పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జులై 2012, ఆదివారం

ప్రవీణ కొల్లి || విరామం ||

మనసు అలసట మదికి తెలుస్తూనే ఉంది
తనువు బడలిక భారమై ఎదను వేడుకుంటోంది
కాస్తంత విరామం ఇవ్వమని...

కాలం పరుగెడుతూనే ఉంది నా పనిలా
కాసేపు...కాసేపంటే కాసేపే
ఈ పనిని పక్కన పెట్టి
ఈ రోజును నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని
నన్ను నేను అభిషేకించుకోనీ....

నిద్ర లేమి లేని కనులతో
సూరీడి గోరు వెచ్చటి దుప్పటిని తొలిగించి
నీలాకాశపు కాన్వాసుపై
ఎర్రటి రంగును చిత్రిస్తున్న
ప్రకృతి చిత్రకారుడితో కబుర్లు చెపుతూ
ఈ ప్రభాతాన్ని ఆస్వాదిస్తుంటే
ప్రాణవాయువును కొత్తగా శ్వాసిస్తున్నట్టుంది ....

పువ్వుల పరిమళాలను మోసుకొచ్చిన ఆ చిరుగాలి
మనసు మూలాల్లోకి జొరబడి
సరసాలాడుతూ విసుర్లు విసిరింది
ప్రపంచాన్ని పల్లెటూరన్నావు
మనసులు ఇరుకు సంధులు చేసావు
ప్రకృతికి మేకప్పులేస్తున్నావు
సరి సరి..ఒప్పుకున్నా
ఈ నిట్టూర్పుల సెగలింక ఈపూటకు పక్కన పెట్టనీ
నీ సరసన నన్ను సేదతీరనీ
వేడుకోలును వయ్యారంగా ఆలకించిన
చిలిపి గాలి నా ముంగురులను ముద్దాడింది
పులకరించిన తనువు అలసటను మరిచింది...

తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న గాలిపటం
గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ ఆ స్తబ్దతను ఆస్వాదిస్తుంటే
మరోమారు జన్మిస్తున్నట్టుంది...

నీలాకాశపు పందిరి కింద
చంద్రవంకను వంగి ముద్దాడి ఎన్నాళ్ళయింది!
లెక్క తేలని నక్షత్రాలలో తప్పిపోయినట్టున్నా
ఈ రాత్రి
కొబ్బరాకుల నడుమ నుంచి
నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి
వెన్నెలను కౌగలించుకుని
మబ్బుల లాలిపాటలో ఓలలాడా...

నిన్నటి రోజున జనించిన
ఆ రాగం
నా గుండె గదిలో ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు
మనసు పొరలలో రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో విశ్రమించే వరకు....

ఈ విరామం కొత్త ప్రాణాన్ని నాలో నింపింది...

*14-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి