పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

8, ఆగస్టు 2012, బుధవారం

చంద్రశేఖర్ || తోటమాలి ||

ఇంతా అని తెలియదు
ఒంటరివాడిని నేను అని తెలుసు కానీ
మొగ్గ, పువ్వై, పరిమళించి ...

కొమ్మను వెగటు చెందుతుందని అనుకోలేదు

ఇంత తియ్యగా ఉంటుందనుకోలేదు
నీది కోకిల గళం అని తెలుసు కానీ
పొత్తిళ్ళలో, పాకుతూ, తప్పటడుగులు వేసేప్పటి తోడు
నడిచి నిలబడ్డం వొచ్చాక వొద్దనుకున్నావనే నిజం ఇంత తియ్యని బాధని ...

ఇంత మార్పు నీలో వస్తుందని తెలియదు
తెలిసినా అప్పుడు ... నిన్ను ముద్దాడటం చేసేవాడ్నే
మొక్క ఎదిగి, పూచి, కాస్తుందని తెలుసు
ప్రతిఫలం నాకే చెందాలనుకోవడం భావ్యం కాదని తెలుసు కనుక

ఇంత మధురం పొందకపోవడం పోగొట్టుకోవడం అనుకోలేదు
ప్రతిసారీ ... దూరంగా నిన్ను చూస్తున్నప్పుడు
నీవు నన్ను గమనించట్లేదనే బాధను మించి ... సంతోషంగా ఉన్నావనే గర్వం
ఆనందం అస్రువులు అనుభూతులు

ఇంత కష్టం అనుకోలేదు మరుపు ... లేవనుకోవడం
ఎంత ప్రయత్నించినా సంబంధం లేదు అని అనుకోలేని బలహీనతే తపన ...
నాన్నా అని పిలుస్తావని ... పిలిపించుకోవాలని
భరించలేని ఈ తియ్యని బాధాగ్నిని నిన్ను దగ్గరకు తీసుకుని చల్లార్చుకోవాలనే.

*08-08-2012

క్రాంతి శ్రీనివాస రావు || రోడ్ల గొణుగుడు ||

రోడ్లు వేదనతో నా చెవిలో వూదిన రహశ్యం
మాటలుగా మార్చి
మీటర్ కున్నా లేకున్నా

మ్యాటర్ మీముందుంచా చదివి పెట్టండిక

కొన్ని రోడ్లు
స్పొటకం పోసి పెచ్చులూడి
మచ్చలు పడ్డ మొహాన్ని
ఎప్పుడూ హైస్పీడ్ తో వెళ్ళే
ఖరీదయున కార్లు బోసు గారి బస్సులు
మోరీలను ముద్దుకొనే లారీలు
బుర్రున్నాలేకున్నా గిర్రల కాళ్ళెట్టుకున్న ప్రతిదీను
స్లొగ స్లొగ పోకుంటూ ఆగి ఆగి చూస్తుంటే
గయబ్ అయున గాంగోళ్ళను గట్టిగనే తిట్టుకొంటూ
చస్తే బాగనుకొంటూ సిగ్గుతో చస్తున్నాయు


కొన్ని రోడ్లు
గుండెల్లో మోకళ్ళ లోతు గుంటలు పడ్డా
ఎడుపు మొహానికి నవ్వు తగిలించుకొని
ఇంకుడుగుంటలివి భూమి తల్లి దాహం తీరుస్తున్నానని
బంగపాటును వ్యంగంగా చెబుతున్నాయు

మరి కొన్ని రోడ్లు
వోదార్పు దరువు సబ్దాన్ని
తొడగొట్టినప్పుడు వచ్చిన నిశ్సబ్దాని
చెంపలు నిమిరే చిత్రాన్ని
మీసం మెలెట్టే మొదనస్టాన్ని
మౌనంగా వింటూ కంటున్నాయు

ఇంకొన్ని రోడ్లు
విధిలేక వోడ రేవుల దాకా సాగి
దేశం నడి బొడ్డున మొదలై
జీవనదిలా పదిలంగా పారే
అయురన్ ఓరును తరలిస్తున్న
లారీల చక్రాలను నిరంతరం ముద్దాడు తున్నాయు

కొన్నిరోడ్లు
తనపిల్లల్ని తనే చంపుకుతినే పాముల్లా
అడవి అన్నల్ని చంపేందుకు బారులు తీరిన
మిలటరీ వాహనాలను
మోయలేక చస్తున్నాయు


మరి కొన్ని రోడ్లు
పదవులకై సాగే పాదయాత్రల
పద ఘట్టనలతో నలిగిపోతున్నాయు

పల్లెటూరు కెళ్ళే పిల్ల రోడ్లు కొన్ని
వయసొచ్చి వలసెళ్ళిన పిల్లలు
మళ్ళెప్పుడోస్తారాని
వట్టిపోయున పల్లెకు వసంతమెప్పుడా అని
వేదనతో రోదిస్తున్నవి

అలాగే అలిగిన కొన్ని రోడ్లు
లక్షల మందిని ప్రమాదాలకు పట్టించి
శిక్షలు వేస్తున్నాయు

ఆగ్రహించిన కొన్ని రోడ్లు
ఈ మద్యే రంగేసుకొని కాస్త హంగేసుకొని
టోలు గేట్లు పెట్టి జనం తోళ్ళు వలిచేస్తున్నాయు

బహుశా అందుకేనేమో
ఈమద్య జనం
రోడ్ల ను క్రికెట్టు మైదానంగా మార్చి
ఆటలతో అలరిస్తున్నారు
వంటా వార్పూ రోడ్డుపైనే చేసి
మేము మీ వెంటేనని గుండెమంటను తగ్గిస్తున్నారు

ముదిగొండ లాంటి చోట్ల
గుండుకు గుండడ్డం పెట్టి
నడిరోడ్డుకు రక్త తిలకం దిద్దుతున్నారు

మీరు వస్తారా వెళదాం
ప్రగతి రధ చక్రాల పాట్లను తప్పించేందుకు
మన ఈరోడ్లను రక్షించేందుకు

*08-08-2012

జుగాష్ విలి || ఎవరి నిర్వచనాలు వారివి ||

ప్రేమే జీవితంగా బతికే వారెప్పటికీ ఓడిపోరు
మహా అయితే తరచుగా గాయపడుతుంటారు
బహు తక్కువగా సుఖపడుతుంటారు

వారికి జయాప జయాలు అనిమిత్తం
వారి లాభనష్టాల నిర్వచనంవేరు

ప్రేమను తప్ప
మిగతా అన్నిటినీ ప్రేమించేవాళ్ళు
మహా అయితే ఎక్కువగా సుఖపడుతుంటారు
బహు తక్కువగా ఆనందపడుతుంటారు
ఎప్పటికప్పుడు లాభనష్టాల పట్టిక తయారు చేస్తుంటారు
వీళ్ళ జయాపజయాల నిర్వచనం వేరు

ప్రేమను కొలవడానికి ప్రేమతప్ప
ఏవేవో కొలబద్దలన్నీ అనేకం వుంటాయి వీళ్ళదగ్గర
ప్రేమ లేదనీ, దొరకలేదనీ, అంతామోసమనీ
అన్నీ వేళలా నిందిస్తుంటారు...చింతిస్తుంటారు
కొందరిపట్ల, కొన్నిటిపట్ల
హృదయాలను
వాటర్ ప్రూఫ్ వాచీలల్లే చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే

ఆనందంలో కంటే
సౌకర్యంలోనే హాయిని పొందుతారు
ఓటమిని గెలుపుగా బతికేస్తుంటారు
వీళ్ళ సుఖసంతోషాల నిర్వచనమే వేరు ...వేరు...
*07-08-2012

రాఖీ,,,|| నీకే ఈ నా సమస్తం !! ||

ఆనంతాల అంతుల నుండి
దిగంతాల అంచుల దాటి
పాలపుంతలేన్నో మీటి

చుక్కలు చిక్కులు తెగ త్రెంచుకొని
ఖగోళాలు కృష్ణబిలాలు తప్పించుకొని
నవగ్రహాల ఉపగ్రహాల పీడ వదిలించుకొని

సప్త సముద్రాలను ఈదీ
మేరు పర్వతాల నధిరోహించి
అరణ్యాలు ఎడారులన్నీ ఏదీ వదలక
కౄర మృగాలు విష సర్పాలు ఎదునారైనా నే బెదరక

మైదానాలు నదీ నదాలు
కొండలు కోనలు వాగులు వంకలు ఏవీ విడవక
ఎండమావులు ఇంద్ర ధనువులూ వేటి మాయలో అసలే చిక్కక

లోయలు గుహలూ మిద్దెలు మేడలు
రెక్కల శ్వేత తురంగంపై అంతటా సంచరించి

విశ్వమంతటా అన్వేషించీ
అణువణువున నిను శోధించీ
ఆఖరికి నాలోనే నీవైన నన్ను గ్రహించి సంగ్రహించీ

తరించి అవతరించానిట నేస్తం!
నీకే ఈ నా సమస్తం!!
కుశలమే నా ప్రస్తుతం ?!
*07-08-2012

శ్రీ వెంకటేశ్ || నిశ్శబ్ధం ||

ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు మొదట నీలో మెదిలే ఉత్తేజం,
ఎదలో దాక్కున్న దుఖ్ఖం తెరలు తెంచుకుని కను రెప్ప మీదుగా పయనమవ్వకముందు పులుముకున్న మౌనం,
అబద్ధంతో స్వర్గానికి తీసుకెళ్ళే నాలుక రెక్కలు నిజాన్ని మోసుకు పోయెందుకు తటపటాయించే తరుణం,

అప్పటి వరకు ఇష్టమైనది ఇరుకుగా అనిపిస్తే ఇష్టం లేదు అని పూర్తిగా తేల్చలేని సంధిగ్ధం,
హౄదయానికి వరసైన వాళ్ళు వీడి దూరంగా వెళ్తుంటే మొహాన ముసురుకున్న వర్ణం,
నాది అనుకున్నదేది దక్కకుండా దాగుడుమూతలాడుతుంటే కోరికల గుర్రానికి మనసు వేసే కల్లెం,
ఇష్టమైన వాళ్ళు మనసుకు కష్టమైనది చేస్తున్నా వద్దని వారించలేని వైనం,
రాజభోగాలనుభవించిన రామచిలుక చిన్న పూరిగుడిసిలో పడే కష్టం,
ఆకాశాన్ని అందుకునే మార్గంలో అవరోధాల అడ్డుతెగలు ఆపేందుకు యత్నిస్తుంటే సంధించే చిరునవ్వు భాణం,
కొన్ని పరిస్థితులకు ఆవశ్యకం, కొన్నిటికి ఆటంకం ఈ నిశ్శబ్ధం....

ప్రకాశ్ మల్లవోలు || అర్ధ' శాస్త్రం లో ఇమిడిపోయిన ఆర్తనాదం... ||

'అర్ధ' శాస్త్రం లో ఇమిడిపోయిన ఆర్తనాదం...
అర్ధం కాక మిగిలిపోయిన యదార్ధ వాదం...

ఎందుకో ఈ అంతస్తుల తేడా???
అసలెందుకో ఈ అసమానతల జాడ ....

ఒక్కోసారి అర్ధం అయినట్టే ఉంటాయి...
అందుకునే లోపే జారిపోతాయ్ సమాధానాలు ..

ఈ తేడాలకు కారణం ఒకోసారి మూర్ఖత్వం అయితే
ఇంకోసారి అమాయకత్వం అవుతుంది.
ఒకోసారి చేతకానితనం అయితే
ఇంకోసారి చేవ చచ్చిన తనం అవుతుంది..
ఒకోసారి తెలివై అంతస్తును పెంచితే
ఇంకోసారి 'అతి' తోడై అది'ము'౦చుతుంది ..

కానీ ఇవేం పట్టవు కలలకి
అవి మాత్రం మేడలు కడుతూనే ఉంటాయి
పునాదుల్లేకుండానే ....

ఊహలకి రెక్కలు తొడుగుతూనే ఉంటాయి..
అడుగులని నేలపై ఉంచుతూనే...

కొన్నైతే వాస్తవం ముసుగేసుకుని మరీ
కళ్ళెదుర కనపడతాయి , (వి)భ్రమలో ముంచేస్తాయి...

కనడానికి ఎన్ని సంగతులున్నా , ఈ
మాయదారి కలలన్నీ డబ్బు చుట్టూనే ఎందుకో???
బహుశా ప్రసవ వేదన శ్రమ లేదనేమో...???

అర్ధం కాని ఆర్తనాదం ఈ 'అర్ధ' వాదం...
అర్ధం కాపోయినా చేసే వితండవాదం ఈ 'అర్ధ' వాదం..

-సుష@4u4ever@

రెడ్డిరామకృష్ణ || సముద్రంతొ ఆటలాడే కుర్రాడు ||

సముద్రంతొ ఆటలాడే కుర్రాడిని చూసాను
నిన్న చింతపల్లిలో


సిం హం జూలు పట్టి
దాని పై స్వారీ చేయాలని చూస్తున్నాడు
దెబ్బతిన్న పాములా సర్రున లేచిన కెరటం
బుసకొడుతూ పడగ విప్పితే
దాని పీక పట్టి కోరలు పీకిన వానిలా
నిర్భయంగా దాని చుట్టే తిరుగు తున్నాడు

పన్నెండేళ్ళ బాల్యమే అయినా
గుండెల క్రింద "కట్ట" పెట్టుకొని
సముద్రాన్ని జయించాలని చూస్తున్నాడు

ఒంటి పై చొక్కా కూడా లేని వాడు
బెల్లం దిమ్మకు పట్టిన నల్లని కండచీమలా
సముద్రాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు
ఎన్ని సార్లు విదిలించినా మళ్ళీ మళ్ళీ వచ్చే చీమలా
కెరటం ఎన్ని మార్లు బయటకు నెట్టేస్తున్నా
సముద్రం పైకి దూకుతునే ఉన్నాడు

ఎంత సాహసం వాడిది
సహస వంతులే దేన్నయినా సాధించగలరని
నిరూపించే వాడిలా ఉన్నాడు
రేపటి బతుకు సముద్రాన్ని ఈదటానికి
తనకు తనే తర్ఫీదు పొందుతూ
మరొ ఏకలవ్యునిలా కనిపిస్తున్నాడు

ఈసారి బొటన వేలు కావాలనే దొరలు వస్తే
తెడ్డు తిప్పగల చైతన్యాన్ని స్వాసిస్తున్నట్టుగా ఉన్నాడు.
*07-08-2012

పులిపాటి గురుస్వామి || నా సెలయేరు హృదయం..... ||

ఈ భూమికి నేను
పరదేశిని

ఇక్కడి గాలికి నేను
ప్రియమైన అతిథిని

నాకైతే త్రికాలాలలో నువ్వు
ఆశ్చర్యానివి

ఈ ఈర్ష్యా లోకానికి
ఇది అర్ధం చేయించు
ప్రియురాలా...!
ఈ రాత్రిని వెళ్ళనీయకు .
*07-08-2012

జుగాష్ విలీ || పాతబడని కధ ||

ఆకాశం మట్టి నుంచి
తొలి కిరణం మొలకెత్తింది
కుట్ర మొదలైందన్నాడు

మిట్ట మధ్యాహ్నమైంది
నిప్పుల వర్షం కురుస్తోంది
ఆకాశం సాయుధమైందన్నాడు

సూర్యుని మీద ఉమ్మేసాడు
ముఖాన పిడుగై కురిసింది
శాంతి భద్రతల సమస్యన్నాడు

చిగురు టాకుల నెలవంక
గాయమై నేలకూలింది
ఆత్మరక్షణ ప్రయత్నమన్నాడు

"విన్నావా! బిడ్డా!
నలభై ఏళ్ళుగా యిదే కధ
జనం విసుగులేకుండా 'ఊ' కొడుతున్నారు
వేలెడంత లేవు నువ్వు
నీకేమో రోజుకో కొత్త కధకావాలి" అన్నది
తల్లిపిట్ట పిల్ల పిట్టతో
నల్లమల అడవిలో
నల్లమద్ది చెట్టుమీద.

*07-08-2012

కాశి రాజు || ‎ మా వాకిట్లో ||


అడ్డంగా నేనున్నాకదా
అలా తిరిగిరా అన్నట్టు
తులస్సెట్టు.


పచ్చడి చేసే
పేరుమోసిన
సందికాయిలి.

దంచి పడేస్తానన్న
మాంచి రోలు.

ఉచితంగా
ఉతికారేసే
బట్టలదండెం.

వగైరా వగైరాలతో పాటు

రంగులద్దుకుని రంగసానిలా కుచ్చున్న
ముంగిట ముగ్గు
సూపుల్తో సుక్కలన్నీ కలిపేస్తారని
వొయ్యారంగా వంకర్లు తిరుగుతూ
ఆశగా ఎదురుసూత్తాది మీకోసం.
*07-08-2012

ఏకాంత సిరి కవిత

ఎలా చెప్పాలి..
ఆకలిగా ఉందంటే ..అయ్యో ..పాపం అంటారు.
అదే ప్రేమగా ఉందంటే పట్టించుకోరు..
ముడుపుటలా..
తిండి లేకుండా ఉండగలను

కానీ , ఒక పూట ప్రేమ లేకుండా.. ఉండలేనని
ఎలా చెప్పాలి వాళ్ళకు...
*07-08-2012

రవీందర్ వీరెల్లి || అంతం ||

జ్ఞానం పెరిగీ పెరిగీ విరిగి
తిరిగి అస్తిత్వపు మూలాలలోకి ప్రయాణమైనట్టు

మనిషి ఎదిగీ ఎదిగీ విసిగి
తిరిగి బాల్యంలోకి జారగిలపడ్డట్టు

ఆలోచనల విస్పోటంలో పుట్టి పెరిగి
అందరి గుండెల్లో అణువంత విత్తయి
ఆత్మ మూలాలు ప్రశ్నించే
వో పద్యం లా...

అంతంలో పుట్టిన కాలం
తిరిగి ఎప్పటికైనా ఆదికి ప్రవహించాల్సిందే!

*07-08-2012

అప్సర్ || An Empty Episode-1 ||

మొదటి సన్నివేశం:
అనుభవాల్ని తప్ప తేదీల్ని నేనెప్పుడూ చూడను. కానీ, ఆ తేదీలే ఇప్పుడు గుండెకి వేలాడుతూ కనిపించడం చూస్తున్నా. ఆగస్టు నాలుగు -- ఇంకా తెల్లారని రాత్రికి నిద్రపట్టనప్పుడు-- గది కిటికీలోంచి బయటి ముసురుని నాలోపలికి చూస్తూ.


1
నిండా చీకటి రాల్తున్నప్పుడు అసలే దీపకాంతి నా కళ్లకి శాంతినివ్వనప్పుడు ఏం చెయ్యమంటావ్?! చూరు పట్టుకు వేలాడుతున్న బయటి వెన్నెల నా గోడ మీద చెట్ల నీడల్ని గీస్తూ వెళ్లిపోతుంది. నాకు తెలుసు, పక్క మీద నా వొళ్ళు భారమయి పోతుంది. నేనొక పక్కకి వొరిగి నీడల్లోకి చూస్తూ ఆ నీడల వెంబడి నా చేతి వేళ్ళని కదిలిస్తూ వొక శూన్యాన్ని రాస్తున్నానా?పరుగులు ఆపని వొక నీ వూహలోకి ప్రవహిస్తున్నానా?నువ్వెప్పుడూ ఇక్కడే లేవని తెలుసు, నువ్వు నీ ప్రపంచంలోనే నీలోనే ఇరుకిరుగ్గా తిరుగుతూ నీ తీరిక లేని వొత్తిళ్ల లోకంలోనే వున్నావనీ తెలుసు. అయితే కానీలే కానీ, ఈ లోపలి లోకంలో ఎవరు ఎవరిని వింటారని?ఎవరి నీడలకి వాళ్ళే తల బాదుకోవడం తప్ప!

2
తాడో పేడో తేల్చుకోలేను కానీ, నీ ఊహ వొక సర్ప మాయ. వూహ మాటకేం, చాలా సార్లు నిజమూ అంతే కదా అనిపించదా?లెక్కపెడ్తున్నానని కాదు గానీ, ఎన్ని అడుగులు నీతో నడిచి వచ్చానో వెనక్కి తిరిగి చూసినప్పుడు, అవన్నీ నువ్వు చెరిపేస్తూ వచ్చావని ఇప్పుడీ క్షణం అనుకోనా? నిజం కూడా నీలాంటిదే...నీ వూహలాంటిదే...వూహకందదు ఎంతకీ!నిజానికి అసలే అందదు.

3
ముసురు పట్టిన తెల్లారుజాము అంత తేలిగ్గా కరగదు. రాత్రి పాదాలు మరీ ఇనపవి. ఎప్పటివో ఆ పాత గుడి రథ చక్రాలు కదలవు వొక పట్టాన. వొక్క చినుకో, వొక ఉప్పెనో అయితే బాగుండేమో కానీ, ముసురు కదా ఇది! చీకటీ రాత్రీ ముసురూ నా అనిద్రలో అల్లరల్లరిగా ఆడుకుంటూనే వుంటాయి తెల్లారనివ్వకుండా.

4
“కలలో కూడా నిన్ను కలవనా?” లోపలి చలి వొక కత్తివేటు, అట్లా అని గాయమేదీ కనిపించదు!

5
“ఏమో!”
అని నీవే అనిపించే ఈదురుగాలి వొకటి నీ/నా నీడల మీంచి పెంకిగా ఎగిరిపోయింది, చెరి సగంగా మనం దాచుకున్న వూహల గుంపుని చెదరగొట్టి, ఆకాశానికి అడ్డంగా పరిగెట్టింది.

6
ఎక్కడికని పరిగెత్తను?! ఎందాకని పరిగెత్తను?

*07-08-2012

కట్టా శ్రీనివాస్ ॥ X గ్రేషియా ॥



1

పంటకు కొట్టింది, పైరుకు వేసింది

ఎప్పటి లాగే కల్తీ మందు.





2

ఇంకా నయం చివరికి

విరక్తితో తాగిందైనా కల్తీ కాకుండా వుందనుకుంటే

ఎప్పట్లా అదీ కల్తీనే...




3

మరికొన్ని కార్పొరేట్‌ మందుల్ని

గొంతులోకి రక్తంలోకి పిచ్చి పిచ్చిగా

ఎక్కించి తుప్పొదిలించుకునేంత వరకు

కనీసం చంపనైనా లేకపోయింది.




4

పండించలేని తనానికి మూల్యంగా

మందుల ఖర్చుకై పొలాన్నమ్మినా చాల్లేదు.




5

ప్రభుత్వ సాయం ప్రకటించారని

పరలోకాన్నైనా చేరకుండా యింటి చెట్లకి వేళ్ళాడినా...

పెళ్ళాం పిల్లలు, అధికారుల కాళ్ళా వేళ్ళా బడినా...

దేవుని వరం ఏ పూజారి వద్ద ఆగిందో

కనీసం కనిపించనే లేదు.




6

మళ్ళొకసారి ఆత్మహత్య చేసుకునే అవకాశమూ లేదు.

చేసుకోకుండా స్వంత వాళ్ళని ఆపే శక్తీ లేదు.

ఛీ.. పాడు బతుక్కి చచ్చి సైతం సుఖం లేదు.




*06-08-2012

కవితా చక్ర || విను! ||

విను!
నీ గురించి వినిపిస్తున్న
అవతలి వారి మాటలకన్నా..
నీ అంతరంగం
'నీ' గురించి యేం చెబుతోందో

వింటే..
యేం చేయాలని తెలియకున్నా..
యేం చేయకూడదో తెలుస్తుంది!!

*07-08-2012

భమిడిపాటి || నిట్టూర్పుల రాత్రి: ||


నిట్టూర్పుల రాత్రి
పడమటి రాగం

పాడుతున్న
సంధ్యా సూర్యుడికి వీడ్కోలు చెప్తూ !

చీకటి ప్రపంచం చేసే
మౌన సంభాషణకి తను సాక్షిగా
మానవ మృగాల పైశాచిక క్రీడకి
తనే వేదికగా !

నల్ల బట్ట కట్టుకుని
అలసిన గుండెను నిద్రపుచ్చుతూ
కాలే కడుపుకి
ఇదిగో తెల్లవారు అని ఓదార్చుతూ .....

పగటి పని దొరకని
రాత్రి పని తప్ప వేరే దారిలేని
సమాజం పట్టని
సమాజానికి పట్టని కొందరి కొమ్ముకాస్తూ

ఆకలి అందాన్ని
నిశి రాత్రికి హారతి లిస్తూ
తాము కరుగుతూ కరిగిస్తున్న
తరుణీమణుల కాటుక కళ్ళను ముస్తాబు చేస్తూ

నిట్టూర్పుల రాత్రీ
రోదిస్తోంది
విలువలు విప్పుకుని
చీకటి వలువలు కప్పుకుని

నిట్టూర్పుల రాత్రి
ఉదయ రాగం
పాడుతున్న
అరుణ సూర్యుడికి స్వాగతం పలుకుతూ ...!

*07-08-2012

పరమేశ్వరి పులిపాటి || "స్వ" ||


నాపై నేనే
కొత్తగా వుదయిస్తూ..
కాంతిని ప్రసరిస్తూ..


నాకు నేనే
అలలు అలలుగా..
కలలు కలలుగా..

నాలో నేనే
అనుక్షణం వెతుక్కొంటూ..
అనుదినం అవలోకిస్తూ..

నాతో నేనే
సంభాషిస్తూ..
సమాలోచిస్తూ..

నాలోకి నేనే
పక్షి రెక్కలుగా..
నింగి చుక్కలుగా..

నా వైపు నేనే
అడుగులు అడుగులుగా..
చినుకులు చినుకులుగా..

నా నుండి నేనే
గాలిలో గంధమై..
శీతాకాలపు మంచునై..

నా వెంట నేనే
సీతాకోక చిలుకనై..
చిగురాకుల చిత్రమై..

నన్ను నేనే
అర్థం చేసుకొంటూ..
ఆర్థ్రం అవుకొంటూ..

నాకై నేనే
ప్రకృతిని రమిస్తూ..
పచ్చదనంలో జీవిస్తూ..

నన్ను నేనే
అనువదించుకొంటూ..
అనుసృజించుకొంటూ..
* 07-08-2012

బివివి ప్రసాద్ || వర్ధమాన కవికి ||


1.
కవీ, నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే
దానినే గలగలలాడించి అది ఒక సెలయేరని భ్రమింపచెయ్యకు

నీ ముందు, నదుల్ని తాగి ఏమీ ఎరగనట్లు చూస్తున్నవారుంటారు

2.
ఎడారిలో బావి తవ్వాలని చూడకు,
ఎంతదూరమైనా ప్రయాణించి,
ఎన్ని పగళ్ళు, రాత్రులకైనా తలవొంచి ఒక నదిని కనుక్కో ముందు

ఎడారి ఏది, నది ఏది అని అడగకు
నీ అడుగులు అక్కడ మొదలుపెట్టు

3.
నీ దగ్గర ఉన్న శబ్దాలు కొన్ని
కాగితంపై పేర్చటమే కవిత్వం అనుకొన్నంతకాలం
నువ్వు ఒక్క కవితైనా చెప్పలేవు

నీ దగ్గర ఉన్న నిశ్శబ్దంలో కొంత
శబ్దాలలోకి అనువదించడమే కవిత్వం

ఎపుడైనా గమనించావా
నీలో నువు మాత్రమే వినగల నిశ్శబ్దాన్ని,
నువు మాత్రమే ప్రవేశించగల నీ నిజ ప్రపంచాన్ని

4.
నీ అక్షరం ఇంకా కాగితంపై ఆకారం దాల్చకముందే
నీ చెవిలో చప్పట్లు హోరు వినబడుతుంటే,

నిజం చెబుతున్నాను నమ్ము,
నువు ఎప్పటికీ కవిత్వం రాయలేవు
ఏ స్త్రీనీ ప్రేమించలేవు, ఎప్పటికీ నీకు జీవితమైనా మొదలు కాదు

5.
ఒక పువ్వు, ఒక పిట్టకూత, ఒక దు:ఖాశ్రువు
ఒక వానచినుకు, ఒక పసినవ్వు

ఏదైనా ఒకే ఒకటి, నీ జీవితాన్ని తలకిందులు చేయకపోతే
వాటిలోకి నువు నదిలోకి దూకినట్టు దూకలేకపోతే

వేలకొద్దీ పూలూ, అశ్రువులూ ఏవీ నిన్ను కదిలించలేవు

ఇపుడు గుట్టువిప్పుతున్నాను
ఒక పువ్వు నది, వేల పువ్వులు ఎడారి

6.
కవిత్వాన్ని వెలిగించే అగ్నికోసం, బయట వెదికేవాడికి
పొగమంచులో తడుస్తున్న ప్రపంచం మినహా ఏమీ కనిపించదు

నిన్ను నీకు కనబడనీయని పొగమంచులోకి
నిర్భయంగా చేతులు చాచినపుడు నీవే అగ్నివని గుర్తిస్తావు

చూస్తున్నావా
ప్రపంచమంతా అగ్నిమయమై గోచరిస్తుంది
నీ అక్షరాలు వెలుగుతున్నాయి

7.
కఠినమైన రహస్యాలు కొన్నిటిని దయ బయటపెట్టినపుడు
సముద్రమంత హోరు అకస్మాత్తుగా ప్రజల్ని కౌగలించుకొంటుంది

అప్పుడా రహస్యాలను
భవిష్యత్ స్వప్నాలను నిర్మించే ఉత్సాహవంతులు మాత్రమే వినగలుగుతారు

రహస్యాలను రహస్యంగా తెలుసుకొని, వారు

సూర్యకాంతిని వెలిగిస్తున్న చీకటిలోకీ
చీకటిని వెలిగిస్తున్న కంటికందని కాంతిలోకీ
అందరితో మాట్లాడుతూనే వడివడిగా నడుస్తారు


8.
వేలకొద్దీ నేనులు మాయమై,
ఒక నేనే వేల ప్రతిబింబాలయిందని కనుగొన్నపుడు
కవికి తన కవిత్వం రాయటం పూర్తవుతుంది

9.
కవిత్వాలకేం గానీ,
హాయిగా నవ్వుకొందాం కాసేపు

మనం చేయలేని చాలా పనులు
మన నవ్వులో దాగొన్న దేవతలు చేస్తారు


(ఇస్మాయిల్‌గారూ, ఎందుకో మీరు గుర్తొస్తున్నారు..)

7 అగష్టు 2012

పద్మా శ్రీరామ్ || ఎట్లున్నారు.....??? ||


ఏయ్...ఎలా ఉన్నావూ ..నే గుర్తున్నానా?
మర్చిపోతే కదా ఆ ప్రశ్న అని అలా కొంటెగా నవ్వేయకేఁ
నువ్ దరి లేని ఎన్ని గుప్పిళ్ళ క్షణాలు ఎత్తిపోసుకున్నానో తెలుసా

ఎంత విషాదాన్ని తాగి జీర్ణించుకుంటున్నానో
నీకేం తెలియదు ఇలా అల్లరిగా ఆలోచనలని అల్లేయడం తప్ప
వీధి గుమ్మంలో మెట్లనల్లుకున్న సన్నజాజి తీగ కూడా నవ్వుతోంది
మాతో నీకు పనిలేదా అంటూ...నువ్విచ్చిన అలుసే...
నీ బైక్ తడుముతూ కాఫీ తాగుతున్నానని
పక్కింటి మామ్మగారు కూడా నవ్వుతున్నారు ఇంత బెంగా పిల్లా అంటూ
నీకివేం అక్కరలేదు...ఏమీ పట్టనట్టు నన్నొదిలి వెళ్ళిపోయావ్
అవునూ ఎప్పుడొస్తున్నావ్? ఇవాళే నీ కలలోకి అనకు
నాకేడుపొస్తుంది...నువ్వు నువ్వుగా తెల్లారేసరికొచ్చేస్తావ్ గా
సూరీడలిగినా సరే సొడ్డి కొట్టి వచ్చెయ్యేఁ....వస్తావుగా...నిద్రొస్తోంది బజ్జుంటానే...
*07-08-2012

నరేశ్ కుమార్ ||‎ * ఓ కవీ * ||

ఓయ్... కవి మిత్రుడా...!
ఇంకెన్నాళ్ళు

ప్రేయసి గుండెల పైనే
నిద్రిస్తావ్...?
ఇటు రా...
అలా మనిషి గుండెళ్ళోకి
వెళ్ళోద్దాం

అన్నట్టు....
ఓపెన్ సెసేం మంత్రం గుర్తుందిగా....?
మనసు తలుపులని
తెరిచేందుకు

శృంగార శిల్పాలపై
కప్పిన
నీ చూపుల దుప్పటి
లాగెయ్
మరణించిన
శిల్పి దేహం పై
కఫన్ లేదిక్కడ..

అత్తరు కంపు కొడుతోంది నీ కలం
కాస్త
చమటతో శుభ్రం చేస్కో

గొంతులో
ఎడారుల్ని దాచేసి
అధరామృతాన్ని
తాగుతున్నావా.....!?

త్వరగా రా....
అక్కడెవరో మానవత్వాన్ని
మానభంగం
చేస్తున్నారు
కాపాడాలి....

ఎన్నళ్ళీ ముసుగుని భరిస్తావ్....?
నాతో
అంటుకట్టుకో
మనిషి గా మారితే
మేక తోలు అవసరముండదిక....
*07-08-2012