వేంపల్లి రెడ్డినాగరాజు !!మట్టి వాసన !!05-10-2013//07-02-2014 ***************** మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసినప్పుడు నా మనస్సు పురివిప్పిన మయూరంలా నాట్యం చేస్తుంది జలతారు తెరలు వ్రేలాడినట్లు నింగినుండీ నేలకు ధారగా కురిసే వాన చినుకులు కనిపించినప్పుడు నేను మళ్ళీ మా"పల్లె" లో గడిపిన బాల్యపు అనుభూతుల్లోకి జారుకుంటాను కల్లాకపటం తెలియని ఆరేడేళ్ళ పసితనంలో అయ్యవార్ల బెత్తం దెబ్బలు గుర్తుకొస్తున్నా లెక్క చేయక చింపిన నోటుపుస్తకం కాగితాలతో చేసిన పడవల్ని వీధుల్లో ప్రవహించే పిల్లకాలువలపై వదిలిన మధుర స్మృతులు ఇప్పటికీ నా మనోఫలకంపై చెరిగిపోని చిత్రాల్లా గోచరమవుతూనేవుంటాయ్ వానాకాలంలో చిరుజల్లులకే వురిసే మా వూరి సర్కారు బడికి లాంగ్ బెల్ సిగ్నల్ ఎప్పుడవుతుందోనని ఒళ్ళంతా కళ్ళింతలు చేసుకుని ఆత్రంగా ఎదురుచూసే నాకు గడియారంలోని సెకన్ల ముల్లు కూడా గంటలముల్లు లాగే బద్దకంగా ఒళ్ళు విరుచుకొని భారంగా కదిలినట్లనిపించేది బడి వదలగానే పొద్దుపొయిందాకా వర్షంలో తడుస్తూ జట్టుతోపాటూ పరుగులెత్తి పిల్లకాలువలకు గట్లుకట్టి తడిసి ముద్దయిపోయి చలికి వణుకుతూ ఇంటికి చేరుకునే నన్ను తిట్ల హారతితో ఆహ్వానించి,అభిమానంతో కోపగించుకుని ఆపై ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మ ఒడి నాలుగు చినుకులు రాలినా నాకిప్పటికీ జ్ఞాపకానికొస్తుంది రోహిణీ కార్తె ఎండలకు నోళ్ళు తెరుచుకున్న బీళ్ళన్నీ రాలిన చినుకులతో తనువంతా తమకంతో తడుపుకుని పచ్చిక బయళ్ళుగా రూపాంతరం చెంది నన్ను ఆడుకునేందుకు రమ్మని పిలిచే ఆట స్థలాలయ్యేవి పిల్ల తెమ్మెరలకు మెల్లగా తలలూపే అరవిరిసిన అందమైన గడ్డిపూలు హరివిల్లులోని రంగులన్నీ తమ రెక్కలకు అద్దుకున్నట్లు కనిపిస్తూ హద్దు లేకుందా ఎగిరే సీతాకోక చిలుకలు పొద్దుతెలియనీయక ఆటలో అలసిపోనివ్వని నా నేస్తాలయ్యేవి తొలకరి చినుకులకు తడవగానే పులకరించే పుడమితల్లి వెదజల్లే మధురమైన"మట్టివాసనాకలిగించే మత్తు కోసం నా శరీరం గమ్మత్తుగా పలవరించేది యాంత్రికత రంగు పులుముకొని మమ్మీ-డాడీల సంస్కృతిలో పెరుగుతున్న నా పిల్లలకు నా బాల్యంలోని వర్షానుభూతుల్ని పొరలు పొరలుగా విప్పి ఎన్నిరకాలుగా వర్ణించి చెప్పినా తక్కువే ఎందుకంటే............ పాశ్చత్య నాగరికత భ్రమలో పల్లె పదానికి అర్థం మర్చిపోయిన పట్నవాసులుగా అనుభూతులకూ,అనుభవాలకూ దూరంగా బ్రతుకీడుస్టున్న వాళ్ళకు అరక్షణం తీరిక దొరికినా మక్కువగా కనిపించే కంప్యూటర్ గేంస్ అన్నింటికన్నా ఎక్కువే కాబట్టి* --వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167*
by Vempalli Reddinagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2LgtJ
Posted by Katta
by Vempalli Reddinagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2LgtJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి