పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జులై 2012, సోమవారం

రక్షిత సుమ || నేడో రేపో ||

ప్రతి చినుకూ ముత్యం కాక పోవచ్చు
ప్రతి అడుగూ గమ్యాన్ని అందుకోక పోవచ్చు,
కానీప్రతి మంచి పనికీ ఓ మంచి ఫలితం
ఎదురు చూస్తూనే వుంటుంది.
*16-07-2012

భమిడిపాటి ఫణి కుమార్ శర్మ కవిత

అడుగులు తడబడుతున్నాయి
గమ్యం లేని దారి
మసక బారిన కళ్ళకు
రెండుగా చీలి వెక్కిరిస్తూ

ఎండిన డొక్కకు
పట్టెడు మెతుకులు
అలసిన గుండెకు జాగా లేదంటూ
నీ వచ్చిన చోటికే పోమ్మంటూ.....

ఎచటికి పోతావ్ ఓ రైతన్న .............

పంచె కట్టిన చోట రాళ్ళెత్తలేవు.
ఎండిన భూమిని చూస్తూ బ్రతుకలేవ్
కుటుంబ భారాన్ని మోయలేవ్
నీ వాళ్ళను పస్తులున్చలేవ్....

నీ తల్లి భూమిలో నీరులేదు
సర్కారీ విత్తనాల్లో సత్తాలేదు
అప్పులోల్లు ఒంట్లో చుక్క రక్తం మిగల్చలేదు
ఓదార్పుల ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు.
*16-07-2012

రియాజ్ || విజయోద్వేగం ||

పిడికెడు గుండె పట్టలేని అనందం
అనియంత్రితం ఈ ఉద్విగ్న క్షణం!!

ఇన్నాళ్ళ శ్రమ ఇన్నేళ్ళ సహనం
గెలిచానన్న వాస్తవాన్ని కళ్ళార్పక చూస్తుండగా..

గతం అంతర్గతం నిర్ఘాంతం
కండల నరాలలో బిగువందుకున్న క్షణం
సుధీర్ఘ సాధనకు తలవంచిన మనోక్షేత్రం
అనియంత్రిత వేగంతో వచ్చిన
అస్థిత్వం కెరటమొకటి అంతులేని ఉత్సాహమున
కనులువిడిచి స్వేచ్చగా వెడలె కన్నీటి ధార
కనులుమూసినా శూన్య దర్శనం
స్వేదసువాసన గాఢంగా శ్వాసించిన క్షణం
మరిగిన రక్తపు ఆవిరులు చుట్టుముట్టగ
సుదీర్ఘ నిట్టూర్పు విడుదల

కష్టమే దాచడం ఆపుకోవడం !

ఎందుకంటే..
అది విజయోద్వేగం !!
అది విజయోత్సాహం.
*16-07-2012

పి.రామకృష్ణ || విషాదం అను నాటిక..||

ముసుగేసిన రంగుని
తుడిచేసుకున్నా..
మారని ముఖభావం.

** ** **

గ్లిజరిన్ అవసరం లేని
కళ్ళు-
తెర దించేవరకూ
శోకిస్తూనే చివరి దాకా.

** ** **

అనుభవం అక్కర్లేని
అభినయం.

అనుకరిస్తే చాలు
ప్రతి జీవితమూ-
ప్రాంప్టేషన్.

*16-07-2012

జ్యోతిర్మయి మళ్ళ || నాలోని నువ్వు ||








కనుచూపు మేరంతా నువ్వే కనిపిస్తున్నావు
నా కంటిపాప లో కొలువున్నావా?

గుండె భారంగా ఉంది
నువ్వు మరీ ఇంత బరువా?

నాలుక ఏం పలికినా నీపేరే వస్తోంది బయటికి
స్వరపేటికను స్వాధీన పరుచుకున్నావా?

ఏ వైపూ దారి లేదు మనసు గదికి
ఎలా చొరబడ్డావు దొంగవా?

నా ప్రతి కదలికనూ శాసిస్తున్నావు
కండరనరాలన్నిటినీ ఆక్రమించావా?

నీతలపు తప్ప మరేం చేయనని మొరాయిస్తోంది మెదడు
ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నావా?

ఇదేం చిత్రం, నా అద్దం నిన్ను చూపిస్తోంది
నేనే నువ్వయిపోయావా?
*16-07-2012

Rakshita Suma || New Extension of Twinkle twinkle little star ||

Twinkle twinkle little star,
How i wonder what you are?
Up about the world so high,
Like a Diamond in the sky.


Dimple shinning little Moon,
Have you got the own shine?
No no children not my own,
I have brought it from the sun!

when the sun is getting down,
we all come to your town!
Twinkle twinkle all the night,
Dimple shinning all so bright.
*16-07-2012

బివివి ప్రసాద్ || దిగులు గీతం ||



1



దిగులు గాలిపటం ఎక్కడో ఎగురుతూ ఉంది ఈ విరామసమయంలో


2


వాన కురుస్తుంటే లోలోపల దాగిన తాపమేదో తగ్గి చల్లబడాలి కదా


కానీ ఈ దిగులేమిటి


దారిలో తగులుకొన్న కుక్కపిల్లలా నాతోనే తిరుగుతోంది


3


ఎందుకని ఆకాశమా ఏడవకమ్మా అనాలనిపిస్తోంది


మననెవరూ ఓదార్చనపుడు, మనకెవరినైనా ఓదార్చాలనిపిస్తుందనుకొంటా


4


విరామమెంత బరువుగా వుంటుంది


ఈ ఖాళీ సమయాన్ని తెల్లకాగితంలా మడిచి దాచుకొని


వత్తిడుల మధ్య వాడుకోగలిగితే బాగుండును


5


ఏదో ఒకటి చేయాలి


నన్ను నేను తప్పించుకోవాలి


కురిసే, కురిసే వానని ఊహతో ఆపగలనేమో ప్రయత్నించాలి


6


సంగీతమో, స్మృతులో, కవిత్వమో


దేనికైనా ఈ దిగులు సరైన సమయం


కానీ, అన్నిటినీ విడిచి,


ఈ సారైనా దిగులు గర్భంలోకి సరాసరి దూకాలని ఉంది


ఏ సృష్ట్యాది కాలపు వెలుతురులు అక్కడ దాగివున్నాయో చూడాలి


ఏమీ లేకపోవటమైనా అక్కడ ఉండకపోతుందా


అంతూ, దరీ లేని స్వేచ్ఛ నన్ను ముంచేయకపోతుందా


నిజమైన వాన ఏదో నన్నొక చినుకుని చేసి ఎటైనా విసిరేయకపోతుందా


*15-07-2012

15, జులై 2012, ఆదివారం

జ్యోతిర్మయి మళ్ళ || ఒకరికి ఒకరు ||

నువ్వేనాలోకం
'నీకోసం నేను' అంటుందామె

ఇష్టపడడమే ఇష్టం ఆమెకు
ఒదిగుండడంలోనే హాయి ఆమెకు
పిచ్చిది...
లోకాన్ని గెలిచినంత తృప్తి అందులో

నువ్వూ నేనూ ఒకటే
'మనకోసం మనం' అంటాడతను

నిజాల్ని ప్రేమిస్తాడు
నిరాడంబరతను ఆస్వాదిస్తాడు
మేధావి..
ఏం తెలీదతనికి అతని దృష్టిలో !
*15-07-2012

కరణం లుగేంద్ర పిళ్ళై || నీది కోయిల పాట కాదు! ||

నీకే పూర్తిగా తెలియని నీ గురించి
తెలుసుకోమనడం మూర్ఖత్వమే..
కాకుంటే ఏమిటి లోకులు కాకులు అంటావు
కాకిలా అరుస్తూ కోయిల పాట అని విన మంటావు
వేలం పాటలో ఓట్లు కొన్న నీకు
మా పాట్లు ఎలా అర్థమవుతాయిలే
అధికార మొండి తనం కూడా
నీకు అవిటితనమేనని ఎలా చెప్పాలి
జబ్బలు చరుచుకొని బరిలో
ఎంత కలియ దిరిగినా
పోటీ ఉన్నప్పుడే కదా
ఆ గెలుపు మజా తెలిసేది.
అందరూ తలలూపే గొర్రలయినప్పుడు
తోక బెత్తేడు కాక మూరెడు ఉంటుందని
ఆశించడం వెర్రితనమే..
శవాలు కాల్చే కాటి కాపిరిగా
ఉంటే ఆనందమేముంటుంది
ప్రాణాల దీపాలు వెలిగించే
ఇంధనమై కాలిపోతే కదా
అందులో తృప్తి అనే ఆనందం జనించేది..
పచ్చని బతుకు రెమ్మల్ని త్రుంచి
ఎడారిలో పాతి పెట్టే పనులు చేయకు
రైతు కాడి రెక్కలు విరిచేసి
సెజ్ ల దయ్యాలకు ఆహారంగా వేయకు
భూములను భుజించే రాబందులను మేపి
కరెన్సీ నోట్లను పండించాలనుకుంటే.
*14-07-2012

జయశ్రీ నాయుడు || ఆశా.. అక్షరం! ||

అక్షరాలూ..
ఆశలూ..
కటిఫ్ కొట్టాయి..
బ్రతిమిలాడాలి..
బుజ్జగించాలి..
మళ్ళీ విత్తనాలు
పాదుకోవాలి.

*15-07-2012

ఆర్. ఆర్. కే. మూర్తి. || "దేశభక్తి" ||

‎తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
సిపాయి పగిలిన మోకాటి చిప్ప సాక్షిగా
రైతు స్రవిస్తున్న పాదం సాక్షిగా

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
గతించి పోయిన స్మ్రుతుల జోలికి వెళ్ళనని
శవాలపై అయుధాలెత్తనని
తాతలనాటి కసి మనవళ్ళపై చూపనని
నీకు పట్టిన దేశభక్తి నిను కాటికి నడిపించదని

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
అయ్యనూ అమ్మనూ సాకుతానని
తమ్ముడి బాగోగులు చూసుకుంటానని
పక్కింటి బాబాయి కి సాయపడతానని
ఇంటికొచ్చిన వాడికింత బువ్వ పెడతానని

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
లంచం తీసుకోకుండా పని చేస్తానని
ఎక్కడ పడ్తే అక్కడ ఉమ్మనని
అడిగిన వాడికి చేతనైందేదో చేస్తానని
దేశాన్ని దూషించిన వాడి చేతికో ముద్దు పెడతానని

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
పేదవాడి కన్నీటిని నేలరాలనీయనని
అన్యాయం అక్రమాలు సహించేది లేదని
నలుగురినీ పోగేసి పోరాడుతానని
లాఠీలకు చెరసాలకు భయపడేదిలేదని

*15-07-2012

వేంపల్లి గంగాధర్ || సిద్ధార్థుడు అడివికి వెళ్ళిపోయాడు ! ||

అతడు ఎక్కడో
వెతకనవసరం లేదు ...
 
నడి రాత్రి నట్ట నడడివి దిశగా
మహా ప్రస్తానం..
మనకెప్పుడు అవుతుంది జ్ఞానోదయం ...!

మహా నగరాల నిండా భస్మం
నిమజ్జనం కూడా అవసరం లేదు

దుఃఖ మయ దృశ్యాలు….

మొదటి దృశ్యం :

దేహ మంతా ముడుతలు పడ్డ
నడుము వంగి నడవ లేక నడుస్తున్న
మూడు కాళ్ళ ముసలి వాళ్ళు
గుంపులు గుంపులు గా
మనకు కనిపిస్తూనే ఉంటారు .....!

రెండవ దృశ్యం;

గడియారం ఆసుపత్రి
రోగులతో పొంగి పొర్లుతుంది...
కుష్టి వ్యాధి ఒక్కటే కాదు
దేహమంత కుళ్ళిన కమురు వాసన
రాత్రంతా వీధిలో ఎవరో దగ్గు తున్నా,
ఫ్యాన్ రెక్కలకు ఉరిపోసుకొని తనకలాడుతున్న,
రోడ్డు ఫై బాటసారి ని గుద్దుకొని వాహనాలు వెళ్తున్న ,
తత్త్వం మనకు బోధ పడదు !

మూడవ దృశ్యం:

నిన్న నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు
ఇవాల కన్నుమూసి కన్నీళ్ళు మిగిల్చిన సత్యం
పూలదండల మధ్య నీ దేహం
నీ తల వద్ద ప్రమిదలో దీపం
నీ చుట్టూ కన్నీటి ప్రవాహాలు
నీ శవ యాత్ర నీకే ఎదురుతుంది ....
తట్టుకొనే ద్యైరం నీ కుందా!
స్మశానానికి వెళ్తున్న వ్యక్తి శవం
నీ కు ఎన్నోసార్లు గుర్తుకొస్తూనే ఉంటుంది ....

మూడు దృశ్యాలు ముగిసిన తర్వాత ...
సిద్ధార్థుడు అడివికి వెళ్ళిపోయాడు !
ప్రతి నగరమూ కపిలవస్తు కానవసరం లేదు ...
శిద్దోధనుడి పుత్రప్రేమ ఒక కన్నీటి శోకం
సిద్ధార్థుడు నడిచిన దారి ఒక కాంతి శ్లోకం

ప్రపంచమంతా దుఃఖ మయం

త్యజించిన తర్వాత నుంచి
నిన్ను నీవు నిర్మితం చేసుకుంటావు !
*15-07-2012

www.vempalligangadhar.com

సతీష్ చందర్ || శిశువు నేడు లేచెను ||


రెండు దశాబ్దాల క్రితం చుండూరు(ప్రకాశం జిల్లా)లో ఇప్పుడు లక్ష్మీపేటలో జరిగినట్లే దళితుల మీద దాడి చేశారు. ఇప్పుడు చంపింది కాపుకులస్తులయితే, అప్పడు చంపింది రెడ్డి భూస్వాములు. అప్పడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోవుంది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన రెడ్డి. పంటపొలాల్లో దళితకూలీలను తరిమి తరిమి చంపి వారి శవాలను గోనె సంచుల్లో మూట కట్టి మురికి కాలువలో పడేశారు. ఈ ఘటనకు దేశం నలుమూలలా దళితుల తల్లడిల్లారు. దళిత సంఘాల వారు వారు శవాలను వెలికి తీసి, నిరసనగా ఊరి మధ్యలో పాతి పెట్టారు. పాత్రికేయుడిగా వార్త కోసం వెళ్ళి చూసి వచ్చాక నా మనసు మనసులో లేదు. అప్పడు రాసిందే ఈ కవిత. తెలుగు కవిత్వాభిమానులకు పరిచితమయినదే. అయిన లక్ష్మీపేట దాడి నేపథ్యంలో ఎందుకో మిత్రులతో పంచుకోవాలనిపించింది.


Photo By: Ken Banks


సమాధుల కడ్డంగా బండరాళ్ళెందుకు

పర్వతాల్నే పేర్చమనండి

ఉన్నట్టుండి జీసస్సులు

ఉషస్సుల్లా చివాల్న లేవకపోరు.



ఊరినే వెలివేసినట్లు

ఊరు మధ్య సమాధులా?



ఊరుకు నాలుగు మూలలు

జీవులకు నాలుగు కాళ్ళు

పొర్లడానికి నాలుగు వరసలు

కులం నాలుగు పాదాలా పాకేది.



ఎక్కడో అయిదో మూల దూరంగా

పశువుల పాకలో రెండు కాళ్ళ శిశువు జననం



తోకచుక్క పొడిచిందో లేదో కాని

ఊళ్ళో తోక తెగిన చప్పుడు.



శిశువు పాదస్పర్శకు మైలపడ్డ పశువుల ఆగ్రహం

మొరిగి, ఓండ్రపెట్టి, ఊళ వేసిన శోకాలపన



ఈ శిశువు-

బానిసల కంటిపాప

ఒక శతాబ్దపు స్వప్నశకలం

వందేమాతరపు తొలిచరణం

పశుధర్మశాస్త్రం ప్రకారం శిశుజననం మహాపాతకం



శిశువుకు-

రెండు కాళ్ళుండటం నేరం

మిగులు భూమ్మీద అడుగులు వేయకుండా

మేకులు కొట్టారు.



రెండు చేతులుండడం నేరం

పని చూపమని యాచించకుండా

చిల్లులు పెట్టారు.



శిరస్సులో మెదడుండడం నేరం

మళ్ళీమళ్ళీ రాజ్యాంగం రాయకుండా

ముళ్ళ కిరీటం గుచ్చారు.



ముఖవర్చస్సుండడం నేరం

ఏ తల్లీ ముద్దాడకుండా

కాండ్రించి వుమ్మారు.



అన్నిటికన్నా ఛాతీలోపల గుండెకాయ వుండడం నేరం

బానిస కొడుక్కి ప్రేమెందుకని

బరిసెలతో పొడిచారు

పంట పొలాల్లో శిశువుకు శిలువ మరణం

పట్టపగలు చీకటి కమ్మింది.

ఆకాశం అయిదు ముక్కలుగా చీలింది.

సూర్యుడు నాలుగు ముక్కలూ అతుక్కొని ముఖం కప్పుకున్నాడు.



శిలువ మీద శిశువు పలికిన చివరి మాట:

‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురు.

నేను తిరిగి లేచువరకునూ వీరిని సజీవముగా వుంచుము’.



ఊళ్ళో పశువుల పరారీ.

నాలుగు రోడ్ల కూడలిలో

గర్భం దాల్చిన నేలతల్లి.

వీరుల సమాధులన్నీ నిండు చూలాళ్ళే.



పిరికి వాళ్ళు పశుపాలకులు!

శిశువింకా లేవకుండానే పశువధను నిషేధించారు.

‘పశువులను వెదకి శిక్షించుటకు

శిశువు ఈ లోకమునకు వచ్చును’



గర్భశోకతప్త హృదయులైన మాతృమూర్తులారా

కళ్ళు తుడుచుకుని

ధవళ వస్త్రాలతో స్వాగతం పలకండి.



‘శిశువు నేడు లేచెను. హల్లెలూయ’
*15-07-2012

కె క్యూబ్ వర్మ || అద్దం పెంకు ||

ఇంత చిన్ని అద్దం పెంకు
ఆ గూటిలో...

చుట్టూ అలికి తెలుపు నలుపుల
ముగ్గు పెట్టిన మట్టి గోడ

చూరు పై తాటాకు
రెమ్మల రిబ్బను వేలాడుతూ...

వెదురు బద్దల తడిక హుందాగా
గోడకు చేరగిలబడి...

రెండు నెమలీకలు
అలా ముంజూరుకు గుచ్చి...

నుదుటిన ఇంత సింధూరం
ఎర్రగా సూరీడు బిళ్ళంత..

ఈ చిన్ని
అద్దం పెంకులో నా గుండె చిత్రం....

మసిబారనీకు
ఆ దీపపు సెమ్మెలా...
*15-07-2012

బివివి ప్రసాద్ || దిగులు గీతం ||


1

దిగులు గాలిపటం ఎక్కడో ఎగురుతూ ఉంది ఈ విరామసమయంలో

2

వాన కురుస్తుంటే లోలోపల దాగిన తాపమేదో తగ్గి చల్లబడాలి కదా

కానీ ఈ దిగులేమిటి

దారిలో తగులుకొన్న కుక్కపిల్లలా నాతోనే తిరుగుతోంది

3

ఎందుకని ఆకాశమా ఏడవకమ్మా అనాలనిపిస్తోంది

మననెవరూ ఓదార్చనపుడు, మనకెవరినైనా ఓదార్చాలనిపిస్తుందనుకొంటా

4

విరామమెంత బరువుగా వుంటుంది

ఈ ఖాళీ సమయాన్ని తెల్లకాగితంలా మడిచి దాచుకొని

వత్తిడుల మధ్య వాడుకోగలిగితే బాగుండును

5

ఏదో ఒకటి చేయాలి

నన్ను నేను తప్పించుకోవాలి

కురిసే, కురిసే వానని ఊహతో ఆపగలనేమో ప్రయత్నించాలి

6

సంగీతమో, స్మృతులో, కవిత్వమో

దేనికైనా ఈ దిగులు సరైన సమయం

కానీ, అన్నిటినీ విడిచి,

ఈ సారైనా దిగులు గర్భంలోకి సరాసరి దూకాలని ఉంది

ఏ సృష్ట్యాది కాలపు వెలుతురులు అక్కడ దాగివున్నాయో చూడాలి

ఏమీ లేకపోవటమైనా అక్కడ ఉండకపోతుందా

అంతూ, దరీ లేని స్వేచ్ఛ నన్ను ముంచేయకపోతుందా

నిజమైన వాన ఏదో నన్నొక చినుకుని చేసి ఎటైనా విసిరేయకపోతుందా


*15-07-2012

నంద కిశోర్ || ‎66G ||

అరె భాయ్!
చూసావా ఎపుడన్నా?
చౌమహల్లాలోని కత్తుల్ని,తుపాకుల్ని
అందానికే అతిశయమనిపించే
అలనాటి వైభవాల్ని,
అఫ్జల్‌మహల్లోని దీపాల్ని,సోఫాల్ని,
చెదరకుండా కూర్చున్న
నవాబుల జ్ఞాపకాల్ని..

భాయ్!
విన్నావా ఎపుడన్నా?
వింటేజ్‌కారుల్లోంచి మోగేటి హారన్‌ని,
అటుగ వెళ్ళే గాలి
మోసుకెళ్ళే సంగీతాన్ని,
రాణుల గుసగుసల్ని,రహస్య భాషల్ని,
ఎవరికి వినపడని సన్నటి ఏడుపుల్ని,
అందమైన కొలనులో
హంసల గానాన్ని..

చూస్తున్నావా నువ్వు?
హైకోర్టుని,ఉస్మానియాని,
సందేశాల్లేని పావురాల్ని,
పాతబడ్డ నయాపూల్ని,నాగరికతని
మురికినీళ్ళలో తేలి
ఊపిరాడని మూసీనీ,
తీరాన్ని మిగల్చకుండా
కొట్టుకుపోతున్న చరిత్రని..

వింటున్నావా ఎపుడన్నా?
రోగుల అరుపుల్ని,
న్యాయంలేని వాదనల్ని,
ఏడ్చే గడియారాల్ని,పాడని మసీదుల్ని,
సిటికాలేజిలో
తన్నుకున్న నినాదాల్ని,
ఫుట్పాత్ దుకాన్లో
ముసల్మాన్ గొంతుని..

ఆబిడ్స్ లో చెట్ల నీడలు
అసెంబ్లీకి వలసెళ్ళాయి.
నాంపల్లి విద్యాలయంల
సురవరంకి గిరాకి లేదు.
మెహదీపట్నం అంచులో
సగం భూమి సైన్యం తింది.
లంగర్‌హౌస్లో ఆగేదెవడు?
బ్యాచులరే అయ్యుంటాడు.

గోల్కొండలో ఉన్న రాళ్ళన్ని
కూలలేక కూలబడ్డయి.
రామదాసు బందికానలో
రాముడింక బయటకి రాలె.
సప్పట్లు కొట్టినవంటే
బూతులేవో ఇనబడుతున్నయ్.
కోటపైకి ఎక్కిసూస్తివో
నగరమంత పాతబడ్తది.

గిదంతా నీకెందుకులేగాని,
'అమాయకుడా'..
నీకు నచ్చేటి పాట పాడనా?
॥పట్నంలో శాలిబండ
పేరైనా గోలకొండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ॥

(*66G గోల్కొండ నుండి శాలిబండ పోయే బస్సు నంబరు. ఈ రూటులో చార్మినారు తాకదు.)
*15-07-2012

మెర్సీ మార్గరెట్ కవిత

శ్వాసనంతా దారాలుగా మార్చి 
నీ గుండె చుట్టూ నన్ను ముడుపు కట్టుకున్నా 
తలగడలో దూరి పోయి 
శ్వాసవై 
రాతిరంతా కబుర్లాడుతావని 
చెవులకు నా మనసును తగిలించా

ఉక్కపోస్తున్న మనసుకు
నీ శ్వాసలు
భావాలై చల్లబరచాలని
చీకటింట్లో దీపమైనట్టు
నీ మాటల్తో
నా గుండెలో శ్వాసను వెలిగించాలని
మసిబారుతున్న ఆశలను
కన్నీటితో శుభ్రం చెశా

ఏమయ్యావ్ ?
రెక్కలు గాలికిచ్చి
మనసును నాకిచ్చావ్ అని మరిచి
పెదాలకు ప్రేమ అర్ధాలు నేర్పి
ఉషస్సుని తిమిరాన్ని కలిపే దారిలో
రాగాల ఊయల వేసుకొని
గాలితో గుస గుసల కచేరి చేస్తూ
సంధ్యా వేళయ్యిందని ఎరుగక
గుండె గూటికి దారి మరిచవా ?

*14-07-2012

సత్య శ్రీనివాస్ || మట్టి తావీజు ||

శిధిలమైన
ఇంటి గోడల్ని
అంటి పట్టుకున్న
రావి మొలక

*14-07-2012

ప్రవీణ కొల్లి || విరామం ||

మనసు అలసట మదికి తెలుస్తూనే ఉంది
తనువు బడలిక భారమై ఎదను వేడుకుంటోంది
కాస్తంత విరామం ఇవ్వమని...

కాలం పరుగెడుతూనే ఉంది నా పనిలా
కాసేపు...కాసేపంటే కాసేపే
ఈ పనిని పక్కన పెట్టి
ఈ రోజును నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని
నన్ను నేను అభిషేకించుకోనీ....

నిద్ర లేమి లేని కనులతో
సూరీడి గోరు వెచ్చటి దుప్పటిని తొలిగించి
నీలాకాశపు కాన్వాసుపై
ఎర్రటి రంగును చిత్రిస్తున్న
ప్రకృతి చిత్రకారుడితో కబుర్లు చెపుతూ
ఈ ప్రభాతాన్ని ఆస్వాదిస్తుంటే
ప్రాణవాయువును కొత్తగా శ్వాసిస్తున్నట్టుంది ....

పువ్వుల పరిమళాలను మోసుకొచ్చిన ఆ చిరుగాలి
మనసు మూలాల్లోకి జొరబడి
సరసాలాడుతూ విసుర్లు విసిరింది
ప్రపంచాన్ని పల్లెటూరన్నావు
మనసులు ఇరుకు సంధులు చేసావు
ప్రకృతికి మేకప్పులేస్తున్నావు
సరి సరి..ఒప్పుకున్నా
ఈ నిట్టూర్పుల సెగలింక ఈపూటకు పక్కన పెట్టనీ
నీ సరసన నన్ను సేదతీరనీ
వేడుకోలును వయ్యారంగా ఆలకించిన
చిలిపి గాలి నా ముంగురులను ముద్దాడింది
పులకరించిన తనువు అలసటను మరిచింది...

తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న గాలిపటం
గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ ఆ స్తబ్దతను ఆస్వాదిస్తుంటే
మరోమారు జన్మిస్తున్నట్టుంది...

నీలాకాశపు పందిరి కింద
చంద్రవంకను వంగి ముద్దాడి ఎన్నాళ్ళయింది!
లెక్క తేలని నక్షత్రాలలో తప్పిపోయినట్టున్నా
ఈ రాత్రి
కొబ్బరాకుల నడుమ నుంచి
నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి
వెన్నెలను కౌగలించుకుని
మబ్బుల లాలిపాటలో ఓలలాడా...

నిన్నటి రోజున జనించిన
ఆ రాగం
నా గుండె గదిలో ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు
మనసు పొరలలో రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో విశ్రమించే వరకు....

ఈ విరామం కొత్త ప్రాణాన్ని నాలో నింపింది...

*14-07-2012

మెర్సీ మార్గరెట్ కవిత

ఘల్లు ఘల్లు మంటూ
నీలి చీరతో వర్షం
ఎదురుగా వచ్చి కూర్చుంది

కళ్లలోని
కన్నీటి చుక్కల్ని తుడుస్తూ
ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని
మెల్లిగా చిరునవ్వు నవ్వింది

-"ఒంటరివని ఎవరన్నారు ?"
నాకన్నా ఒంటరి ఎవరున్నారంటు -

-"మేఘంలా ఆవిరైన నన్ను కౌగలించుకునే
వారెవరు ?
పొగలు పొగలుగా కదులుతూ ఎవరి
గుండెని గట్టిగా హత్తుకోలేను
గాలి అధికారం నాపై ఎప్పుడు ఉండేదే
నా ఇష్టానికి నేను ప్రయానించలేను

ప్రేమ కబుర్లకి .. సందేశం మోసుకెల్లడం వరకే
తరువాత నా వైపు చూసేదెవరు
వర్షించే వరకు పూజలు పునస్కారాలు

ప్రకృతి పలుకులు ..ముచ్చట్లు మూడు నెలలకే
ముగించుకొని మళ్ళీ ఎదురు చూపులు చూడడం తప్ప
అంతవరకు చాలదన్నట్టు
అడవుల్ని నరుకుతూ నా గొంతునులుముతూ
నా కాళ్ళని విరగొట్టి పాపమని
దొంగ ప్రేమ చూపిస్తుంటే

కొద్ది సేపటి ఆనందం ఇలా
కొండల గుసగుసలలో కరిగిపోతు
నేల నేలంతా పరుచుకుని వేడి నింపుకుంటూ
పచ్చిక పైరులతో ఆడుతూ పాడుతూ
ప్రకృతితల్లి ఒడిలో నిదురోయే వరకే అని

తన కళ్ళలో నీళ్ళుఓదార్పు పూలై
నా పైన కురిపించి నను హత్తుకుని
పిలవగానే నేను నీతో ఉంటానని
తన ప్రేమతో తడిపి ఒంటరితనాన్ని
పంచుకుని నేస్తమయింది..

*14-07-2012