పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఈ రోజు గాలిబ్ కవిత్వంలో మొదటి కవిత గాలిబ్ దీవాన్ లోని 14వ షేర్లో 6వ షేర్ ముం నా ఖుల్ నే పర్, హై వో ఆలమ్ కే, దేఖా హీ నహీం జుల్ఫ్ సే బఢ్ కర్ నఖాబ్ ఉస్ షౌఖ్ కే ముం పర్ ఖులా ముఖం కనబడకున్నా, ఎన్నడూ చూడని దృశ్యం బాగుంది నీలికురుల కన్నా వదనంపై మేలిముసుగు అందంగా ఉంది ఈ కవితలో ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ముం అంటే ముఖం, వదనం. ఆలమ్ అంటే పరిస్థితి, దృశ్యం వగైరా అర్ధాలున్నాయి. దేఖా హీ నహీం అంటే ఎన్నడూ చూడలేదని అర్ధం. జుల్ఫ్ అంటే శిరోజాలు. నఖాబ్ అంటే మేలి ముసుగు లేదా ముస్లిం స్త్రీలు తలపై శిరోజాలు కనబడకుండా కట్టుకునే స్కార్ఫ్. షౌఖ్ అంటే అల్లరి, ఎడ్వంచరస్. ముం పర్ ఖులా అంటే ముఖానికి చాలా అందంగా, నప్పినట్లు ఉందని అర్ధం. ఈ కవితలో గాలిబ్ తన ప్రేయసి అందాన్ని పొగుడుతున్నాడు. ఆమె ఎలా కనబడినా ఆయనకు అందంగానే కనబడుతుంది. సాధారణంగా కవులు ప్రేయసి నీలికురుల సౌందర్యాన్ని వర్ణిస్తారు. శిరోజాల అందాన్ని చెబుతారు. అందమైన ముఖంపై నల్లని కురులు జాలువారుతున్న దృశ్యాన్ని వర్ణిస్తారు. కాని ఇక్కడ గాలిబ్ ప్రేయసి మేలిముసుగులో ఉంది. నకాబ్ అన్న పదాన్ని గాలిబ్ ఉపయోగించాడు. నకాబ్ అంటే ముస్లిమ్ స్త్రీలు తలపై ధరించే స్కార్ఫ్. దీనివల్ల శిరోజాలు కనబడవు. కొందరు ముఖం కూడా కనబడకుండా నకాబ్ ధరిస్తారు. అంటే గాలిబ్ కు ఆమె అందమైన ముఖం చూసే అవకాశమే లేదు. అయినా గాలిబ్ నిరాశ చెందలేదు. నల్లని కురులు ముఖంపై కదలాడుతున్న సుందర వదనం కనబడకపోయినా, ఆమె సుందరవదనానికి ఆ మేలిముసుగు చాలా నప్పుతుందని, అందులో ఆమె చాలా అందంగా ఉందని అంటున్నాడు. అంటే సౌందర్యమన్నది ఆకారంలో లేదు ప్రేమలో ఉందన్న అంతరార్థం ఈ కవిత చాటి చెబుతోంది. ముఖాన్ని ఆచ్ఛాదనలు కప్పేసినా ప్రేయసి అందంగానే కనబడుతుంది. ఈ గజల్లోని ప్రతి కవితలోను గాలిబ్ సూఫీతత్వాన్ని అంతర్లీనంగా ప్రకటించాడు. ఈ కవితలోను మనకు సూఫీతత్వం కనబడుతుంది. అల్లాహ్ అన్న పదానికి తెలుగులో అర్ధం చెప్పాలంటే దేవుడు, ఇంగ్లీషులో గాడ్. అల్లాహ్ ను ఎవరు చూడలేదు, ఆయన రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతల పరదాల వెనుక ఆయన రూపం దాగుందని కవులు వర్ణిస్తారు. ఈ నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు ఆయన ముఖారవిందానికి ఎంతో అందంగా ఉన్నాయని కవితల్లో రాస్తారు. చీకటి రాత్రిలో నల్లని మబ్బుల మాటున నక్షత్రాలు కనబడకపోయినా ఆ దృశ్యం కూడా దేవుని సౌందర్యంగానే వర్ణిస్తారు. దేవుని రూపం మనిషి చూడలేకపోయినా, ఆయన సౌందర్యాన్ని మనిషి చూపులు అందుకోలేకపోయినా, ఆయన సృష్టిలోని చీకటిలో కూడా ఆయన సౌందర్యం దాగుందన్న భావం ఈ పంక్తుల్లో ఉంది. ఈ కవితలో ముం అన్న పదాన్ని గాలిబ్ రెండుసార్లు ఉపయోగించాడు. సాధారణంగా గాలిబ్, చాలా మంది ఉర్దూ పదాలు ఒకే కవితలో వాడిన పదాన్ని మరోసారి వాడడం జరగదు. కాని ఇందులో ముం నా ఖుల్నా, ముం పర్ ఖుల్నా అనే పదబంధాలు ఉర్దూ పలుకుబళ్లు. రెండింటిలోను అర్ధభేదాలున్నాయి. ముం నా ఖుల్నా అంటే ముఖం కనబడడం లేదని అర్ధం. ముం పర్ ఖుల్నా అంటే ముఖానికి నప్పేలా ఉందని, ముఖానికి చాలా అందంగా ఉందని అర్ధం. ఈ రోజు రెండవ కవిత గాలిబ్ సంకలనంలోని 14వ షేర్ 7వ షేర్ దర్ పే రహ్నే కో కహా, ఔర్ కహ్ కే కైసా ఫిర్ గయా జిత్ నే అర్సే మేం మేరా లిపటా హువా బిస్తర్ ఖులా గుమ్మం వద్ద ఉండవచ్చని చెప్పి మాట తప్పింది మడతపెట్టిన నా పడకదుప్పటి పరిచే లోపే మాట మారింది ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. దర్ అంటే గుమ్మం. ఫిర్ గయా అంటే మాట తప్పడం. అర్సా అంటే వ్యవధి. బిస్తర్ అంటే పడక ఈ కవితలో గాలిబ్ ఒక చంచల మనస్తత్వాన్ని వర్ణించాడు. కేవలం రెండు పంక్తుల్లో ఒక దృశ్యాన్ని వర్ణించాడు. ఆయన ఇల్లు వాకిలి లేని స్థితిలో ప్రేయసి వద్దకు వచ్చాడు. ఆమె సరే గుమ్మం దగ్గర ఉండొచ్చని చెప్పింది. ఆయన తన చంకలో ఉన్న మడతపెట్టిన దుప్పటి కింద పరచుకునే లోపే మాట తప్పింది. ఈ దృశ్యం ఊహిస్తే ఒకవైపు నవ్వు వస్తుంది. ప్రేమికుల మధ్య జరిగే ఇలాంటి టీజింగ్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. చాలా సరళమైన పదాలతో చెప్పిన కవిత ఇది. కాని ఈ కవితలో ఎక్కడా గాలిబ్ తన ప్రేయసి ఇలా చేసిందని చెప్పలేదు. ఇలా ఎవరైనా చేయవచ్చన్న భావం కూడా ఉంది. ప్రపంచంలో మాట తప్పడం అనేది చాలా మంది చేస్తారు. మనం ఊహించలేనంత తక్కువ వ్యవధిలో ఇచ్చిన మాటను మర్చిపోతారన్న భావం కూడా ఇందులో ఉంది. ఇలాంటి సందర్భాలు చాలా మందికి ఎదురవుతాయి. ప్రతి సందర్భంలోను కోట్ చేయడానికి అవకాశం ఉన్న కవిత ఇది. దీని తర్వాత ఈ గజల్లో ఉన్న మిగిలిన కవితలు కూడా ఇదేవిధంగా కష్ట సమయాల్లోను, అలాంటి ఇతర సందర్భాల్లోను వెంటనే స్ఫురణకు వచ్చే కవితలే. గాలిబ్ సంకలనంలోని 14వ గజల్లో చివరి మూడు కవితలు ఇప్పుడు చూద్దాం క్యోం అంధేరీ హై షబె గమ్, హై బలావోంకా నుజూల్ ఆజ్ ఉధర్ కో హీ రహే గా దీదా ఏ అక్తర్ ఖులా విషాదాల రాత్రి ఎంత చీకటి. విపత్తులు వర్షిస్తున్నాయి నక్షత్రాల చూపులన్నీ ఈ రోజు పైకే చూస్తున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు : షబ్ అంటే రాత్రి. గమ్ అంటే విషాదం లేదా దుఃఖం. బలా అంటే విపత్తు లేదా ఆపద. నుజూల్ అంటే అవతరించడం. దీదా అంటే కన్ను, అక్తర్ అంటే నక్షత్రం. గాలిబ్ తనపై వచ్చిన ఆపదలను వర్ణించిన తీరు గమనించండి. విషాదాల రాత్రి చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రాలు కనబడడం లేదు. పై నుంచి దేవుడు గాలిబ్ పై కురిపిస్తున్న ఆపదలను చూడడానికి నక్షత్రాలన్నీ తమ కళ్ళను పైకెత్తి చూస్తుండడం వల్ల నేలపై నక్షత్రాల చూపులు కూడా పడడం లేదని అందువల్లనే ఈ రాత్రి చాలా చీకటిగా మారిందని అంటున్నాడు. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషి ఇలాగే ఆలోచిస్తాడు. దేవుడు తనపైనే మొత్తం ఆపదలన్నీ పడేస్తున్నాడనే అనుకుంటాడు. క్యా రహూం గుర్బత్ మేం ఖుష్, జబ్ హవాదిస్కా యే హాల్ నామా లాతా హై వతన్ సే నామాబర్, అక్సర్ ఖులా పేదరికంలో సంతోషం ఎలా, ఆపదలు వస్తుంటే ఇలా వార్తాహరుడు తెచ్చే ప్రతి లేఖ తెరుచుకునే ఉంది కదా ఉర్దూ పదాలకు అర్ధాలు : గుర్బత్ అంటే పేదరికం. హవాదిస్ అంటే దైవికమైన ఆపదలు. నామా అంటే లేఖ. హాల్ అంటే పరిస్థితి. వతన్ అంటే స్వస్ధలం. నామాబర్ అంటే వార్తాహరుడు. అక్సర్ అంటే తరచుగా అని అర్ధం. నామా ఖులా అన్న పదాన్ని కాస్త వివరించవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు ఎవరిదైనా మరణవార్త లేఖ ద్వరా తెలియజేస్తున్నప్పుడు ఆ ఉత్తరాన్ని తెరిచి పంపేవారు. అంటే ఉత్తరం కవరులో పెట్టడం జరిగేది కాదు. తెరిచి ఉన్న ఉత్తరం వస్తే విషాదవార్త ఉందని అర్ధం. నామా ఖులా అంటే తెరిచి ఉన్న లేఖ అని అర్ధం. ఈ కవితలోకూడా గాలిబ్ తనపై వచ్చిన కష్టాలనే చెప్పుకున్నాడు. పేదరికంలో అయినా గాని సంతోషంగా సంతృప్తిగా ఉండడం ఎలా సాధ్యం అంటూ, తనకు వచ్చిన ప్రతి లేఖ తెరిచే ఉంటుందని, అంటే విషాదాలనే మోసుకు వస్తుందని వాపోతున్నాడు. ఉస్కీ ఉమ్మత్ హూం మైం, మేరే రహే క్యోం కామ్ బంద్ వాస్తే జిస్ షై కే గాలిబ్, గుంబద్ యే బే దర్ ఖులా ఆయన అనుచరుడినే కదా అయినా నా కెందుకీ కష్టాలు ఆయన కోసం తలుపుల్లేని ఆకాశం తెరుచుకోలేదా? ఉర్దూ పదాలకు అర్ధాలు : ఉమ్మత్ అంటే సముదాయం, సమాజం అని అర్ధం. ముస్లిమ్ ఉమ్మత్ అంటే ముస్లిమ్ సమాజం అని అర్ధం. కామ్ బంద్ అంటే పనేది జరక్కపోవడం లేదా కష్టాలు ఎదురవ్వడం. షై అంటే వస్తువు అని అర్ధం. ఇక్కడ వ్యక్తిని సూచిస్తూ ఉపయోగించాడు. గుంబద్ అంటే మస్జిదులకు నిర్మించే గుమ్మటం. గుంబద్ యే బే దర్ అంటే తలుపుల్లేని గుమ్మటం అంటే ఆకాశాన్ని సూచిస్తూ వాడాడు. గుంబద్ యే బే దర్ ఖులా అన్న ప్రయోగాన్ని కాస్త వివరించాలి. ప్రవక్త ముహమ్మద్ ను దైవదూత జిబ్రయీల్ ఒక గుర్రం లాంటి వాహనంపై (బుర్రాక్ అన్నది దాని పేరు) మొదట మక్కా నుంచి జెరుసలేమ్ కు ఆ తర్వాత అక్కడి నుంచి ఆకాశాలపైకి తీసుకువెళ్ళారు. ఈ సంఘటనను మేరాజ్ అంటారు. మేరాజ్ యాత్ర జరిగిన ఆ రాత్రిని షబె మేరాజ్ అంటారు. చాలా మంది ముస్లిములు షబె మేరాజ్ రాత్రి ప్రత్యేక నమాజులు చదవడం జరుగుతుంది. తలుపుల్లేని ఆకాశాన్ని ప్రవక్త ముహమ్మద్ కోసం దేవుడు తెరిచేశాడన్న భావంతో గుంబద్ యే బే దర్ ఖులా అన్న పదాలను గాలిబ్ ఉపయోగించాడు. ఈ కవితలో భావాన్ని గమనిస్తే, గాలిబ్ తాను ప్రవక్త ముహమ్మద్ అనుచర సమాజానికి చెందినవాడినే కదా అని అడుగుతున్నాడు. ప్రవక్త ముహమ్మద్ కోసం ఆకాశం తలుపులు తెరిచేశాడు దేవుడు. అలాంటి ప్రవక్త సమాజానికి చెందిన తనపై ఈ కష్టాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇది గజల్లో చివరి కవిత. ఈ మొత్తం గజల్లో ఆధ్యాత్మికతను అంతర్లీనంగా ప్రస్తావించాడు. మధ్యలో ఒక కవితలో మోసకారుల ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు కవితల్లో తనపై వచ్చిన కష్టాల గురించి చెప్పాడు. చివరి కవితలో ఫిర్యాదు ఉంది. మోసపోవడం అనేది ఆయనకు తప్పలేదు. మోసం చేసింది తోటివారే. నమ్మినవారే. అలాంటి మోసాలకు గురై, కష్టాలపాలయిన మనిషి చివరకు దేవునితో ఫిర్యాదు చేసుకోవడం తప్ప మరేమీ చేయలేని స్థితి. ప్రవక్త కోసం తలుపుల్లేని ఆకాశాన్ని తెరిచేశావు. ఆయన సమాజానికి చెందిన నా కోసం సంతోష ద్వారాలు ఎందుకు మూసేశావంటూ నిలదీస్తున్నాడు. ఈ చివరి కవితలో ఒకవిధమైన తిరుగుబాటు ఉంది. ఎవరికైనా కష్టాలు, ఆపదలు తప్పవన్న భావం ఉంది. ఏ మతానికి చెందినవారైనా మనిషికి పరీక్షలు తప్పవు. ప్రపంచంలో కష్టనష్టాలు తప్పవు. కేవలం ఒక మతానికి చెందినవాడైనంత మాత్రాన ప్రపంచంలో సంతోషాలన్నీ సొంతమైపోతాయనుకుంటే అది పెద్ద భ్రమ.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n8U6qA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి