సిహెచ్.మధు||అధ్యయనంతోనే సాహితీ సేద్యం|| రచయితకు అధ్యయనం చాలా గొప్పది. అధ్యయనం లేకుండా మంచి రచయిత కాలేడనేది వాస్తవం. వర్తమాన రచయితలు, కవులు ఇప్పుడొస్తున్న రచనలన్నీ చదువుతున్నారా? చదవకపోవడం వల్లే మంచి సాహిత్యం రావడం లేదా? ఎందుకంటే రచయితకు అధ్యయనం చాలా అవసరం. అభిప్రాయాలతో మనం విభేదించవచ్చు. పుస్తకంలోని సిద్ధాంతం మనకు నచ్చకపోవచ్చు. రచయిత పేరు మనకు ఎలర్జీ గావచ్చు. పుస్తకం మీద ఎవరో చెప్పిన మాటలతో ఓ అభిప్రాయం ఏర్పాటుచేసుకోవచ్చు. అయినా ఆ పుస్తకం చదవాలి. తప్పక చదవాలి. అలా చదివినపుడే ఏది ఎందుకు నచ్చలేదో మనకు తెలుస్తుంది. ఏది ఎందుకు వ్రాయకూడదో మనకు తెలుస్తుంది. పది సంవత్సరాల క్రితం పేరుగాంచిన రచయితల గూర్చి, కవులగూర్చి ఒక మాట తరచుగా వినిపించేది. ఇంగ్లీషులో చదివి తెలుగులో రాస్తారని.. అందుకే ఇప్పుడు మన ముందున్న పేరున్న రచయితల ఇంటర్వ్యూలలో మీకు ఎవరి రచనలంటే ఇష్టం? అనే ప్రశ్నకు ఇంగ్లీషు రచయితలు కవుల పేర్లు, పుస్తకాల పేర్లు చెపుతుంటారు. ఇంగ్లీషు సాహిత్యం తప్పని అనలేం. అది ప్రపంచ సాహిత్యం. అయితే ఇంగ్లీషు సాహిత్యం చదవటమే ముఖ్యం కాదు. తెలుగు సాహిత్యంలో ఎన్నో మంచి రచనలున్నాయి. తెలుగు సాహిత్యమంటే వీరికి ఎలర్జీ. ఇది మంచి అధ్యయనం గాదు. కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ గొప్ప కథ, తెలుగు కథకు వనె్నతెచ్చిన కథ. దీన్ని వర్తమాన రచయితలలో ఎందరు చదివారు? ఈ కథే చదవనపుడు- మిగతావి చదివినా అది ‘అధ్యయనం’ క్రిందికి రాకపోవచ్చు. ‘మంచికథ’ చదవాలి. మంచి కవిత్వం చదవాలి. మంచి నవలలు చదవాలి- వీటన్నిటికంటే విమర్శనాత్మక సాహిత్యాన్ని ఒంటబట్టించుకోవాలి. విమర్శ అంటే మెచ్చుకోలు గ్రంథాలు కావు. సాహిత్య లోతుపాతులు సామాజిక దృష్టికోణంతో వచ్చిన ‘విమర్శ’ పుస్తకాలు చదవాలి. ఈ గ్రంథాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. రావూరి భరద్వాజ నవల ‘పాకుడురాళ్లు’కు జ్ఞానపీఠ అవార్డు యిచ్చారు. అంతకుముందు ఆ నవల గురించి పెద్దగా తెల్సింది లేదు. జ్ఞానపీఠ అవార్డు లభించిన తర్వాత ‘పాకుడురాళ్లు’ను- భరద్వాజను అందరూ ఆకాశానికి ఎత్తుతున్నారు గానీ- ‘పాకుడురాళ్లు’పై విమర్శనాత్మక వ్యాసం ఇప్పటివరకు రాలేదు. సరియైన అధ్యయనం జరిపినపుడు ఈ విషయం కూడా రచయిత దృష్టిలోకి వస్తుంది. అధ్యయనం అంటే రామాయణ భారత భాగవతాలను కూడా చదవాలి. వేదాలు చదివితే ఇంకా మంచిదే! ఖురాన్, బైబిల్ చదివారా? రచయితకు అన్నీ తెలిసివుండాలి. గతం వర్తమానం బాగా గుర్తింపు వుంటే భవిష్యత్తు చెప్పగలడు. భవిష్యత్ పరిణామాలు చెప్పగలవాడే మంచి రచయిత. భగవద్గీత చదివారా? ఇది సాహిత్యం కాదని అనుకోవద్దు. భగవద్గీతలో సాహిత్యముంది. ప్రతి అక్షరంలో సాహిత్యముంటుంది. అక్షరమే సాహిత్యం. ప్రతి రచయిత ‘మార్క్సిజం’ చదవాల్సిన అవసరముంది. మార్క్సిజం మూల సూత్రాలు తెలుసుకోకుండా ‘రచయిత’ మంచి రచనలు చేయలేడు. ‘గతి తార్కిక భౌతికవాదం’ ‘పెట్టుబడి- దాని పుట్టుపూర్వోత్తరాలు’ ఇవి తెలుసుకోకుండా ప్రజల గూర్చి- వ్యవస్థగూర్చి ఏమి వ్రాయగలం? ‘మార్క్సిస్టు’ అయినా- విశ్వనాథ వేయిపడగలు చదవాల్సిందే, కృష్ణశాస్ర్తీ వెంకిపాటలు చదవాల్సిందే. మన రాజ్యాంగం మూల సూత్రాలు చదవకుండా మంచి రచయిత కాలేడు. అధ్యయనం అంటే ఇదే! సాహిత్యానికి రాజ్యాంగానికి సంబంధమేమిటని రచయిత భావిస్తే- ప్రపంచ జ్ఞానం రచయితకు కరువవుతుంది. రాజ్యాంగం తెలియకుండా మంచి సాహిత్యాన్ని ఎలా సృష్టించగలం? ప్రజల కన్నీళ్లకు, బాధలకు కారణాలు తెలుసుకోవాలంటే రాజ్యాంగం చదవాల్సిందే. ‘రాజ్యాంగం’ అంతిమ లక్ష్యం సమానత్వం. అంతరాలు లేని సమాజం. ఇపుడు అంతరాలు పెరుగుతున్నాయి. ఇవి తెలియటానికి రచయిత రాజ్యాంగం చదవాల్సిందే. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడో ఓ దగ్గర ఎన్‌కౌంటర్ జరిగింది. కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎందుకు? ఇవి అన్నీ రచయితకు అవసరమే, కారణాలు తెలియాల్సిందే. రైతు ఆత్మహత్యను కథగా, దుఃఖంతో కవితగా వ్రాసినా, రాజ్యాంగం తెలియకుండా రాస్తే పరిపూర్ణత వుండదు. తెలిసి రాస్తే ఆ రచనలో చాలా లోతులు కనిపిస్తాయి. ‘అధ్యయనం’ అనేది చాలా గొప్పది. పుస్తకాలు చదవటం అలవాటు కావాలి. విసుగు అనిపించకూడదు. టైంపాస్ కొరకు చదువుతున్నామనుకోకూడదు. మొదట చదవకుండా వుండలేం అనే పరిస్థితి రావాలి. ప్రతిదినం ఏదైనా పుస్తకం చదవకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ కావాలి. దిన చర్యలో ఏదో లోపం జరిగినట్టుగా భావించగలగాలి. కొందరు పెద్ద రచయితలు కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు చదివామని చెప్పుకుంటారు. అవి అందరినీ చదివించే నవలలు. అధ్యయనంపైన ఆసక్తి కల్గించే నవలలు. నవల ప్రారంభించిన తర్వాత ఆఖరు వరకు విడిచిపెట్టలేం. ఇటువంటి పుస్తకాలు డిటెక్టివ్‌లోనే కాదు, శరత్‌బాబు నవలలు చదివి చూడండి. గొప్ప నవలలు అధ్యయనం పెంచే నవలలు బెంగాలీ రచయిత కావచ్చు. తెలుగు అనువాదం సులభంగా చదివిస్తుంది. అనువాద నవలలుగా వుండవు, శరత్‌బాబులోనే ఆ ప్రతిభ వుంది. దేవదాసు అందరికీ తెలుసు. భారతి, శేషప్రశ్న, చరిత్రహీనులు- ఈ నవలలు చదివిన తర్వాత తెలుగులో ఇంత మంచి నవలలు వచ్చాయా అనిపిస్తుంది. అధ్యయనం లేకుండా మనం మంచి రచనను సృష్టించలేం. మంచి కవిత్వాన్ని అల్లలేం. అజంతా చెట్లు కూలుతున్న దృశ్యం. తిలక్ అమృతం కురిసిన రాత్రి, శివసాగర్ కవిత్వం మొత్తం చదవాల్సిందే. మొదట చదవటం అలవాటు కావాలి. అధ్యయనం అలవాటు అయితే పుస్తకం విడిచిపెట్టలేరు. అధ్యయనం ప్రతి రచయితకు వ్యసనంగా మారాలి. మంచి కవి, మంచి రచయిత కావాలంటే మంచి పాఠకుడు కావాలి. మంచి పాఠకులవౌదాం.-, 9949486122 10/03/2014http://www.andhrabhoomi.net/content/a-26
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUZgdR
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUZgdR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి