పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఏప్రిల్ 2014, గురువారం

Sreedhar Babu Pasunuru కవిత

"మళ్ళీ మరొక్కసారి ప్రేమ గురించి..." -- పసునూరు శ్రీధర్ బాబు మరొక్కసారి ప్రేమ గురించి మళ్ళీ మళ్ళీ మరొక్కసారి వెళ్ళిపోయిన ప్రేమ గురించి రాలిన పూవు మట్టిలో కలిసిపోతుంది వాలిన చూపు ఎక్కడో నాటుకుపోతుంది కురిసిన వర్షం వంకలో వాగులో చివరకు సముద్రంలో కలిసిపోతుంది తడిసిన దేహం చివరి నిట్టూర్పు దాకా వణుకుతూనే ఉంటుంది పొద్దుటి వెలుగు మీదకు చీకటి తరుముకొస్తుంది చీకటి పంచిన కలలను ఏ వెలుగు తుడిచేయగలుగుతుంది? శిశిరానికి కానుకైన మొదటి హరిత పత్రం వసంతాన్ని స్మరిస్తుందా.. స్వప్నిస్తుందా? నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరే మధ్యలో ఈ కాలం గొడవేమిటి నేనెప్పుడో నీదారి నీదే నాదారి నాదే అని చెప్పింతర్వాత! గుండ్రని భూమికి ధిశలేమిటి? ఎటు వెళ్ళినా నేను ముందుకే వెళ్తాను- నా జీవితాన్ని నేను ఇటు నుంచి అటూ అటు నుంచి ఇటూ జీవిస్తాను ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తానో లేక ఎక్కడికైనా పోతానో? ఏమైతేనేం? నేను నా కాలం నా ప్రాణం నా ప్రయాణం ఒక్కటే అయినప్పుడు! ఏమైపోతేనేం? నేను నా గానం నా గాయం నా జ్ఞాపకం వెన్నంటే వస్తున్నప్పుడు! అందుకే మరొక్కసారి ప్రేమ గురించి ప్రతిక్షణాన్ని ప్రతీక్షణంతో వెలిగించి వెళ్ళిపోయిన ప్రేమ గురించి వెళ్ళిపోయిన ప్రేమ వెంటే వెళ్ళిపోయిన నాగురించి శిలువ మీద క్రీస్తులా కాగితాల మీద అక్షరాలుగా వేలాడే క్షణాల గురించి మళ్ళీ మరొక్కసారి నావెంటే వెళ్ళిపోయిన ప్రేమ గురించి...! *** (24 ఏప్రిల్ 2014)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nJimzZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి