ఒక ఊహ గర్భస్థశిషువులా అండంలో ఉండగానే
ఉపిరాడని ఉల్కలా రాలి పోతుంది
ఒక మౌనం మాటగా పునర్జన్మించకుండానే
గుండె గోంతుక పూడుకొని సజీవ సమాధవుతుంది
ఒక మృదు స్పర్ష మునివేళ్ళ కోసలపై విచ్చుకోకుండానే
ముడుచుకొని ఎందుకనో ఎప్పుడూ వాడి పోతుంది
ఒక హృద్యమం ఉద్వేగసంభరిత ఉప్పెనయ్యే లోపె
అలల తలలు పగిలి కుప్ప కూలి పొతుంది
***
ఒక పరిచయం తనువంతా పరుచుకోకుండానే
కరచాలనాల పురిట్లోనె కన్ను మూస్తుంది
ఒక ప్రణయం పరిణయంగా తర్జుమా కాలేక
కాలగమనంలో తొనికి ఒలికిపోతుంది
ఒక అనుబంధం అవకాశవాదాల అసమ్మతిలో
అవిశ్వాస తీర్మానమై వీగిపోతుంది
***
ఒక అనుభవం అనుభూతిగా మారకుండానే
కనురెప్పల అంచుల నించి దూకి ఆత్మహత్యించుకుంటుంది
ఒక విశాద తంత్రి వినువీధిలో గానమవ్వకుండానే
తీగలు తెగిన తంబురా అవుతుంది
ఒక దుఖ నౌక ప్రతిసారీ తీరాన్ని చేరకుండానే
దేహపు తెరచాప తెగి తల్లకిందులుగా మునిగి పోతుంది
***
నా అక్షరాలు
విహంగాలై ఎడతెగని ప్రయాణంలో
స్వేచ్చని శ్వాసించె లోపె
ఎద తెగిన పావురాలై నెత్తురోడుతాయి
నేలకోరుగుతాయి
*21.8.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి