పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఆగస్టు 2012, బుధవారం

ప్రవీణ కొల్లి॥ఇంటికెళ్ళి వచ్చాక...॥


రాత్రంతా వర్షం కురిసి
ఇప్పుడే వెలిసినట్టుంది
తడిసిన గుమ్మం
చెమ్మగిల్లిన వాకిలి స్వాగతం పలికాయి.
సన్నజాజి తీగ, మల్లె మొగ్గ, చిరుగాలి స్పర్శ
ఆ ఆవరణంతా ప్రేమమయమే!
"బాగున్నావా తల్లి?", "అలా చిక్కిపోయావే?"
ఆర్ధ్రత నిండిన పలకరింపుల అమృతాలే!

నాన్న పడక్కుర్చీ
అమ్మ గాజుల మోత
వంటింట్లో తాలింపు వాసన
వరండాలో బంధువుల సందడి
అబ్బ...ఎప్పటికీ ఇవి ఇలాగే
నేను ఇక్కడే ఉండగలిగితే ఎంత బాగుండు!

కలవాలనుకున్నా కలవలేకపోయిన స్నేహితులు
ఎవరి జీవితాలలో వారు బిజీ అని సాక్ష్యం చెపుతూ
మరో సంవత్సరానికి వాయిదా పడ్డాయి!
కొత్తగా కలిసిన నేస్తాలు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపాయి.

చాన్నాళ్ళకు కలిసిన తోబుట్టువులతో
కబుర్లు తీరనే తీరలేదు!

బాల్యం, కౌమారం, యవ్వనం
ఇవన్ని హడావుడిగా వెళ్లి పోతాఎందుకో?

గమ్యాలు వెతుక్కుంటూ సాగుతున్న ప్రయాణంలో
ఆటవిడుపుగా వెనక్కి వెళ్ళితే
మరి తిరిగి రావాలనిపించదు!

జ్ఞాపకాల అరలలో
స్మృతుల దొంతరలు పేర్చుకుంటున్నా
కాలం కరిగిపోతుందన్న బెంగ తీరక మునుపే
మబ్బులు ముసిరిన ఆకాశం
వర్షించటం మొదలుపెట్టింది
వీడ్కోలిస్తూ.....
*21.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి