నడుస్తున్నది కాళ్ళైనా
కళ్ళకెంత శ్రద్దో
పోగొట్టుకున్నదేదో వెదకుతున్నట్టు
నిశితంగా చూపు సారిస్తుంది
అప్పుడప్పుడూ
ఒక్కింత ఆశ్చర్యాన్ని
ఒక్కింత ఆనందాన్ని
మరికొంత దుఃఖాన్ని
రెప్పల్తో ప్రకటిస్తుంది
లోలోపల
ముత్యమంత అక్షరమేదో పొటమరిస్తుంది
ఒకదానివెంటొకటి
హారమై అల్లుకుంటుంది
ఆలోచన
నగిషీల నద్దుతుంది
కనులు ప్రేమించే పదాలలోకి
కాళ్ళు దారులు వెదకుతుంటాయి
నేనిక్కడలేనప్పుడు
నీవు ఆలింగనం చేసుకున్న అక్షరాలు
కళ్ళకెలా తెలుస్తుందో
కొత్త సత్తువను దిగుమతి చేసుకుంటుంది
నేనుగా ఎక్కడైనా కన్పిస్తే
కళ్లతోనే కాళ్ళకు నమస్కరిస్తాను
ఎందుకంటే
నడుస్తున్నది కాళ్ళైనా
కళ్ళకెంత శ్రద్దో!!
*21.8.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి