ఇప్పుడే
విచ్చుకుంటున్న
నల్ల మల్లెలు
****
అస్తమిస్తున్న సూర్యుడు
ఆడుకోడానికొచ్చే
రేరాజుకు
సమయాన్ని
చేబదులిస్తున్నట్టు
కొండల్లోంచి
బురదమడుగుల్లోంచి
దారితప్పిన
రాణి వాసాల్లోంచి
రోడ్డు ప్రక్కన ఎవరో
నాటిన
అనామకంగా సంకరించిన
తీగల నుంచి
మొగ్గళ్ళా ఉన్నప్పుడే
ఎవరో తెంపి
నలిగిపోడానికే
కామపు దారంతో
అల్లినట్టు
వెలుగులో దాక్కుని
చీకటిలో
కనిపించే కళ్ళకు
అనేకానేక చంద్రుళ్ళకు
ఒక్క పూటైనా
హృదయంలో
వసంతం పూయించడానికి
వాడిపోతూ
సుఖానికి కాటుక గుర్తవడానికి
ఇచ్చి పుచ్చుకునే
తాంబులమవుతూ
ఒక్కోరెమ్మగా దేహంతో
దూరమవుతున్న ఆత్మను
అనంత విశ్వంలోని
అద్వితీయ శక్తికి రాలిపొతూనే
అసహాయంగా
మొరపెడుతూ
మళ్ళీ జన్మంటూ ఉంటే
తెల్ల మల్లెల్లుగా
పుట్టించాలని
ప్రార్దిస్తూ
చేతి మణికట్టుకూ
మంచంపై
మలిన ముచ్చట్లకు
ఆ చంద్రుళ్ళ
చేతులలో
వేడిపోతల మధ్య
వాడి పోతూ
రోజూ
కడుపు రెండు నిమిషాలు
నవ్వడం కోసం
చివరి శ్వాసకి
వైద్యం చేసుకుంటూ
చస్తూ
బ్రతుకుతున్నాయి
కూతలు వాతలు తప్ప
పాపమో పుణ్యమో
లెక్కలెరుగని
నల్ల మల్లెలు
................. ( 12 -sep -2012 )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి