శ్రీ శ్రీ జయంతి నేడు, అందుకే ఈ కవిత...... మేం నిన్ను ప్రేమిస్తాం! // నవీన్ కోటి -------------- మేం నిన్ను ప్రేమిస్తాం! మట్టిని ప్రేమించినట్టు మట్టిని ప్రేమించే మనిషిని ప్రేమించినట్టు తల్లిని ప్రేమించినట్టు తల్లిని ప్రేమించే బిడ్డను ప్రేమించినట్టు మేం నిన్ను ప్రేమిస్తాం! మహా కవీ! మంచి నీటి మహా సముద్రమా! సరుకుల్నేతప్ప మనుషుల్ని ప్రేమించలేని చోట వరిపైర్ల మధ్య పారే వాగును ప్రేమించినట్టు మేం నిన్ను ప్రేమిస్తాం! దేవుళ్ళనే తప్ప మనుషుల్ని ఆరాధించ లేని చోట పొలం ఎండిన రైతు వాన దేవుణ్ణి ఆరాధించినట్టు మేం నిన్ను ఆరాధిస్తాం! మహా కవీ! ఒంటరైన వాడి వెంట నడిచే సాహస సమూహమా! శివాలెత్తుతున్న చీకటి రాత్రి నాడు పున్నమి చంద్రుని లాగా నేడు నీ అవసరముంది మాకు నిన్నటి కంటే ఎక్కువగా! మనిషికీ మనిషికీ మధ్య మరింత ఎత్తుగా లేచిన గోడల్ని పగుల గొట్టాల్సిన పని ఉంది మాకు నిన్నటి కంటే ఎక్కువగా! మహా కవీ! నేల కూలిన వాడి చేత కవాతు చేయించే కవిత్వమా! వలలు లేని లోకంలో పక్షులెగరడం కావాలి మాకు కలలు నిజమయ్యే లోకంలో కలిసి బతకడం కావాలి మాకు! ప్రజలు విజయాన్ని స్వప్నించిన కాంక్షారణ్యమా! ఆశ చావలేదు ఎవరెస్టు ఎడారి కాలేదు సీతాకోకచిలుక ఇంకా తన రంగులు కోల్పోలేదు ఇంద్ర ధనస్సులో ఏ రంగూ మాయం కాలేదు! మహా కవీ! అనితర సాధ్యమైనా, అత్యున్నతమైన నీ మార్గం కావాలిప్పుడు! మేం నీ బాటలో నడుస్తాం ఈ రోజు కాకపోతే రేపైనా నిలుస్తాం! గెలుస్తాం! నిలిచి గెలుస్తాం! గెలిచి నిలుస్తాం! తేది:30-04-2014 ( రచనా కాలం: శ్రీ శ్రీ శత జయంతి సందర్భంగా 2009 లో )
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdrIiX
Posted by Katta
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdrIiX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి