1.
కొలనూ నేనూ ఒకటేనేమో?
ప్రవహిస్తూ తీరం తాకేలోపు
ఎన్ని జనన మరణవీక్షణలో
భావప్రవాహంలో కొట్టుకుపోతూ
మృత్యువాతపడ్డ
స్పష్ట అస్పష్ట ఆలోచనల్లా!!
నిత్యంచస్తూ బ్రతికినట్లుండే దేహంలా!!!
2.
మావూరి
మెలికలు తిరిగిన పిల్లకాలువా
దానిగట్టున వయ్యారి
ఒంపుసొంపుల
తుమ్మచెట్టూ
అచ్చు ఇలియానాలా
గుచ్చుకుంటూ...
3.
ఆ కాలువ
నన్నేమీ పట్టించుకోవట్లేదు కాలంలా
వాటిపనేదో అవి చూసుకొంటూ
వెళ్ళిపోతూ అలలు..
నా కళ్ళలో కలల్లా...
ముగింపెక్కడొ తెలియని
తీరంవరకు సాగని అంతర్ధాన దృశ్యాలు
వీక్షిస్తూ గట్టుపై నేను
4.
మా ఊరి ఆనకట్ట బావి మౌనందాల్చివుంది
చాన్నాళ్లయింది దానిబుగ్గల్లో సిగ్గులుచూసి
ఎగిరి గంతువేశా!
పరవశం ఆమెలో..నాలో...!!!
5.
పట్టపగలు మిట్టమధ్యాహ్నమైనా..
మా వూరి చెరువు
కళ్ళనిండా ఒంటినిండా
పళ్ళనిండా మిరుమెట్లుగొలుపుతూ నక్షత్రాలు
కాంతులు విరజిమ్ముతూ కాంతిపుంజాలు
నాలో ఏదో వీక్షణా సృజనావేశం మేల్కొంది!
బహుశా భావుకత అంటే ఇదేనేమో?!
6.
సూర్యుడికి కోపమొచ్చింది
తన వేడిహస్తాలను చాస్తూ...
తలను నిమురుతున్నాడో
శపిస్తున్నాడో
ముఖంపై కాసింత చెమటచల్లి
చిరాకుతో వెళ్ళిపోతున్నాడో?
7.
దేహం మేల్కొంది
పురిటిబిడ్డలా
కానీ మనసే బూడుకొనిపోయి ఉంది తవ్వలేని సమాధిలా
బూజుపట్టిన గుహలా
బహుశా మనసుకు లోతైన వెలుగులు కావాలేమో?
చీకటిని లోతుగ త్రవ్వే చైతన్యపు గునపాలు కావాలేమో ?
గడ్డకట్టిపోయిన ఉద్వేగాలను ద్వంసం చేసే
సరికొత్త సృజన లావాగ్ని కావాలేమో?
*18.8.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి