తెలుగు కవిత్వంలో ఎర్రజెండా Posted on: Mon 19 May 00:04:41.573374 2014 ఎర్రజెండా... శ్రమైన జీవన సౌందర్య వైజయంతిక. తెలుగువారి సమస్త రంగాల్లోలాగానే తెలుగు సాహిత్యంలోకి 30వ దశకంలోనే ధగద్ధగాయమానంగా ప్రకాశించింది. 'సింధూరం, రక్త చందనం/ బందూకం, సంధ్యా రాగం/ పులి చంపిన లేడి నెత్తురు/ ఎగరేసిన ఎర్రని జెండా / రుద్రాలిక నయన జ్వాలిక/ కలకత్తా కాళిక నాలిక/ కావాలోరు నవ కవనానికి' అని 1937 ఆగస్టు 3న నవకవిత రాశారు శ్రీశ్రీ. దీనికి రెండేళ్ల ముందే 1935లో - 'ఎగరాలి ఎగరాలి/ మన ఎర్రజెండా/ అదురు బెదురూ లేక/ అడ్డేమియును లేక' అని తుమ్మల వెంకట్రామయ్య రాశారు. 40, 50 దశకాల్లోనూ, ఆ తర్వాత కాలంలోనూ 'అడ్డేమియూ లేక' పుంఖాను పుంఖంగా ఎర్రజెండాలతో తెలుగు కవిత్వం నిండిపోయింది. 'వేగరావోరు కార్మికా / వేగరావోరు కర్షకా/ కలసి మెలిసి పలకవోరు/ అరుణ పతాకాకు జై' / 'తుపాకి బారులు ప్రేలినా / బాంబుల వర్షం కురిసినా/ ఎత్తిన జెండా దించకోరు / అరుణ పతాకాకు జై'/ 'పటేలు నెవురూలొచ్చినా / గూర్ఖా సిక్కులు తోలినా / ఎత్తిన జెండా దించకోరు/ అరుణ పతాకాకు జై' అంటూ 1946లో ప్రజాశక్తిలో ముక్కామల నాగభూషణం రాసిన మార్చింగ్ సాంగ్ బాగా ప్రాచుర్యం పొందింది. కయ్యూరు కామ్రేడ్స్‌ని ఉరి తీసిన సందర్భంలో 1948 ప్రజాశక్తిలో ప్రముఖ గాయక కవి బి.గోపాలం- 'కార్మిక రక్త పతాకము/ కోటలపై పేటలపై/ ఎగరేస్తాం యుగయుగాలు/ వెలిగిస్తాం జగజగాలు' అని రాశారు. అదే సంవత్సరం కాటూరు యలమర్రు సంఘటనలపై స్పందించిన అవసరాల సూర్యారావు 'విశాలాంధ్ర' డిసెంబరు సంచికలో- ఎర్రజెండా ఎగరేస్తూ/ కొడవలి ఝళిపిస్తూ/ సందులను గొందులను చవిటి సంస్థలను../ చరిత్రకెప్పుడూ మూడు యోజనాల ముందు చూపు మానవుడా! నవ మానవుడా!' అని రాశారు. ప్రముఖ సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి ఎరుపుని అగ్నితో పోల్చి- 'అనల పతాకం అనల పతాకం / అంబర వీధుల మెరిసింది/ కాంచన గంగా ధవళ శిఖరిపై/ రక్తధీదితులు విరిశాయి/ అనల పతాకం అనల పతాకం/ అంబర వీధుల మెరిసింది / అజస్త మజస్త మెరిగింది/ అనలంగరళం క్రక్కింది' అంటూ ప్రజాశక్తిలో 1945లో రాశారు. బహుశా చైనా విప్లవ విజయాన్ని కీర్తించటం ఆయన ఉద్ధేశం కావచ్చు. ఏటుకూరు ప్రసాద్ ఏకంగా- 'ఎర్రజెండేరా తమ్ముడ ఎర్రజెండారో...' పల్లవితో ఎర్రజెండాపైనే గేయం రాశాడు. గజ్జెల మల్లారెడ్డి- 'ఎత్తరా మన ఎర్రజెండా/ ఎర్రకాంతులు దిశలు నిండా/ ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్రజెండా/' గేయం చాలా ప్రాచుర్యం పొందింది. రెంటాల తెలంగాణా సమర గీతం 'సర్పయాగం'లో - 'పగలేయి నిజాం కోట/ ఎగరేయి ఎర్రబావుటా' అని గానం చేశాడు. సోమసుందర్ వజ్రాయుధంలోని సమధర్మం దీర్ఘకవితలో (1949)- 'భువియొక విప్లవ మూర్తై / నిలువు కాళ్ల నిలుస్తుంది/ అరుణారుణ పతాకమై/ ఆకాశాన మెరుస్తుంది' అని రాశారు. వామపక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని సుప్రసిద్ధ కవి 'కరుణ శ్రీ' ... - 'త్యాగోజ్జ్వల మహిమా మండిత రాగారుణ రక్త పతాకం/ నవ భారత హృదయాంబరమున / ప్రసరించిన మహేంద్రచాపం' అని రాశారు.. కయ్యూరు కామ్రేడ్స్‌ని ఉరి తీసినప్పుడే- ఆచార్య 1948 మార్చి ప్రజాశక్తిలో - 'ఎర్రజెండా నీడ ఏకమై మేమంత / మన లక్ష్య సిద్ధికై కూలిపోయిన బాట / తప్పకిదె వస్తామురా... కామ్రేడ్స్/ శపధమిదె చేస్తామురా..' అరుణాంజలి ఘటించారు. దీర్ఘ కవితలు, మినీ కవితలు ఏకకాలంలో మిక్కిలిగా రాసిన సింగంపల్లి అశోకకుమార్ తన వ్యూహం కవితా సంపుటిలో- 'దేశాలను తెలిపేది ఎగిరే జెండా/ దేశాలను కలిపేది ఎర్రని జెండా' అని పేర్కొన్నారు. పొద్దు పూసింది కవితా సంపుటిలో - 'ఉదయించే సూరీడు నింగి నిండా ఎగిరే ఎర్రని జెండా' అని అన్నాడు మరో ప్రముఖ కవి యం.కె.సుగంబాబు.. 'ఓ అరుణ పతాకమా!/ చేకోనుమా రెడ్ సెల్యూట్/ శ్రమజీవుల కేతనమా..' అని ఏనాడో శ్లాఘించాడు ప్రజాకవి సుబ్బారావు పాణిగ్రాహి. చెరబండ రాజు తన కవిత్వంలో అనేకసార్లు 'ఎర్రజెండా'ని ప్రస్తావించి ప్రశంసించాడు. 31-8-1973న రాసిన 'ఊపిరి' కవితలో - 'కష్టజీవుల నెత్తెరెరుపు / కమ్యూనిస్టు జెండ ఎరుపూ... ఎర్రజెండా విడువకండి..' అని రాశాడు. ప్రజాయుద్దానికి, శ్రీకాకుళానికి, ఎర్రజెండాకి ఇదే సంపుటిలో మరోచోట చెరబండరాజు లాల్ సలాం చెబుతాడు. వచన కవి ఎ.ఎన్. నాగేశ్వరరావు 'సముద్రం నా స్వప్నం' సంపుటిలో - 'కామ్రేడ్స్ మీరెత్తిన ఎర్రజెండా/ నిటారుగా తలెత్తుతుంది/ ఆరు ఖండాల ఆకాశమ్మీద/ స్వేచ్చగా ఎగురుతుంది/ సుత్తీకొడవలి హత్తుకొని/ ప్రజా పిడికిళ్ళు ఆవేశంతో/ ' అంటూ అరుణ పతాక విస్తృతిని వివరించాడు. రంగనాయమ్మ సంపాదకత్వంలో వచ్చిన వసుధ డిసెంబరు 72 సంచికలో- 'తిరగబడ్డ ఎర్రజెండా/ పాడుతున్న గీతం/ సమగ్ర విప్లవాన్ని/ కోరే సంగీతం' అని రాస్తాడు శివసాగర్. అప్పటికే అనేకసార్లు తెలుగు సినిమా తెరపై ఎగిరిన ఎర్రజెండాని 'చీమల దండు' సినిమాలో ఎర్రజెండేర్ర జెండ ఎన్నియలో, ఎర్రెర్రని ఈ జెండెన్నియల్లో అంటూ ఎగరేశారు.. బీజింగ్ ప్రపంచ మహిళా మహాసభ 28.8.1995లో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగినప్పుడు ప్రతినిధిగా వెళ్లిన ఓల్గా- 'ఇక్కడ ఎగురుతున్న ఎర్ర జెండాల్ని చూస్తుంటే/ శరీరంలో రక్తమంతా వెల్లువై/ వేల జెండాలుగా మారుతున్న అనుభూతి..' అంటూ పరవశించారు. ఇంకా వందల సంఖ్యలో కవులు, గాయకులు ఈ శ్రామిక జెండాను కీర్తించారు. జనవిముక్తి కేతనంగా, ప్రజారక్ష పతాకంగా అభివర్ణించారు. ఎంత రాసినా, ఎంత పాడినా ఎర్రజెండా ఘనత తరగనిది.. ప్రతి క్షణం విశాల శ్రామిక ప్రపంచానికి ప్రేరణ అది. - చెరుకూరి సత్యనారాయణ http://ift.tt/Tk4SRK
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tk4SRK
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tk4SRK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి