పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జులై 2012, మంగళవారం

స్వాతి శ్రీపాద || కుదిరేదెలాగ ? ||

నిశ్శబ్దం అంచులమీద ఆచితూచి ఆకాశానికి చేతులు చాస్తూ
నర్తించే నీటి బుడగల నురగలపై
కాస్సేపలా ఆగి
రేపటి ఉషోదయాల గురించీ
ఊహకందని జీవితానికావలి వైపు గురించీ
నీ నును వెచ్చని వేలి కొసల్లో
అణగారి పోయిన
పచ్చిక బీళ్ళగురించీ
నీతో సుదీర్ఘ సంభాషణలు సాగించాలన్న
స్వప్న సీమల్లోని తహతహ
కానీ,
నీకూ నాకూ కుదిరితేగా..
ఏ అర్ధరాత్రో గుండెతట్టి వెళ్ళిపోయే
పరిమళపు వెన్నెల కర్పూరం నువ్వు
ఉదయపుటంబరంపై కళ్ళు తెరిచే ఉదయ తారను నేను
నడి వేసవి తాపంలో దారిలోనే ఆవిరయే
తొలకరి చినుకువు నువ్వు
ఆకలి తీరక పగుళ్ళు వారిన పృధ్విని నేను
క్షణంలో రంగులు విసిరి పరవశం నుండి
తేరుకునే లోగానే
అదృశ్యమయే రంగుల హరివిల్లు నువ్వు
నింగీ నేలను కొలిచే వర్షఋతువును నేను మరి నీకూ నాకూ కుదిరేదెలాగ?


*16-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి