పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

సురేష్ వంగూరీ || కులం ||


1
కులం
వాడి నోట్ పుస్తకాలపై
ఇంతింత అక్షరాలతో
ఇంటిపేరుగా ఇకిలిస్తోంది

2
కులం
వాడి బైక్ వెనక
స్టిక్కరై మెరుస్తోంది

3
కాలేజ్ టాయ్లెట్ గోడల మీద
తరగతి గదుల్లో బెంచీల మీద
వాడు కులాన్నే కెలుకుతున్నాడు

4
వాడు తన ఫోన్ బుక్ నిండా
కులాన్నే పలురకాల పేర్లతో
సేవ్ చేసుకున్నాడు

5
ఎవరిని స్నేహించాలో
ఏ లెక్చరర్ పాఠం వినాలో
ఏ హీరోని అభిమానించాలో
ఎవరికి వోటెయ్యాలో
అన్నీ కులాన్ని సంప్రదించే
నిర్ణయాలు తీసుకుంటాడు

6
వాడు
కులానికే తాళి కడతాడు
కులాన్నే కంటాడు
మళ్లీ కులాన్నే నామకరణం చేస్తాడు

7
కులాన్ని శ్వాసించటం అలవాటయ్యాక
కులం వాడి అస్తిత్వమయ్యాక
ఇప్పుడు
వాడికి తెలియకుండానే వాడు
చూపుల్లో పుసులు కడుతూ
మాటల్లో చొంగ పడుతూ
మనసంతా కుళ్ళిపొయి దుర్గంధిస్తూ
మనిషితనమంతా పుళ్ళుపడి రసులు కారుతూ
జీవితపు రోడ్లెంట
స్కిజొఫ్రినియా వచ్చిన గజ్జి కుక్కలా బతికేస్తూ
తన వాంతిని తనే గతికేస్తూ...

12.9.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి