పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

తోడేలు తోడేలు ||ఫారుఖ్ సర్వర్-అను: డా||దేవరాజు మహారాజు || కొంతకాలంగా నేనొక చెట్టుమీద తలదాచుకున్నాను. అక్కడ అలా ఉండి ఉండి విసిగిపోయాను. ఇప్పుడిక కిందికి దిగి రావాలని ఉంది. కాని నేల మీద నాకోసం తోడేలు కూచుని ఉంది. నా వైపు గుర్రుగా చూస్తూ ఉంది. నేనెప్పుడు కిందికి దిగుతానా నా మీద పడి ఎప్పుడు చీల్చి చెండాడుదామా అని, అది ఎదురు చూస్తోంది. ఈ చెట్టు విచిత్రమైనంది. ఒకరకంగా అద్భుతమైన మహిమలు గలది. నేను కోరుకున్న కోరికలన్నీ ఇక్కడ వెంటనే తీరుతాయి. మెత్తగా వెచ్చగా ఉండే పరుపు కావాలనుకుంటే వెంటనే అది సమకూరుతుంది. విసుగ్గా ఉనప్పుడు కాసేపు టి.వి. చూద్దామనుకుంటే చాలు, ప్రపంచంలోని అన్ని ఛానెల్స్‌తోపాటు స్టీరియో స్పీకర్సు టెలివిజన్‌ ప్రత్యక్షమవుతుంది. తినాలనుకున్నా ఆహారం నిముషంలో ముందుంటుంది. నాకిక్కడ అన్నీ ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక్కటే లేదు స్వేచ్ఛ. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో స్వేచ్ఛ దొరకాలంటే నేను చెట్టుదిగాలి. నా కోసం కాచుకుని కూచున్న తోడేలును చంపాలి. కాని నాకంత ధైర్యంలేదు. అది నాకన్నా శక్తిశాలి. అందుకే నాకు భయం. తోడేలు నావెంట పడడం అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఆ భయానక సన్నివేశం తలుచుకుంటేనే ఒళ్లంతా చెమటలు పట్టి వణికిపోతాను. గుండె ఎక్కడో జారిపోయినట్లనిపిస్తుంది. ఎదురుగా చెట్టు కనిపించింది గనుక బతికి పోయాను. ప్రాణభయంతో గబగబా చెట్టెక్కగలిగాను. లేకుంటే తోడేలు ఈ పాటికి నా శరీరాన్ని రెండుగా చీల్చేసేదే. అంతా ఆ అల్లా దయ. చెట్టు బాగా ఎత్తయ్యింది కాబట్టి, తోడేలు ఇంతపైకి ఎక్కలేదు కాబట్టి సరిపోయింది. దట్టమైన చెట్టుకొమ్మల మధ్య నేను క్షేమంగా ఉండగలుగుతున్నాను. పగలు ఎలాగో గడిచిపోతుంది. చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తూనో, కల్పించుకుని ఏదో ఓ పని చేస్తూనో – కాని, రాత్రి గడపడమే సమస్య. కళ్లు మూసుకుని నిద్రపోతే భయంకరమైన కలలు. కళ్లు తెరిస్తే చీకటి. కీచురాళ్ల రోద. నా కోసం కాచుకుని కూర్చున్న తోడేలు. శరీరానికి కదలిక లేక, స్వేచ్ఛగా తిరగడం లేక ఒళ్లంతా నొప్పులు. అయినా ఎంతకాలం ఇలా? తోడేలు ఆకలితో అల్లల్లాడి ఛస్తుందా అని ఎదురుచూడడం? కాని, విచిత్రం. తోడేలు రోజు రోజుకు చిక్కపోవడం కాదు గదా, మరింత బలం పుంజుకుని పుష్టిగా తయారవుతోంది. ఓ రోజు నేను కళ్లు తెరిచే సరికి పక్కన గల మరో చెట్టుమీద కొమ్మలు కదులుతున్నాయి. తోడేలు చెట్టెక్కిందేమోనని హడలి చచ్చాను. బిగ్గరగా అరిచాను. దాంతో చెట్టు మీది మనిషి ఖంగుతిన్నాడు. తీరా చూద్దును కదా అతను కూడా నాలాంటి మనిషే. భయంతో కంపిస్తూ బిక్కు బిక్కుమంటున్నాడు. అతను కూడా నాలాగే తోడేలు బారిన పడకుండా చెట్టెక్కి కూర్చున్నాడు. కిందికి చూస్తే, అతణ్ని తరుముకొచ్చిన తోడేలు అతని చెట్టు కిందే ఉంది. భయంకరంగా అరుస్తూ, చెట్టు కాండాన్ని తన గోళ్లతో రక్కుతూ కసి వెళ్లబోసుకుంటోంది. కాని చెట్టెక్కలేక పోతోంది. ఇప్పుడు ఇద్దరమయ్యాం. ఇద్దరిదీ ఒకే పరిస్థితి. రోజులు గడుస్తున్నకొద్దీ చెట్టుపైన ఉండలేక పోతున్నాం. మెలకువగా ఉన్నా, నిద్రపోయినా ఒకటే భయం. ఇంత దుర్భరమైన బతుకు ఎందుకు బతకాలో తెలియదు. తోడేళ్లు వాటి వాటి స్థానాల్లో అవి ఉన్నాయి. నా తోడేలు నన్ను, నా మిత్రుడి తోడేలు అతణ్ని మాత్రమే భయపెడుతున్నాయి. అతడి తోడేలు నన్నుగాని, నా తోడేలు అతణ్ని గానీ భయపెట్టడం లేదు. ఒక రకంగా వాటి మధ్య సఖ్యత, సహకారం ఉన్నట్టులేదు. వేటికవే ఉంటూ ఒక్కోసారి చెట్టు కాండాన్ని బాదుతూ, పళ్లతో కొరుకుతూ తమ ప్రతాపం ప్రదర్శిస్తున్నాయి. అలాంటి తోడేల్ల చేష్టలు గమనించినప్పుడు మా ప్రాణాలు పైపైనే ఎగిరిపోతున్నాయి. అయినా మొండిగా కాలయాపన చేస్తున్నాము. మేమిద్దరం దీర్ఘకాలం చర్చించుకుని చర్చించుకుని చివరకు ఓ నిర్ణయానికొచ్చాం. ఏమైతే అదైంది. చెట్లు దిగి కిందికి వెళదామనుకున్నాం. జీవితాన్ని ఇంత నిరర్థకంగా ఇక ఎంత మాత్రమూ గడపగూడదనుకున్నాం. నా సహవాసి అంతపని చేశాడు కూడా. నేనే పిరికి వాణ్ని. చెట్టుమీద ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండిపోయాను. నా స్నేహితుడు భూమి మీద పడగానే అతని తోడేలు అతని మీదికి లంఘించింది. నా తోడేలు కూడా నా కోసం సిద్ధపడింది. నేను కూడా భూమి మీదికి దిగుతానేమోనని. చెవులు రిక్కించింది. నేను దిగకపోయే సరికి, పిచ్చెక్కిపోయి ఉగ్రరూపం దాల్చింది. బలమంతా ఉపయోగించి గాల్లోకి ఎగిరి, చెట్టు కాండాన్ని ఒక్కతోపు తోసింది. నా సహవాసి తెలివైన పనిచేశాడు. కిందికి దూకుతూ దూకుతూ ఓ చిన్న కొమ్మను లాగాడు. అది అతడి చేతిలోకొచ్చింది. ఆ చిన్ని కొమ్మతో అతను తోడేలును విసురుగా కొట్టాడు. అంతే, తోడేలు నేలకూలి చచ్చిపోయింది. దృఢనిశ్చయం, కొద్దిపాటి ధైర్యం, ఆచరణలతో నాతోటి మిత్రుడు స్వేచ్ఛను పొందాడు. అవి లేకనే నేను బందీగా ఉండిపోయాను. నా పిరికితనం చూసి కాబోలు, నా తోడేలు మరింత రెచ్చిపోయింది. నావైపు చూసి భీకరంగా అరవడం పై కెగిరి కాండాన్ని బలంగా దెబ్బతీయడం ఎడతెరపి లేకుండా చేస్తోంది. దాంతో చెట్టు అతలాకుతలమైపోతోంది. చెట్టుపై నుండి నేను కింద పడేట్టుగా ఉన్నాను. లేదా చెట్టయినా విరిగి పడేట్టుంది. భయంతో చెమటలు పట్టినా శరీరం కంపించి పోతోంది. కొమ్మల్ని గట్టిగా పట్టుకుని, కదలకుండా ఉండాలన్నా సాధ్యం కావడం లేదు. నా మిత్రుడు కింది నుండి దైర్యం చెబుతున్నాడు. ‘భయంలేదు కిందికి రా. తోడేలు నిన్నేమీ చేయలేదు. చూడడానికి అలా బలిసినట్టుంది కానీ, దాని దగ్గర బలంలేదు. అది నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు దాన్ని సునాయసంగా చంపొచ్చు. నా తోడేలు గతి చూశావు కదా? ఇంకా ఎందుకు భయం? దృఢ నిశ్చయంతో అడుగు ముందుకెయ్‌’. అతనెంత ధైర్యం చెప్పినా నా భయం నాది. లోపలి నుండి వణుకు తన్నుకొస్తుంటే. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేక పోతున్నాను. అతని మాటలు నమ్మి కిందికి దిగకపోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. అవి నా భయాన్ని వెయ్యి రెట్లు పెంచుతున్నాయి. నాకిక మరణం తప్పదన్న విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఉన్న ఫళంగా చెట్టు ఎవరో పెకిలిస్తున్నట్టు బీభత్సంగా కదలసాగింది. అది తోడేలు పనేమోనని కిందికి చూశాను. తోడేలు అలిసిపోయి ఓ మూల కూలబడి ఉంది. మరి చెట్టు ఎలా ఊగుతోంది? అనుకునేంతలో చెట్టు కిందికి కుంచించుకుపోసాగింది. నన్ను నేను రక్షించుకునే ప్రయత్నం చేశాను. భయంతో పెద్ద కొమ్మలందుకుని పైపైకి ఎగబాకాను. కాని అదంతా వృథా అయింది. చెట్టు క్రమక్రమంగా చిన్నది కాసాగింది. అదీగాక, నా గుండె పగిలే సంఘటన మరొకటి జరిగింది. కింద నాకోసం కాచుకుని కూచున్న తోడేలు ఊహించనంతగా పెరిగి పోసాగింది. చూస్తుండగా దున్నపోతు పరిమాణానికి పెరిగింది. మృత్యు భయంతో నేను అరిచినా గీ పెట్టినా, హాహాకారాలు చేసినా, కొమ్మ నుండి కొమ్మకు మారుతూ గెంతుతున్నా ప్రయోజనమే లేదు. నికృష్టపు చావుకు సిద్ధపడడం కన్నా మరో మార్గం కనబడలేదు. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్తితులతో నేనిక సెలవు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నాకూ తోడేలుకూ మధ్య దూరం తగ్గిపోతోంది. నా మెదడు మొద్దుబారింది. కళ్లు మూసుకుపొయ్యాయి. ఉరి తీయబడే ద్రోహిలాగా నేను మృత్యువును ఆహ్వానిస్తున్నాను. ఉరితీసేవాడు దగ్గరికీ రావడం తలకు నల్ల తొడుగు తొడగడం, ఉరి బిగించి లివర్ లాగడం అన్నీ నా ఊహలో చకచకా జరిగిపోతున్నాయి. ఈ చెవులకు ఆ లివర్‌ లాగిన చప్పుడు మృత్యు శబ్దంలా వినిపించక తప్పదు. ఇక ఆ మృత్యు శబ్దం తప్ప మరో శబ్దం వినిపించదు కదా? అనుకున్నాను. నన్ను మృత్యువు కబళిస్తున్నట్లు, నా శరీరాన్ని మనసును, మృత్యువు ఆక్రమిస్తున్నట్టు ఒక గాఢమైన అనుభూతి! అయితే అందులో కూడా నా మిత్రుడి అరుపులు ఎక్కడో దూరంలో వినిపిస్తూనే ఉన్నాయి. తోడేలు నన్నేమీ చేయలేదని, దాని కన్నా నేనే బలమైన వాణ్నని, తోడేలు గాలికొట్టిన బెలూన్‌ లాంటిదని, ఒక చిన్న తన్నుతో ఎగిరి పడుతుందని దారికి అడ్డం తొలుగుతుందని అతను విసుగూ విరామం లేకుండా పాపం చెబుతూనే ఉన్నాడు. అతని మాటల పట్ల నాకు ఏ క్షణాన విశ్వాసం కుదిరిందో, ఏ క్షణాన తెగింపు వచ్చిందో తెలియదు. ధైర్యం తెచ్చుకుని కిందికి దూకాను. ఊహించినట్లుగానే భయంకరంగా అరుస్తూ తోడేలు నాపై దాడి చేసింది. అది నన్ను చంపక ముందే నేను నా చేతిలోని సున్నితమైన చిన్న కొమ్మతో దాన్ని అదిలించాను. అంతే!! అది చావు దెబ్బతిన్న దానిలా కుప్పగూలిపోయింది. విలవిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది. ఏనుగంత ఆకారంలో ఉన్న తోడేలు నిముషంలో పీనుగైపోయింది. ఇప్పుడు నేను స్వేచ్చా జీవిని - స్వేచ్ఛ – ఎంతటి అందమైన మాట? దాని విలువ గ్రహించగలిగే వారికే అందులోని ఆనందం అనుభవానికొస్తుంది. సంతోషం పట్టలేక నాట్యం చేయడం ప్రారంభించాను. నాట్యమంటే నాట్యమే. పిచ్చోళ్ల నాట్యం అది. పిచ్చి ఆనందం వేసే గెంతులు. కొద్దిసేపటికి… తేరుకున్నాక, పరిస్థితిని అర్థం చేసుకున్నాక నా సహవాసికి కృతజ్ఞతలు తెలుపుదామనుకుని, అతని కోసం చుట్టూ చూశాను. స్నేహితుడా అని పిలిచాను. అతని జాడ కనబడలేదు. ‘ఇంతలోనే ఎక్కడ మాయమయినాడూ’ అని విస్తుపోతున్న నాకు ఒకదృశ్యం కనిపించింది. నా చుట్టూ కనిపించినంత దూరం పెద్ద పెద్ద చెట్లు పెరిగి ఉన్నాయి. ప్రతి చెట్టుమీదా ఓ మనిషి బందీ అయి ఉన్నాడు. ప్రతి చెట్టు కిందా పై నున్న వాణ్ని భయపెడుతూ, ఓ తోడేలు భయంకరంగా ఎగిరిపడుతోంది. వణికిపోతూ మృత్యుభయంతో చెట్లమీద తలదాచుకున్న వాళ్లను చూస్తే నాకు తెరలు తెరలుగా నవ్వాగలేదు. వాళ్లంతా నాలాగా మామూలు అమాయక ప్రాణాలు. జీవితంలో చిన్నపాటి తెగింపులేక ఉత్త పుణ్యానికే… కారణం లేకుండా తమ తమ తోడేళ్ళను చూసి హడలిఛస్తున్నారు.http://ift.tt/1j1YMPp

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1YMPp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి