పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఏప్రిల్ 2014, గురువారం

Afsar Afsar కవిత

అమ్మ మరణం వెలిగించిన కవిత్వ దీపం – నటాషా! ~ “దిక్కుమాలిన చరిత్ర ఎప్పుడూ నా కాళ్ళకి అడ్డం పడుతూనే వుంటుంది కదా!” అంటాడు ఆగా షాహీద్ అలీ వొక కవితలో! చరిత్రని తేలికగా నిరాకరించలేం, నిజమే! మన ఉనికిని నిర్ణయించే కీలకమైన శక్తి చరిత్ర. పుట్టిన కులం, చుట్టుముట్టే సమూహాలూ, మనల్ని పెంచే ఊళ్ళూ, బళ్ళూ- మన చుట్టూ పని చేసే సంఘాలూ రాజకీయాలూ ఉద్యమాలూ – అన్నీ చరిత్రలో భాగం అవుతూ మన జీవితాలతో పెనవేసుకుంటాయి. మనమూ క్రమంగా చరిత్రలో భాగం అవుతూ వెళ్తాం. కాని, ఆ చరిత్రని వొక కవి మనసు ఆ ఎలా అర్థం చేసుకుంటుంది? అసలు చరిత్రని కవిత్వీకరించడం సాధ్యమేనా? ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి Natasha Trethewey కవిత్వం చదివినప్పుడల్లా ఈ కొత్త కవిత్వ కోణం నన్ను విస్మయంలో పడేస్తుంది. 1966 లో మిస్సిసిపిలో పుట్టిన నటాషా అమెరికాలోని ఎమొరీ యూనివర్సిటీలో కవిత్వ పాఠాలు చెప్తుంది. పందొమ్మిదేళ్ళ వయసు నించి కవిత్వం రాస్తూ వున్న నటాషా ఇప్పటివరకూ అయిదు కవిత్వ సంపుటాలు ప్రచురించింది. అమెరికాలో కవిత్వ రంగంలో వున్న అవార్డులన్నీ ఆమెని వరించాయి. ఆమె కవిత్వ పుస్తకాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నది “The Native Guard.” నిజానికి ఇది వొక ఆఫ్రికన్ అమెరికన్ రెజిమెంట్ పేరు. అమెరికాని చరిత్రలో విస్మృతికి గురైన నల్లవారి రెజిమెంట్ ఇది. “చరిత్రలో ఇలాంటివెన్నో మనం మరచిపోయాం. మనకు తెలిసీ తెలిసీ వాటి గురించి మాట్లాడడం మానేసాం. అలా మానేయడం గురించి నా బాధ. నా కవితలన్నీ ఆ బాధలోంచి వచ్చినవే!” అంటుంది నటాషా! జాతుల చరిత్ర తనను ఎప్పుడూ వెంటాడుతూనే వుందని ఆమె అంటుంది. నటాషా తల్లి నల్లజాతి మహిళ, తండ్రి తెల్లవాడు. ఈ నలుపూ తెలుపూ తేడాలు తన ఉనికిలో భాగమై పోయాయని, ఎక్కడికెళ్ళినా నల్ల తల్లి, తెల్ల తండ్రి గురించే ప్రశ్నలు వస్తూండడంతో ఈ రంగుల చరిత్ర మీద ఆసక్తి పుట్టింది నటాషాకి! ఈ లోపు ఇంకో విషాదం జరిగింది. ఆమె తల్లిని రెండో భర్త దారుణంగా చంపేసాడు. తల్లిని కోల్పోయిన విషాదం ఆమెలో నల్ల వారి చరిత్రకి సంబంధించి ఇంకో కొత్త కోణాన్ని చూపించింది. తల్లికి సంబంధించిన వుద్వేగంలోంచి ఆమె నల్ల చరిత్రని చూడడం మొదలెట్టింది. కాని, ఆమె కవిత్వం తప్ప ఇంకేమీ రాయలేదు. కాబట్టి, చరిత్రకి సంబంధించిన ఆ బాధ అంతా కవిత్వంలోనే వ్యక్తం చేసింది, అదీ అమ్మ కోణం నించి ఆ చరిత్ర చెప్పడం మొదలెట్టింది. అందుకే, ఆమె కవిత్వంలో అమ్మ కేవలం అమ్మ కాదు, అమ్మ వొక మెటఫర్! వొక విస్మృత చరిత్రకీ, అణగారిన జాతిలో పుట్టిన నేరానికి స్త్రీలు ఎదుర్కొనే హింసకీ మెటఫర్. ఆ మాటకొస్తే, అమ్మ చనిపోయిన విషాద క్షణంలో కవిత్వం రాయడం మొదలెట్టింది ఆమె. అప్పటిదాకా కవిత్వం రాయాలన్న ఆలోచనే ఆమెలో లేదు. ~ అమ్మ చనిపోయిన రోజు అమ్మని ఆ నేల పొత్తిళ్లలో నిద్రపుచ్చుతున్నంత సేపూ కురుస్తూనే వుంది వాన. చర్చి నించి శ్మశానం దాకా. మా కాళ్ళ కింది బురద నీళ్ళువొక శూన్యాన్ని చప్పుడు చేస్తున్నాయి. పాస్టర్ పిలిచినప్పుడు చెయ్యెత్తి నిలబడ్డాను "మరణంతో ఆగిపోతుంది ఈ దేహం చెయ్యాల్సిన పని. ఇక మొదలు ఆత్మ యానం...." తీరా వెనక్కి తిరుగుతున్నప్పుడు రానే వచ్చాడు సూరీడు. వెనక్కి తిరుగుతున్న నా వేపు తీక్షణంగా చూశాడు, వెనక్కి తిరిగాను అమ్మని అక్కడే వదిలేసి. ఇంటికి వెళ్తున్న దారినిండా గతుకులు ఎప్పుడూ అది గతుకుల దారే. నెమ్మదించినా నా అడుగులు, క్షణం నిలవదుగా, ఈ కాలం! పోయిన వాళ్ళ పేర్ల మధ్య నా సంచారం అమ్మ పేరు నా తల కింద రాతి తలగడ. * http://ift.tt/1pSk2qj

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h4wQul

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి