వీరుణ్నీ, మనిషినీ నేనే! - కాసుల ప్రతాపరెడ్డి నేను దీపాలు ముట్టిస్తుంటాను మేధావులు దీపం కింది చీకట్లనే చూస్తారు వాళ్లు కోడిగుడ్డుకు ఈకలు పీకుతుంటారు నేను పొదిగి పిల్లలను చేస్తుంటాను దుర్గమారణ్యాల గుండా దారులు వేస్తుంటాను వాళ్లు దారికడ్డంగా గోడలు కడుతుంటారు కోడిపిల్లను గద్ద తన్నుకుపోతుంటుంది నేను ఎగిరి తన్ని బొక్క బోర్లా పడతాను వారు పోరాటంలోని అశాస్త్రీయతను విశ్లేషిస్తుంటారు నేను రెండు చెవులూ మూసుకుని దుఃఖాన్ని బాణాలు చేసి విసురుతాంటాను మొదట స్త్రీవాదం గురించి అనంతరం దళితుల గురించి, ముస్లింల గురించి చివరగా తెలంగాణ గురించి భూమి లోపలి వేళ్ల గురించి మాట్లాడుతుంటాను రక్తం నశించి వారి ముఖాలు తెగనరికిన చెక్కలవుతాయి ఏ గాయపడిన ప్రాంతానికో వెళ్లి వచ్చి ఇక్కడ పండుగలు చేసుకుంటారు చిందిన రక్తాలను, తెగిన పడిన మాంసం ముద్దలను కవిత్వాలుగా వండి ఆవురావురుమని ఆరగిస్తుంటారు నేను పంటి కింద రాయినని వారికి గుర్తొస్తుంది నా మీద గుమ్మల కొద్దీ రాళ్లు విసురుతారు పెడరెక్కలు విరిచి చెట్టుకు కట్టేస్తారు నేను చేసుకున్న ఆయుధాన్ని లాక్కుంటారు దాన్ని నా మీదికే గురి చూసి వదులుతారు నా చేతులూ కాళ్లూ ఆడవు యుద్ధభూమిలో విలవిలలాడుతుంటాను నన్ను చూసి వాళ్లంతా నొసళ్లను చిట్లిస్తూ వుంటారు వెటకారాలనో, వెక్కిరింపులనో ముళ్లలెక్క గుచ్చుతుంటారు అక్కడే వాళ్లంతా బొంగరంలా తిరుగుతుంటారు ఒక్క అడుగూ ముందుకు పడదు అది తెలుసుకోవడానికి వారికి ఈ జీవితం సరిపోదు నా ఆత్మ వెలుగుతూ వుంటుంది దాని చేయి పట్టుకుని నడుస్తూ వుంటాను ఇంకా - లోపల నా మీద పళ్లు పటపట కొరుకుతూనే వుంటరు బయటికి మాత్రం పెదవుల మీద నవ్వు అతికించుకుంటరు నేను మట్టిలో పొర్లాడి పోరాడుతున్నవాడిని కదా నాకు అంతా తెలుస్తూనే వుంటుంది కోపం రాదు గానీ ఒక బాధ నిరంతరం గుండెను తొలుస్తూనే వుంటుంది ఇక్కడ మనిషే ఆయుధం వాడికి ద్రోణాచార్యులెందుకు? హృదయమే సిద్ధాంతం వేల కొద్ది పేజీల రాద్ధాంతాలెందుకు? న్యాయాన్యాయాల గుట్టు విప్పడానికి కంటి పొరలు తొలిగిన చూపొక్కటి చాలు వారు ద్వేషాన్ని విసురుతుంటే నేను ప్రేమను పరుచుకుంటూ పోతుంటాను తమ విగ్రహాలను తామే చెక్కుకుంటూ వాలఖిల్యులు తలకిందులుగా వేలాడుతుంటారు నేను గుండెలను అతికించడంలో మునిగి తేలుంటారు చావు గుట్టు తెలిసినవాడిని జీవితమే యుద్ధమైనవాడ్ని కదా! మరణిస్తూ మళ్లీ మళ్లీ పుడుతుంటాను భూమ్మీద నాకు నూకలు పుడుతూనే వుంటాయి ప్రజలు వెలుగుల్లో నడుస్తుంటారు
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUIqDS
Posted by Katta
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUIqDS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి