తెలంగాణ ప్రజా వ్యవహారం Posted on: Mon 23 Jun 01:12:02.070757 2014 - భాషలో విభక్తులు సాధారణంగా ప్రజావ్యవహారామే, సంప్రదాయ భాషకు భిన్నమైంది. ఒకటి రెండు వాక్యాల సామెతల్లో జీవితాన్ని చెప్పినట్టు భాషయొక్క ఔపయోగిక క్షేత్రం సూక్ష్మమైందైనా స్పష్టమైంది. తెలంగాణాలోని పది జిల్లాల్లో భాష వైవిధ్యమైందనే భావనలున్నాయి. భాషలోని అతి సూక్ష్మ ప్రయోగాలలో ఉండే పద్ధతులు వదిలేస్తే ఈ ప్రాంతం అంతటికి ప్రధానమైన మూలతత్వం ఉంది. ప్రతి భాషకి స్వాభావికంగా ఒక లక్షణం ఉంటుంది. భాషలోని అనేక అంశాలలోనూ ఒక అంతస్సూత్రత ఉంటుంది. ఇది వేర్వేరు విభాగాల సాంప్రదాయికతని, స్థాయిని చెబుతుంది. దీన్ని భాషాలక్షణం అన్నా, వ్యాకరణం అన్నా ఒకటిగానే కనిపిస్తుంది. భాషను వ్యాకరణం నిర్దిష్టం చేస్తుంది. కాని ప్రయోగాన్ని నిర్దేశించదు. ఎందుకంటే భాషలో అనేక మార్గాల్లో ప్రయోగాలుంటాయి. అందువలన వ్యాకరణ భాషలోని లక్ష్యాన్ని చర్చించాలి గాలి లక్షణం గాదు. బహుశ దశాబ్దాల క్రితమే, శతాబ్దాల క్రితమే భాషమీద వ్యాకరణం అజమాయిషి మొదలు పెట్టిందనటం. అతిశయోక్తి గాదు. ఒక భాషలోని మూల లక్షణం వేరయినప్పుడు దానిలోని వ్యవహారం వేరవుతుంది. ఆయా ప్రత్యేక లక్షణాల మేరకే ప్రయోగాలు, ఉపయోగాలుంటాయి. నన్నయకు ముందు తెలుగు వ్యాకరణాలు లేవనే మాట వినిపిస్తుంది కాని భాషా వ్యాకరణాలు లేక కాదు. శబ్దానుశాసనం లాంటివి కనిపిస్తాయి. ఇలా కొన్ని 'దేశీ' తెలుగును కొంతవరకు విశ్లేషించాయి. నన్నయ కాలానికి తత్సమీకరణ అధికమై, ప్రబంధయుగం దాకా పరిపుష్టమై వ్యాప్తమైంది. ఒక రకంగా తత్సమ ప్రభావం ప్రజావాఙ్మయాన్ని, భాషను సాహిత్యభాషగా తిరస్కరించి అణచి వేసిందనటం పొరపాటు గాదు. తెలంగాణ విలక్షణ భాషా వ్యవహారం గల ప్రాంతం. సూక్ష్మ వైరుధ్యాలున్నా తెలంగాణ వ్యవహారా నికి ఒక మూల లక్షణం ఉంది. తెలుగులో విభక్తులు సంబోధనతో కలిపి ఎనిమిది ఉన్నాయనేది వ్యాకర్తల అభిప్రాయం. తెలంగాణా ప్రాంతంలో స్థూలంగా ఏడు విభక్తులు వ్యవహారంలో ఉండవు. ఉన్నవి కూడా 'బాల వ్యాకరణం'లాంటి ప్రమాణ గ్రంథాల సూత్రతని తిరస్కరిస్తాయి. ప్రాథమికంగా ఈ వ్యవహారంలో నాలుగు విభక్తులు మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా ఇతర ప్రాంతాలతో వ్యత్యాసం కలిగి వున్నాయి. సాధారణంగా ప్రథమ విభక్తిలో ప్రాతిపదికాలు సంబోధనలు ఉక్తాలినే మూడు పదాలుంటాయి. ''ప్రాతిపదిక సంబోధనాక్తార్ధంబులు ప్రథమంబగు'' అని చిన్నయసూరి డు,ము,వు,లు, ప్రథమా విభక్తి. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాలకు 'డు' ప్రథమా విభక్తిలో కనిపిస్తుంది. తెలంగాణలో తొంభైశాతం ప్రజా భాషలో 'అన్న', 'అమ్మ', 'అయ్య', 'అక్క' లాంటి పదాలు ప్రాతిపదికల్లో కనిపిస్తాయి. నిజానికి ఇది ఇద్దరం వ్యక్తుల మధ్య ఉండే సంబంధాన్ని చూపేవి. ఇవి సంబోధనలే అయినా ప్రాతిపదికల్లో కనిపిస్తాయి. ఉదా: రాజయ్య - మల్లయ్య, రాజన్న - మల్లన్న స్త్రీ పదాల్లో 'అమ్మ/అక్క'లు వినిపిస్తాయి. ఉదా: రాజక్క - మల్లక్క, రాజమ్మ - మల్లమ్మ తెలంగాణ ప్రాంతంలోని నామ్నీకరణాలు దైవికాంశ ని, జానపదాంశని కలిగి వుంటాయి (ఆధునికంగా వీటిలో మార్పులున్నాయి) కొన్నిసార్లు సంబోధనలతో ఉన్న పదాల్లా ఉచ్చారణలో వర్ణాలు లోపిస్తాయి. ఉదా: విజయమ్మ - విజ్జమ్మ ఆనంద్ - నందు 'డు'కు బదులుగా బహువచన ప్రత్యయమైన 'లు' ప్రాతిపదికాల్లో ఏకవచనంలోనే కనిపిస్తుంది. ఉదా: రాములు - వెంకటేశ్వర్లు 'డు' సందర్భాల్లో ఉక్తాల్లో కనిపిస్తాయి. ఉదా: బండోడు - నల్లమొకపోడు నిజానికి వాడు / అది అనే సర్వనామాలు ఇందులో నూ గౌరవ వాచకంగా 'ఆయన / ఆయినె' కనిపిస్తుంది గాని స్త్రీ వాచకంగా 'అది'కే వ్యాప్తి ఎక్కువ. ఉదా: ఇంటిది - ఇంటాయినె నపుంసకలింగాలు చెబుతున్నప్పుడు 'ము' తక్కువే. బదులుగా 'ం' సున్నాని ఉపయోగించడమే ఎక్కువ. ఉదా: కంబము - కంబం అన్నము - అన్నం అద్దము - అద్దం 'పు' ప్రత్యయం కలిగిన పదాలు తెలిసినా వ్యాప్తిలో ప్రత్యామ్నాయాలు ఎక్కువ. ఉదా: తరువు - చెట్టు కొన్ని పదాల్లో రూపాంతర వ్యాప్తి ఎక్కువ 'ఆయు:' అనే పదం 'వు' ప్రత్యయం చేరి 'ఆయువు' అవుతుంది. కాని - ఆయుష్షు - ఆయుస్సు - అవుసుగానే వ్యాప్తి ఎక్కువ. ఇలాంటివి ప్రజా భాషలో ముఖ వ్యాయమం వల్ల సంభవిస్తాయి. ప్రథమా విభక్తిలో సంబోధనల్లోనూ వైరుధ్యాలు న్నాయి. నామవాచకాల్లో అక్క, అమ్మలాంటి పద ప్రత్యయాలున్నా కొన్నిసార్లు అవి కనిపిస్తాయి. కొన్ని సార్లు కనిపించవు. ముఖ్యంగా స్త్రీలింగాల్లోనే ఇలా జరగటం గమనార్హం. రామక్క - ఓ రామీ మల్లక్క - ఓ మల్లీ ఆకారాంతాలైన పదాలూ సంబోధనల్లో 'ఇ' కారాం తాలు, 'ఉ' కారాంతాలవటం. గౌరమ్మ - గౌరూ లక్ష్మి - లచుమా మల్లమ్మ - మల్లీ కొన్ని సార్లు 'ఓ' చివర చేరుతుంది లచుమ - లచుమో మల్లిగా - మల్లిగో మల్లయ్య - మల్లన్నో శ్రోత, వ్యవహర్త మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పు డు పై రూపాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఉక్తార్థాల్లో ధ్వని వ్యత్యయాలున్నాయి. నిద్దుర - నిద్ర - నిర్ద 'లు' బహువచన ప్రత్యయంగా వాడుకలో ఉంది చెట్టు - చెట్లు పుట్ట - పుట్టలు - పుట్లు 'లు' ప్రత్యయం చివరి 'హల్లు'తో చేరి, చేరకుండా (సంయుక్తమయ్యి, కాకుండా) రెండు రకాలుగా వ్యాప్తి లో ఉన్నాయి. పండు - పండ్లు... 'పళ్లు' అనే మూర్దన్యం ఏ అర్థం లోనూ వాడుకలో లేదు. ద్వితీయా విభక్తిలో ని,ను,ల గూర్చి, గురించి... అనే ప్రత్యయాలున్నాయి. 'కర్త ప్రథమలో ఉన్నప్పుడు కర్మ ద్వితీయలో ఉంటుందన్నారు చిన్నయ సూరి. ఈ ప్రాంత వాడుకలోనూ కర్మ ద్వితీయకీ వస్తుంది. వాడి + ని = వాన్ని - ఆన్ని ని, ను లు 'అలుక్' (ప్రత్యయం కనిపించని) రూపాల్లోనే ఎక్కువ. (అ) వాడు చెట్టు కొడుతుండు. (ఆ) వీడు చెట్లు నరికిండు. (ఇ) ఆమె పాలు తెస్తుంది. ఇందులో కర్మయైన చెట్టు, పాల పక్కన విభక్తులు ప్రత్యక్షంగా లేవు. 'గూర్చి' గురించి'లలో 'గురించి' ఎక్కువ వాడుక. (అ) వాని గురించి తెలువది (ఆ) దాని గురించి అడుగకు కొన్నిసార్లు 'గురించి' ప్రత్యామ్నాయంగా 'విషయం' 'మాట' అనే ప్రాతిపదికలు వినిపిస్తాయి. (అ) వాని మాట తెలువది (ఆ) దాని విషయం అడుగకు. 'ల' అనేది ప్రాతిపదికలో సంయుక్తంగా ఉంది (అ) చెట్టు + ల + ను ట చెట్లను కొట్టిండు (ఆ) బుట్ట + ల + ను ట బుట్టల్ని అల్లింది తృతీయా విభక్తిలో చేత, చే, తోడ, తో అనే వాటిలో చివరి రెండూ ఉన్నాయి. కాని ప్రయోగాల్లో వైరుధ్యాలు న్నాయి. చిన్నయసూరి ''కర్మ ప్రథమంబగుచో కర్త తృతీయనగు'' అన్నాడు. ప్రధానంగా ఇక్కడి వ్యవహారంలో కర్మవాక్యాలు లేవు. (బహుశ: ఏ ప్రాంత వ్యవహారంలో కర్మ వాక్యాలు లేవనే అనాలి). ''రావణుడు రామునిచే చంపబడెను'' వంటి వాక్యాల్లో కనిపించే ''బడు'' ప్రత్యయం వ్యవహార శూన్యమే. కాబట్టి తృతీయలో చేత, చే, లు లేవు. తోడ, తో అనేవి బహుళంగా వ్యవహారంలో ఉన్నాయి. ఒక కర్తకో ఒక కర్మకో కాకుండా రెంటికీ, పరస్పరంగా కూడా వ్యవహా రం ఉంది. (అ) వాడితో కష్టమొచ్చింది. (ఆ) వానితోని ఎప్పుడు లాల్లే. వలన- అనే భావంలోనే ఇక్కడ 'తో' ఉపయోగపడు తుంది. ఏం చమిలో చెప్పే విభక్తికి ఇది ప్రత్యామ్నాయం. (అ) వానితో ఇబ్బందే కర్తృ స్థానంలో నాకు, నీకు, రామునికి వంటివి చేర్చవచ్చు. మరికొన్ని ఉదాహరణలు గమనిస్తే 'తో' ఎంత విస్తృతమైందో అర్థమౌతుంది. (అ) నాతోటి వాడు కూడా వచ్చిండు. (ఆ) నాకు వాని తోటే పని. (ఇ) మేము ఒకతోని బగలం మాట్లాడుత లేము. (ఈ) పాలతోటి కోవా చేసిండు. (ఉ) వాని తోటే పోయిండు. (ఊ) వాని తోటే దోస్తి. ప్రథమపురుషలో సంబంధాన్ని, పరిణామాన్ని చెబు తున్నప్పుడు 'తోడ' అనేది 'తోటి' అనే స్వర రూపం మారి కనిపిస్తుంది. కాని గుర్తించాల్సింది ఇది కర్తకు, కర్మ రూపంలో రావడం లేదని 'టి' అనేది జాప విభక్తుల్లో ఒకటని. సాధారణ వ్యవహారంలో లాగానే చతుర్ధీ విభక్తికి సంబంధించి 'కొఱకు' 'కై'లు వాడుకలో లేవు. సంప్రదానంబునకు చతుర్ధియగు' అని చిన్నయ సూరి అన్నా. ఈ ప్రాంతంలో సంప్రదానంలో (షష్టీ విభక్తి) 'కి' ఎక్కువ వాడబడుతుంది. (అ) రాముని కొరకు సీతనిచ్చెను (ఆ) రామునికి సీతనిచ్చిండు. చాలా వరకు 'కోసం' అనేది 'కొరకు'కు ప్రత్యామ్నా యంగా వాడబడుతుంది. కొన్ని సందర్భాలో ఆచ్చా దనా మాత్రంగా సంప్రదానం ఉంది. (అ) అతని కోసం పాలు తెచ్చిన (ఆ) ఎవరి కోసం కొట్లాడిండు (ఇ) నీ కోసం ఎంతసేపు చూస్తా (ఈ) నీ కోసం ఎవరో వచ్చిండ్రు పై వాక్యాల్లో మొదటి వాన్లోనే సంప్రదానం ఆచ్చా దనా మాత్రంగా ఉందిగాని మిగతా వాటిలో లేదు. కాబట్టి 'కోసం' అనేది చతుర్థికి సంబంధించిందిగా, దాని రూపాంతరంగా ఊహించలేం. పంచమీ విభక్తి కూడా తెలంగాణ వ్యవహారంలో లేదు. 'వలన', 'కంటె' 'పట్టి'లో వలనకు బదులుగా తృతీయా విభక్తి ప్రత్యయమైన 'తో'నే వాడుతారు. (అ) వాని వలన కొంప మునిగింది (ఆ) వాని తోటి కొంప మునిగింది (అ) ఉద్యోగం వలన కష్టాలు (ఆ) ఉద్యోగం తోటి కష్టాలు సంస్కృతంలో (తెలుగులోనూ) చెప్పుకునే ఉదాహర ణల్లో 'అశ్వపతిత:'లో 'వలన' కనిపించదు 'నుండి' 'మించి' అనేది కనిపిస్తుంది. (అ) గుర్రం మీంచి పడ్డవాడు (ఆ) గుర్రం నుండి పడ్డవాడు 'మీంచి' అనేది మీద నుండి (చి) అనే దానికి వ్యవహారంలో స్వర రూపాంతరాపత్తి వల్ల ఏర్పడ్డ రూపం. 'కంటే' అనే దానికి కొన్నిసార్లు 'కన్నా' అనేది బదులుగా వాడతారు. అయితే ఈ రెండూ ఒకే అర్థంలో ఉన్నాయి. రెండు వస్తువులను వ్యక్తులను పోల్చినప్పుడు ఈ పద్ధతి కనిపిస్తుంది. (అ) వాని కంటే వీడే నయం (ఆ) వాని కన్నా వీడే నయం (ఇ) ఈమె కన్నా ఆమే మంచిది (ఈ) దీని కన్నా అదే నయం (ఉ) ఇక్కడి కన్నా అక్కడే నయం (ఊ) దీనికన్నా అదే చక్కనిది 'పట్టి' అనేది కూడా కొంత వ్యవహారంలో ఉంది (అ) వీడు చెయవట్టి లొల్లయింది (ఆ) అది జెయవట్టే వచ్చుడైంది సంబంధాన్ని సూచించేది షష్ఠీ విభక్తి. కి, కు, యొక్క లో, లోపల - సుమారుగా ఇవన్నీ కూడా వాడుకలో ఉన్నాయి. 'కి' ఏకవచనంలోనే సంబంధాన్ని సూచి స్తుంది. (అ) ఈ లొల్లిల వానికి సంబంధం లేదు (ఆ) వానికి పెళ్లయింది (ఇ) ఆ పిలగానికి మా బిడ్డనిచ్చినం పై వాక్యాల్లో చివరిది 'కొరకు' బదులుగా వాడబడు తుంది. పైన చతుర్దిలోనూ దీని వివరణలున్నాయి. (అ) పుస్తకాలు వానికి తెచ్చిండు. వీనికిక కాదు. (ఆ) వానికి సైకిలు కొనిచ్చిండు. 'కి' సంప్రదానంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో పై వాక్యాల్లో అర్థమవుతుంది. 'కం' బహువచనంలో వాడటం గమనార్హం. (అ) వాళ్లకు ఆకలలు (ఆ) ఏంది వాళ్లకు చెప్పేది (ఇ) ఆవులకు మేత వేసిండు (ఈ) గొడ్లకు వానికే సోపతి (ఉ) ఆ సదువులకు రోజులు గావు (ఊ) మాటలకు లొంగడు పద బంధాల్లో 'యొక్క' అంతర్గతంగా విభక్తిలోపం లో ఉంది వాక్యంలో బంధంలో ప్రత్యక్షంగా లేదు. అందువల్ల 'యొక్క' లేదనే వినిపిస్తుంధి. (అ) నా యిల్లు, (ఆ) వాని పొలం. 'లొ' 'లోపల' అనేవి రెండూ వాడుకలో ఉన్నా వీటి విషయంలో కొన్ని అంశాలు గమనించాల్సింది. (అ) 'లొ'కన్నా 'లోపల'నే ఎక్కువ వాడకం (ఆ) 'లోపల'కు ఔప విభక్తి 'టి' చేరుతుంది (ఇ) 'టి' చేరినప్పుడు 'లోపటి', 'లోపట' అనే వైరుధ్య రూపాలున్నాయి. 'అందు' 'న' అనే సప్తమికి కూడా 'ల' నే ప్రధాన ఉపయోగం కాని కొన్ని చోట్ల 'అందు' ప్రయోగం 'అండ్ల' 'ఇండ్ల' 'ఎండ్లె' వంటి రూపాల్లో ఉంది. (అ) వానికి మనసుల మనసు లేదు (ఆ) కోపంల ఉన్నప్పుడు మాట్లాడద్దు (ఇ) ఇంట్ల వాళ్లే నలుగురుంటరు (ఈ) పొలంల పనున్నది కొన్నిసార్లు 'ఎ' కారం చేరుతుంది 'ల'తో కలిసిన 'ఎ'కారాన్ని షష్టీ విభక్తిలో (జ) చూడవచ్చు. మరో రెండు ఉదాహరణలు గమనించండి. (అ) గుల్లె దేవుడున్నడు, (ఆ) బల్లె సారున్నడు. అందు అనేది కొన్ని చోట్ల ఉద్వేగాన్ని చెబుతున్న ప్పుడు కనిపిస్తుంది. (అ) మీకు తెలువదా? నా అందున తప్పులేదు (ఆ) నువ్వు పన్జేసేది ఇండ్లనేనా? (ఇ) అండ్ల పని చేస్తవా? ఎందున, అందున, తీందున లకుబదులుగా వాడబడిన రూపాలను గమనిస్తే ఈ భేదాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రజావ్య వహారామే, సంప్రదాయ భాషకు భిన్నమైంది. ఒకటి రెండు వాక్యాల సామెతల్లో జీవితాన్ని చెప్పినట్టు భాషయొక్క ఔపయోగిక క్షేత్రం సూక్ష్మమైందైనా స్పష్టమైంది. తెలంగాణాలోని పది జిల్లాల్లో భాష వైవిధ్యమైందనే భావనలున్నాయి. భాషలోని అతి సూక్ష్మ ప్రయోగాలలో ఉండే పద్ధతులు వదిలేస్తే ఈ ప్రాంతం అంతటికి ప్రధానమైన మూలతత్వం ఉంది. ఇతర ప్రాంతాల ప్రభావాలు ఉచ్ఛారణ మొదలైన అంశాల్లో మార్పులు తెస్తాయి కాని మూలతత్వానికి కాదు. తెలంగాణ భాషా అస్తిత్వాన్ని గురించి మరింత చర్చ జరగాలి. - మ.నా.శర్మ సెల్: 9177260385 http://ift.tt/1inqwQl
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inqwQl
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inqwQl
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి