పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఆగస్టు 2012, బుధవారం

స్వాతీ శ్రీపాద ||నువ్వు||


మగత మబ్బులా మత్తు
నరనరాన్నీఆవహిస్తున్న ఆక్షణం
ఎక్కడినుండో ఓ అస్పష్ట గానం జోల పాటై
నులి వెచ్చని మిధ్యా భావనలోకి లాగి
నిరాయుధంగా నీ భువన వలయంలో బంధీనై ....
సంపెంగల జడివాన చిత్తడీ
పారిజాతపు జల్లు పులకరింతా
అలదుకొన్న చిరుగాలి తునకై
నా అక్షరాల అలల్లో గిరికీలు కొడుతూ
కరిగి కరిగి జలపాతపు హోరై
నీ ఉనికి ...
నీ మాధుర్యపు మైత్రి వశీకరణలో
కఠిన శిలా హృదయం కరిగి
మెత్తని వెన్నెల ముద్దై
మనసు స్పటికపు పుటలగుండా
పరుగులు పెడుతున్న నిరామయ ప్రపంచమై
గుంపులు గుంపులుగా విహరిస్తున్న వాస్తవం
సందోహం మధ్య
అవిరమంగా ఆ మూలో ఈ మూలో వర్షించే నీ తలపు
సాలెగూళ్ళై మూలమూలలా అల్లుకున్న కలలు
జీవితం కాన్వాస్ మీదకు
ప్రవహిస్తూ.............
అజరామరమై నువ్వు
21.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి