పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జులై 2012, సోమవారం

ప్రవీణ కొల్లి॥నిశ్శబ్దం॥


నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
రాణిని నేనే, దాసిని నేనే!
ఆలోచనల అలల్లో తీరం చేరితే
సామ్రాజ్యమంటాను!
ఆశల వలలో చిక్కుకుపోతే
నడిసముద్రమంటాను!

నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
అంతే వేగంగా
తటాకంలోని గులకరాయి
బుడుంగున మునిగిపోతుంది….

ఏ పలకరింపో
ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి
చుట్టపుచూపులా ఇలా తరలిపోతుంది….

దివారాత్రుళ్ళు లోలకానికి అతుక్కుపోయినట్టున్నాను!
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
గడియారపు టిక్కుటిక్కులే మిగిలిందిక

కనురెప్పల కదలికలలో సవ్వడేది?
కన్నీటి సుడులలో హోరు, మీరెవరన్నా విన్నారా?

నాకనిపిస్తోంది , నిశ్శబ్దమే శాశ్వతం……..కాదంటారా?
*9.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి