైము కాలరు పట్టుకుని ఆపేస్తుంది

మహానగర రహదారుల మీద పరుగులు
నగర జీవితాన్ని కమ్మేసిన పరుగుకు ప్రతీకలు
పరుగుల మీద బ్రేక్‌ వేసే ట్రాఫిక్‌ రెడ్‌లైట్‌
కరెన్సీ కట్టల్ని మింగి పుట్టిన లగ్జరీకారు
రొట్టెముక్క కోసం చేయిసాచే పసిపాప
పద్యం కోపంతో వూగిపోతుంది
పరుగుల్ని గుర్తుచేస్తూ వెలిగే పచ్చలైటు
పద్యం మీద నీళ్ళు గుమ్మరిస్తుంది

దైనందిన నగరజీవిత పరుగుల నడుమ
పద్యం అప్పుడప్పుడూ నాకై చేతులు చాపుతుంది
అందుకోలేని అశక్తత యేదో వెనక్కి లాగుతుంది

రాత్రి పక్కమీద అలసటగా వాలే దేహం
ఉదయపు సీతాకోకల కోసం వెదుకుతుంది
లోపలెక్కడో యేదో కుళ్ళిన వాసన
పద్యం మరణించి వుంటుంది...
ఇక రాత్రంతా శవ జాగరణ....

నీ ||మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!! ||


మా ఊరంటే బస్సే గుర్తొస్తుంది..!

చదువుకోటానికి నానా అగచాట్లు పడేప్పుడు

ఫ్రీ-పాసులిచ్చి పదికిలోమీటర్లు పట్టుకెళ్ళి,
అక్షరాలు నేర్పిన "అదే"గుర్తొస్తుంది.

ఊటుకూరు పొలంలో కోటేరుని,
కొణిజర్లలో స్మసానం లో తగలబడుతున్న శవాన్ని..
ఒళ్ళోకూర్చోబెట్టుకుని కళ్ళారా చూపిచ్చిన బస్సు గుర్తొస్తుంది.!
కిటికీకి గడ్డం ఆనిచ్చిన చిన్నతనం,
సీటెనుక పదేళ్ళప్పుడు రాసిన కవిత్వం గుర్తొస్తుంది.!

బస్సంటే నన్ను చంకనెత్తుకున్న్న అవ్వ,
బస్సంటే నావరకు గోరుముద్దలు తినిపించిన అమ్మ!

మా ఊరి మోటుజనపు నేలవిమానం బస్సు

ఎవడో చుట్టంగాడి పెళ్ళికి అందరూ..
చిన్నకార్లలొ,మోటారుసైకిల్లలో వస్తే..
మా గరీబు నాన్న ఎక్కించిన ఎర్రబస్సు గొప్పగా గుర్తొస్తంది !

ఎదో పనిమీదెళ్తే..
దిల్-సుఖ్-నగర్ రోడ్డుమీద మా బస్సు కనిపిస్తే
ఎదురెళ్ళి ముఖం మీద ముద్దుపెట్టుకోబుద్దయ్యేది,
ఒక పాత స్నేహితుణ్ణి చూసినట్టో..
ఏదో విషాదం గుండె అడుగునుంచి కారుతున్నట్టొ వుండేది!

* * *
ఎవడో చదువుకున్నోడట బస్సుని రాళ్ళతో బద్దలు కొడుతున్నాడు!
కసాయిలా కిరసనాయులు పోసి కాల్చేస్తునాడు!
ఎవడొ.. దయామయి బస్సుని ధ్వంసం చేస్తున్నాడు!

ఇప్పుడెందుకో బస్సుకి గొంతుంటే బాగుండనిపిస్తుంది నాకు!

మావూరి మట్టిరోడ్డుమీద బస్సుపోతున్నట్లు
నా ముఖం మీద కన్నీళ్ళు పోతున్నాయి

తగలబడుతున్న బస్సుల మధ్య కూలబడి
విజ్ఞానులనే అజ్ఞానుల ఉన్మాదాన్ని వార్తలు చేసుకుంటున్నా..,

అయినా సరె..
కారుతున్న నా కన్నీళ్ళని సీసాలో పట్టుంచా..
తిలక్ ఓసారి ఇలావచ్చి తగలబడుతున్న బస్సుమీద పోసెళ్ళు..

ఇంతకుముండె..
మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!

*29.8.2012 

    భమిడిపాటి // బికారి బ్రతుకు //


    వేకువ దుప్పటిని దులిపేస్తూ
    అప్పుడే రేగుతున్న దుమ్మును
    రోడ్డున పోయే జనాల తిట్లను
    గాలి పాటలా వింటూ మొదలైంది ....

    మా దారి తెన్నులు లేని
    యాచక దారి
    సొంత పేరున్నా చెప్పుకోలేని
    అందరికి తెలిసిన ఈ బికారి !

    ఎవరి కన్న బిడ్డలమో ?
    తెలియని అమ్మని
    తెలిసి ఎంతో మంది అమ్మలాంటి అమ్మలని
    ధర్మం చేయండంటూ ఛీ కొట్టినా వెంటపడుతూ ...

    ఒక్కోసారి సిగ్గేస్తుంది
    ఏ ఇంటి గడప తొక్కాలో తెలీని మా స్థితిని
    ఇలాంటి జీవితాన్నిచ్చిన ఆ దేవుణ్ణి
    దయలేని ఆ పైవోడి విదిరాతని !

    మాకు మేమే అయ్యేమా !
    ఎవరి ఆవేశపు ఆనందానికి రోడ్డున పడ్డామా
    మా ఆవేశాన్ని అణుచుకోలేక
    మా వారసులకి కూడా ఈ వారసత్వాన్ని కట్టబెడుతున్నామా !

    మాలో ఎవరిని తట్టినా
    గతంలేని తన జ్ఞాపకానికి మాలో మేమే సాక్షులమంటారు
    ఆకలి మంటల కేకల చల్లార్చటానికి
    చిల్లర డబ్బుల చప్పుళ్ళకి అలవాటుపడ్డం అని వెర్రిగా నవ్వుతారు ......

    రానే వచ్చిన రాత్రికి
    దొరికిన జాగాపై మాటేసి
    చీకటి దుప్పటి కప్పేసి
    రాత్రి చుక్కలకి రాజులం మేమే అంటూ ..మురిసిపోతూ ..కలలో మైమరచిపోతూ ..
    .29-08-12

    మామిడి హరికృష్ణ || గుప్పిట్లో ఆకాశం.. ||

    వేకువ వెలుగులు ముగ్గులల్లడానికి ముందే
    రాత్రి మేఘాలు విచ్చిన్నమవడానికి ముందే
    నిద్రానిద్ర, కల-మెలకువల ఊగిసలాట సమయాన
    ప్రేమైక వాణివై 'సెల్' లో ఆహ్వాన గీతాన్ని పాడుతావు

    తొలి ఉదయ వేళనే ఆహ్లాదంగా పలకరించి
    స్వర్గాన్ని నా ఎదుట పునర్ప్రతిష్ట చేస్తావు

    స్వప్నాస్వప్న జగత్తులోకి చేయిపట్టి తీసుకెళుతూ
    అనురాగ కౌగిలిలో వివశున్ని చేస్తావు..

    ఇక,
    స్వర్గాన్ని చేతితో, కళ్ళతో, నాలుకతో, పెదాలతో
    తడుముతూ,చూస్తూ,స్పృశిస్తూ, చుంబిస్తూ
    ఆకాశాన్ని గుప్పిట్లోకి ఒడిసి పట్టి
    సముద్రాన్ని పుక్కిట్లోకి బిగియ పట్టి
    వ్యోమ కాలాల వెంట యెగిరి వెళుతూ
    Time- Spaceల భౌతిక పరిమితులను అధిగమించి
    పారభౌతిక-పాంచ భౌతిక అవతారాన్ని ఎత్తుతాను..

    బింబ ప్రతిబింబాల దోబూచులాటలు
    దేహ కోణాల కంపన-ప్రకంపనల-ప్రచోదనాల శ్వాసలు
    శరీర మంతనాలు-మనో మధనాల అద్వైతంలో
    స్వర్గ ఫలాల తేనియలని
    చప్పరిస్తూ, జుర్రుకుంటూ, గ్రోలుకుంటూ ...
    అర మోడ్పు కన్నుల మాయాలోకంలో విహరిస్తూ..
    అర్దాతీత మూలుగుల స్వర ప్రపంచంలో తేలియాడుతూ..
    దాన్నే కొనసాగిస్తూ...
    29 August,2012

    క్రాంతి శ్రీనివాసరావు || చిదంబర రహశ్యం ||


    సంపదకు శాశ్వత చిరునామలేక సంచరిస్తున్నప్పుడు
    ప్రపంచమంతా ఒకే వూరవుతున్నప్పుడు
    దరిద్రమంతా మన పంచనే ఎందుకుంది ?
    ఈఆర్ధిక వంచన అర్దం అయ్యేదెప్పుడో ?

    వస్తువులను చేసేది మనం
    తరువాత కొని వాడేది మనం
    మద్యలో వాడాదుకొనేది ఏందో
    పప్పు మనది పొట్టు వాడిది
    వూదుకు తింటున్నాం చెరిసగం

    ఆదుకోవాల్సిన పాలకపక్షం
    కనిపించని బానిస సంకెళ్ళు రంకెలు వేస్తుంటే
    అంకెల గారడీలు చేసి చంకలు గుద్దుకొంటున్నారు
    ఫలితం లేని పంచవర్ష ప్రణాలికలతో
    పంక్ష్య భక్ష్యాలు వడ్డిస్తామని వగ్ధానాలను వర్షిస్తూనేవున్నాయు

    ఒకప్పుడు రైళ్ళలో తరిలేది సంపద
    ఇప్పుడెందుకో ఈమైళ్ళకే తరుగుతుంది
    అరవైఏళ్ళ స్వతంత్రభారతంలో
    ప్రపంచ ధనవంతుల లిస్టులోకి ఒకరిద్దరు వెళ్ళీతే
    పాతిక శాతం ఆదాయం డెబ్బైకుటుంబాల చెతుల్లో పెట్టి
    డెబ్బైశాతం జనాన్ని దారిద్యంలో చుట్టేశాం
    రోజుకు పాతికరూపాయలొస్తే చాలు
    పరమాన్నం తినొచ్చని పావర్టీ లైను పైకి నెట్టేశాం
    పేదరికం తగ్గిందని లెక్కలు కట్టేశాం

    ఎన్నికలొచ్చిన రోజు
    వందో వెయ్యో ఇందా అంటే
    మందో మాకో వుంది అంటే

    అందలం అందుబాటులోకొస్తుంటే
    అతిపెద్ద ప్రజస్వామ్యాదేశం లో
    ఎప్పుడూ వారసులే సారధులవుతున్నారు
    ఒహో ప్రజాస్వామ్యమా
    రాహు(ల్)కాలమొచ్చిందినీకు
    మరో స్వాతంత్ర్య పోరాటం జరగాలిప్పుడు

    శ్రీ || సామాన్యులమంటే మనం ||

    సామాన్యులమంటే మనం
    ప్రజలే ప్రభువులన్న
    ఒకే అబద్దాన్ని
    పదే పదే నమ్మించే
    అ/ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు కాదు

    సామాన్యులమంటే మనం
    ఇంటి మీద హెలిపాడ్
    పెళ్ళానికి చార్టర్డ్ ఫ్లైట్
    ఒక్క మాట తో
    స్టాక్ మార్కెట్ హాం ఫట్.
    త్రీ పీస్ సూట్లేసుకుని
    సంపద పై స్వారీ చేస్తూ
    తమ ప్రగతే దేశ ప్రగతని
    నమ్మబలికే వ్యాపారవేత్తలు కాదు

    సామాన్యులమంటే మనం
    ప్రభువుల పాపాల్ని తమ విఙానం తో
    రాజ్యాంగ లొసుగుల్లో పాతిపెట్టి
    అవినీతి మూటల మేడల్లో
    హాయిగా వుండే బ్యూరొక్రాట్లు కాదు

    సామాన్యులమంటే మనం
    హీరొయిన్ల లిప్ స్టిక్ ధరల్ని
    హీరోల చీకటి రహస్యాల్ని
    ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల్తో
    అబద్దపు వార్తల్ని అందం గా
    అందించే వాళ్ళు కాదు

    సామాన్యులమంటే మనం
    30 సెకన్ల ప్రకటన తో
    తమ విలువైన కాలాన్ని
    సెకన్ల కి కోట్ల చొప్పున
    అమ్ముకునే సెలబ్రిటిలు కాదు

    సామాన్యులమంటే మనం
    పడవల్లాంటి కార్లేసుకొచ్చి
    సూపర్ మార్కెట్ తోపుడుబండి నిండా
    సరదా కోసం షాపింగ్ చేసె వాళ్ళు కాదు

    సామాన్యులమంటే మనం
    ఒకటో తారీఖొస్తుందంటే ఒణికిపోయే వాళ్ళం
    ఉల్లిపాయ,టమాటా, నిత్యావసరం ఏదైనా
    రేటు పెరిగిందంటే
    బడ్జెట్ సవరణల్తో కుస్తీ పట్టేవాళ్ళం.
    కందిపప్పు పండక్కే వండుకునే వాళ్ళం
    గుక్కెడు నీళ్ల కోసం
    కుళాయి దగ్గర కుస్తీ పట్టే వాళ్ళం
    రేషన్ షాప్ క్యూ లో సహనాన్ని పరీక్షించుకునే వాళ్ళం
    వాన కోసం ఎదురుచూసేవాళ్ళం
    మట్టి వాసన పీల్చే వాళ్ళం
    అనుక్షణం పోరాడే వాళ్ళం..ఆశాజీవులం
    --శ్రీ

    (పొట్టకూటి కోసం కవిత్వాన్ని ఫుట్పాత్ మీద అమ్ముకునే ఒక ఐరిష్ కవి కవిత ని ఫ్రీ గా చదివి అనుసరిస్తూ..,అనుకరిస్తూ..
    మన్నించాలి నాకు అతని కవితే కాదు కనీసం పేరు కుడా గుర్తు లేదు )

    శ్రీకాంత్ కాంటేకార్ || మానవత్వం ఖాయిల పడ్డ కార్ఖానా ||

    మానవత్వమే ఓ ఖాయిల పడ్డ కార్ఖానా
    ఇంకా మనిషికి విలువ ఏ పాటి?
    కల్లోల జీవన సాగరంలో అనునిత్యం
    ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సామాన్యుడిని చూసి చలించదేవరు?
    నీతి బాట వీడక
    కత్తుల వంతెనపై పడుతూ లేస్తూ
    నెత్తురోడుతూ
    గాయాలను ఓర్చుకుంటూ
    బతుకు బండి లాగుతున్న ఒంటరిజీవి గుర్తున్నాడా?
    తడారిపోయిన నీ హృదయ చలిమెల్లో
    రెండు కన్నీటిబొట్లయినా అతడి కోసం మిగిలివున్నాయా?
    నయా అభివృద్ధి ముసుగులో
    రంగురంగుల విద్యుత్ వెలుగులో
    సంపన్నవర్గాలను, విజేతలను మాత్రమే
    కీర్తిస్తున్న నీలో ఇంకా అతడి గురించి భావాలు ఊరుతున్నయా?
    అతడి జీవితం సంఘర్షణభరితం
    తప్పు చేసే అవకాశం ఉన్నా
    గీత దాటే గుండె ధైర్యం లేదు
    బహుశా అమ్మ చెప్పిన నీతికథాసారం
    చెవుల్లో మారుమోగుతున్నదేమో
    పాపపు కూడుతో పైకి రాలేవన్న
    బడిపంతుల పాఠాలు గుర్తుకొచ్చెనేమో!
    పాపభీతి.. పైవాడు గమనిస్తున్నాడన్న భయం వెంటాడుతుందేమో!
    (అందుకోసమే సామాన్యుడిగా మిగిలాడనుకుంటే
    ఈ సమాజంలో మంచితనపు చివరిజ్యోతి కూడా ఆరినట్టే
    అంతటా అన్యాయం అంధకారమే)

    అటు చూడు చెడి బతికిన వాడి వైభవం
    వాడి చుట్టూ చేరిన భజనమేళా సందోహం
    వాడు ఎందరికి చెరుపు చేశాడో ఎవడికి పట్టింది
    ఎన్ని అడ్డదారులు తొక్కి పైకి వచ్చాడో
    ఎవడు అడుగుతాడు
    ఎవడికి మాత్రం అంత ధైర్యం తీరిక ఉన్నాయి కనుక

    వాడు విజయం సాధించాడా లేదా? అన్నదే కావాలి
    ఎంతమంది నోళ్లు కొట్టి
    ఎందరి జీవితాలను బలిపెట్టి
    ఎన్ని గుడిసెలకు అగ్గిపెట్టి
    తన మహాసౌధాలను నిర్మించుకున్నాడో
    ఎవడు మాత్రం శోధించి కనుక్కోగలడు

    ఎందరి వెన్నెముకలు విరిచి
    ఎంతమంది ఆశలను చిదిమేసి
    తన విజయానికి మెట్లుగా మార్చుకున్నాడో
    నువ్వేమైనా ఎరుగుదవా

    మృగరూపం దాచేసి
    సాధు తోలు కప్పుకొని
    చెబుతున్న నీతి మాటలకు
    మైమరచిపోతున్న మానవుడా
    రాజకీయమే రాచబాటగా
    అధికారమే ఆలంబనగా
    నిర్మించిన మహా సామ్రాజ్యాల కింద
    ఎన్ని జీవితాలు విధ్వంసమయ్యాయో
    ఎన్ని బతుకులు బలిపీఠం ఎక్కాయో

    నీకూ నాకూ మాత్రం ఎందుకు పట్టింపు
    నువ్వు నేను బాగానే ఉన్నాం
    తగలబడుతున్న సమాజం
    మన గుడిసెల దాకా రాలేదు కదా
    మన కాలి కింద నేల కదిలిపోవడం లేదు కదా
    అభివృద్ధి పేరిట జరుగుతున్న జీవన విధ్వంసం
    నువ్వూ నేనూ రుచి చూడలేదు కదా
    అందుకే స్పందించొద్దు
    నరనరాలలో ఉడుకు నెత్తురు మరగకూడదు
    పక్కవాడి అన్యాయంపై మన రోమాలు నిక్కబొడుచుకోవద్దు
    అయినా నాకెందుకొచ్చిన గొడవ
    పక్కవాడి గుడిసెగా తగలబడుతోంది
    రేపొద్దున నీ పక్కవాడు కూడా ఇలాగే అనుకుంటాడు
    కాంటేకార్ శ్రీకాంత్