పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జులై 2012, మంగళవారం

ప్రవీణ కొల్లి || వలయం ||

ఏదో ద్రవంలో తేలియాడుతున్నాను
చేతి వేళ్ళు కదలాడుతున్నాయి
కాళ్ళ కదలికలు మొదలయ్యాయి
కనురెప్పలు విడిపడుతున్నాయి
కనులు మూసినా తెరిసినా, అదే చీకటి!

ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ
బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ
నాకు మాత్రమే సరిపోయే చోట
నేను మాత్రమే ఉన్నాను!

అమ్మ గర్భమంట
ఎంత భద్రంగా ఉందీ చోటు!
అమ్మ..అమ్మ...ఎలా ఉంటుందో?
గొంతు లీలగా వినిపిస్తోంది

అయ్యో... అయ్యో....
నన్నెవరో తోసేస్తున్నారు
ఈ పొర చిలిపోతోంది
ఈ ద్వారం ఇరుకుగా ఉంది
కండరాలు నొక్కేస్తున్నాయి
నలిగిపోతున్నాను
జారిపోతున్నాను
వేధన..వేధన....ప్రసవ వేధన
ఎవరివో చేతులు
నా తలను పదునుగా పట్టి
నా శరీరాన్ని బలంగా బయటకు లాగేసాయి

ఊపిరి..ఊపిరి...ఊపిరి కావాలి
కేర్ మనే ఏడుపుతో
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల లయ ఆరంబమయింది!
అబ్బా..ఈ వెలుగు బరించలేకపోతున్నా
కళ్ళు చిట్లించి చిట్లించి చూస్తున్నా
ఓ వెచ్చటి స్పర్శ ఆహ్వానించింది
తన చనుబాలు నాకు అందిస్తూ
అమ్మ..అమ్మ....అమ్మ
ఆకలి మొదలయింది!

నా లేత చెక్కిళ్ళు ముద్దాడుతూ అమ్మ
నన్ను మురిపెంగా చూస్తూ నాన్న
ఆకలేస్తే ఏడుపు
కాదంటే మారాం
అందమైన లోకం
అమాయకపు సర్వస్వం
నడకలు నేర్చాను
పలుకులు పలికాను

అంతలోనే
ఎవరో నన్ను గెంటేస్తున్నారు
పద పదమని తొందర చేస్తున్నారు
ఆగండి...ఆగండాగండి
ఈ స్వేఛ్చ నా హక్కు
ఈ స్వచ్ఛత నా స్వభావం
నా నుంచి నన్ను దూరం చెయ్యకండి, వేడుకుంటున్నా
"ఎలా బతుకుతావేమిటి?"
చురకత్తులు విసిరారు
ప్రయత్నంగానో అప్రయత్నంగానో
ఓ కత్తి చేజిక్కించుకున్నా
పరుగులు సమరాలయ్యాయి
యుద్ధం నిత్యకార్యమయింది....

నాటి కన్నుల్లో మెరుపు
నేడు లౌక్యాన్ని నేర్చింది
నాటి మోములోని అమాయకత్వం
నేడు గడుసుతనాన్ని ఆపాదించుకుంది
స్వయంరక్షనంటూ
కట్టి కూల్చేస్తున్నా
కూల్చేసి కట్టేస్తున్నా!
అడుగుల వేగం పెరిగి పెరిగి
సంధ్యవేళ నెమ్మదించింది...

పట్టుతప్పుతున్న దేహం
అదుపుతప్పుతున్న అలసట
ముడతలు పడిన మోము
బతుకు సమరం కొలిక్కి వచ్చిందో? నెమ్మదించిందో?

ఎవరో ఎవరో..ఎక్కడ నుంచి వచ్చారో !
నన్ను బలంగా ఈడ్చుకుపోతున్నారు
"రాను రాను...నేను రాను..నన్ను వదిలేయ్", గింజుకుంటున్నా
"నీ సమయం ముగిసింది", వాణి వినిపించింది
"నన్ను నా సామ్రాజ్యం నుంచి విడదీయటానికి నువ్వెవరు?", నిలదిసా
"నేనేవరా?నన్ను గుర్తించలా?.........
నేను కాలాన్ని....."

చేతి వేళ్ళు అతుక్కుపోతున్నాయి
కాళ్ళ కదలికలు బిగుసుకుపోతున్నాయి
కనురెప్పలు మూతబడుతున్నాయి
చుట్టూ చీకటి
ఆయువు బొడ్డు తెగిపోయి
ప్రాణం అనంతంలో కలిసిపోయింది...
http://alochanalu.wordpress.com/2012/07/16/%E0%B0%B5%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82/ 
*16-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి