పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

ప్రవీణ కొల్లి || అసంపూర్ణం


ఒక్కో రాత్రి, ఒక్కో పగలు
ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో
ఇంతేసి దిగులును?
నేల ఈదుతున్నట్టు, ఆకాశం చాలనట్టు
పుట్టుకొచ్చే ఈ ఆలోచనలు!
కడవల కొద్దీ తోడినా
ఊట బావిలో ఊరుటుందే ఈ జ్ఞాపకాలు!
ఇంత భారాన్ని మోస్తున్న మనసెంత బలసాలో కదూ...

నల్ల మబ్బుల నీటి భారం
వానై వరదై ముంచెత్తితే మటుమాయం...ఎంతదృష్టం!
కనురెప్పల కన్నీటి భారం
చినుకై కురిసి కురిసి
కడలిలోనే మరి భద్రం....ఎంతవిశాదం!

ఒక్కో వేదన, ఒక్కో ఆవేదన
ఎంతకీ చిధ్రమవ్వవు చిత్రంగా!
గాయాల తీపు తగ్గిందని బ్రమించినా
గురుతుల సలపరాలు జీవించే ఉంటాయి వింతగా!

గతించిన గేయపు స్వరాన్ని
కరిగిపోయిన కాలపు పెదవులు
ఆజన్మాంతం అవిశ్రాంతంగా ఆలపిస్తూనే ఉంటాయి...
జనించిన స్మృతి రాగం
కాలం మిగిల్చిన వినికిడిలో
కూనిరాగమై ఆలకిస్తూనే వుంటుంది...

ఒక్కో ఘటన, ఒక్కో సంఘటన
ఎప్పటికీ అంతు చిక్కని
వైకుంఠ పాళి పాచికలే!
నిచ్చెన అనుభవాల కన్నా
పరిశీలన పాముకాట్లు ఎక్కువ బాధిస్తుంటాయి,,,,

ఒక్కో అక్షరం, ఒక్కో భావన
ఎప్పటికీ అసంపూర్ణమే!
పోగు మిగిలిపోయిన నేత అల్లికలా...

24 -SEP -12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి