పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జులై 2012, మంగళవారం

శ్రీనివాస్ వాసుదేవ్ || ఈ పొగమంటకి సమాధికడ్దాం......!||

1.
చీకటిభాష--తప్పటడుగు పదాల్లో
వయసుతోపాటు నరాల్లోకెక్కిన మత్తు....
2.
సాయంత్రపు కౌగిలినుంచి
బయటపడ్డ విశృంఖల చీకటి
గొట్టాల్లో గరళం
ఔన్సుల్లో విషం
రంగురంగుల రుచులన్నీ కలబోసి
పెదాల్నీ ముద్దాడి, గుండెనీ తడిమీ
వెళ్ళినదారినే వెనక్కొచ్చే ధూమం
నంగనాచిలా ముఖంలేని మొహంతో......
డామ్నేషన్!
శరీరానికో, దేహానికో పేర్చుకున్నరంగుల చితిమంటలు....
3.
నాగుండెకీ, నాకూ అడ్డి పెట్టే పేచీపొగ
వయసు భీభత్స సంగీతానికి కరాళనృత్యమం
మనసు మంటా, పొగాకు వేడీ
మధ్యలో నలిగిపోతున్న దేహం!
గుండెని తాకట్టుపెట్టాననే కోపంతో
నా ఊపిరి నాదికాకుండా పోయింది!
4.
మంటనంతటినీ ఉండచుట్టి గొంతులో పూడ్చిపెట్టి
కర్మకాండకు సిధ్ధమయ్యే స్థితినే నమ్ముకున్నా
వేనోళ్ళ సంకీర్తనతో....వయసంతా
5.
ఈ చీకటిగదుల్లో రోజూ బోనాలు
కాలాతీతమనుకునే తీర్ధప్రసాదాలు......
రంగమెక్కే రంగవల్లులూ.......
పైట దాచలేని పరువాలు
పరికిణీ కింద అందాలు
నగ్నత్వాన్నినిర్వచించే తాపత్రయంలో....
రేపటిగురించేం చెప్పలేక సతమతమవుతూ
పొగతో పోటీపడి శూన్యంలోకి జారిపోతూ
బట్టల్లేని శూన్యంలోకి....

6.
ఆనందపు అంచులు కొలిచే కొలవెర్రి
చివరికొచ్చేసింది.....
ఇక నేనో నువ్వో ఒకరే మిగలాలి!
ఓ లివర్ సిరోసిస్, ఓ లంగ్ క్యాన్సర్
ఈ పోరాటంలో ఇక మిగిలిందొకటే
సుమోటో!
నీజీవితాన్ని నువ్వే గెల్చుకో
’నీ తరఫున వాదించే ఊపిరితిత్తులు మిగిలాయి’
వర్తమానాన్ని గుండెల్నిండా నింపుకున్నా
భవిష్యత్తు అగమ్యగోచరం
ఓ పొగలా......ఓ హుక్కా పొగలా!
(’క్షమించాలి, జీవితాన్ని అరువివ్వలేను’)


(గత కొన్నిరోజులుగా ఓ టీవీ చానల్లో హుక్కా సెంటర్లపై వొస్తున్న ఓ కథనంపై స్పందనగా రాసుకున్నది ఈ రచన)
*17-07-2012

2 కామెంట్‌లు:

  1. కాలవెర్రికి కొలమానం ఎక్కడ
    మార్మికతని అడ్డదారుల్లో వెతుకుతూ
    ధూమం లోనూ.. గరళం లోనూ
    వెతుక్కునే వికట సంస్కృతిని
    లేని వారసత్వాన్ని కొని తెచ్చుకునే వారసులు వీళ్ళూ

    తమకు తామే జోల పాడుకుంటుంటే
    జాలి పడదామా

    **గుండెని తాకట్టుపెట్టాననే కోపంతో
    నా ఊపిరి నాదికాకుండా పోయింది!**

    **పెదాల్నీ ముద్దాడి, గుండెనీ తడిమీ
    వెళ్ళినదారినే వెనక్కొచ్చే ధూమం
    నంగనాచిలా ముఖంలేని మొహంతో......** great imagery Devji

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు జయాజీ...మీ స్పందన అక్షరలక్షల విలువైనది.

      తొలగించండి