జయకేతనమేగరేస్తూ 'జయ' ఉగాది- Dt. 29-3-2014 ప్రభాత స్నానం కావించి ధవళ కాంతుల పేటిక తెరిచి సప్త వర్ణాల సొగసులద్దుకుని జయ నామం ధరించి ఉగాది వస్తోందిట ! దేనితో స్వాగతించను? అరవయ్యేళ్ళ పాత పెంకుటిల్లు ఆరంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్సుగా మారే క్రమంలో గూళ్లు కోల్పోయిన గువ్వలతో పాటే అంతరించిపోయిందేమో ప్రతిసారీ కుహూ కుహూ అంటూ ఉగాదిని స్వాగతించే కోకిలమ్మ వినిపించకుండా పోయింది ! ఇన్నేళ్లూ శిశిరంలో ఆకులు రాల్చేసి వసంతాగమనంతో చిగురులు తొడిగి పూలతో కాయలతో పిల్లలూగే ఉయ్యాలలతో కళ కళలాడిన చెట్లతో పాటే మావి పూతల్లో చెలరేగిన కూతలమ్మ కూడా మౌనగీతమై కనుమరుగై పోయింది ! అన్ని ఋతువుల్లోనూ ఒకలాగే నిలిచే ఆకాశ హర్మ్యాల నడుమ తలదాచుకునే గూడు లేక తరలిపోయిన శుక పికాల నిష్క్రమణం చూశాక కొమ్మా రెమ్మా కనిపించని కాంక్రీటు అడవిలో శిశిరానికీ, వసంతానికీ తేడా ఏముందని ఆమని అలిగింది! పచ్చని తరుశాఖల పందిరిపై రంగు రంగుల పువ్వులు పేర్చి సీతాకోకమ్మలని ఆహ్వానించే ఆమని అశోకవనంలో సీతమ్మలా శోక ముద్రలో మునిగింది ! పూల రెక్కల్లో ఒదిగి నిదురించి , గాలి పాటల్లో కదిలి నర్తించే వసంత భామిని విడిది చేసే చోటు లేక వడిలిపోయింది, వెడలి పోయింది ! ఇపుడు వసంతం వెంట లేకుండా ఉగాది ఒంటరిగా వస్తుందా ? గుమ్మాలకి వాడని ప్లాస్టిక్ ఆకుల తోరణాలతో స్వాగతిస్తే సెల్ ఫోను రింగు టోనులో కోకిల కూతలు పలకరిస్తే షడ్రుచుల పచ్చడి కూడా కొట్లో కొనితెచ్చిన రెడీమిక్స్ గా కనిపిస్తే ఉగాది ముంగిట్లోకి వస్తుందా ? అవమానపడి వెనుదిరిగి పోతుందా ? మనసు నొచ్చుకున్నా మార్పులు నచ్చకున్నా మానవాళిని మన్నించి చీకట్లని చీల్చే కొత్త వేకువై తూరుపు వాకిట్లో ప్రత్యక్షం కమ్మని వేడుకుంటే ఉగాది కాదంటుందా ? విధ్వంసాలకు స్వస్తి చెప్పి వసుధకు వన్నెలద్దుదాం రమ్మంటే హరిత విప్లవానికి పునాదులేద్దాం పదమంటే, ఉగాది రాకుండా ఉంటుందా ? వస్తుందేమో.... ఎన్నిసార్లు విరిగి పడినా తిరిగి పైకేగసే కడలి కెరటంలా ఎంత అవమానించినా ఋతుచక్రంతో పాటుగా తిరిగి తిరిగి ఆగమించే ఆమని ఈసారి ఒక కొత్త వరవడికి శ్రీ కారం చుట్టేందుకో... ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే అలవాటుకు స్వస్తి పలికి తీరు మార్చుకోక పోతే , ప్రకృతి సమతుల్యత పట్టించుకోకపోతే తుడిచి పెట్టేస్తానని తర్జని చూపించేందుకో... వస్తుందేమో ! వసంతం గ్రీష్మమై మండి పడే దాకా ఉగాది ఉగ్రవాదై ఉరిమేదాకా సుప్త శిలలై నిలిచిపోకుండా మన తరం చేసిన తప్పిదాలన్నిటినీ తక్షణమే దిద్దుకుని పర్ణశాలల ప్రాంగణాల్లో వసతులిచ్చి తూనీగల సంగీతం వినిపిస్తే, రాలిన పూరెక్కల తివాచి పరిచి భ్రమర గీతాలతో స్వాగతిస్తే వసంతాన్ని వెంట పెట్టుకుని వన్నెల వెన్నెలమ్మలా వెలుగుల వేకువమ్మలా ఉగాది వచ్చేస్తుంది ! వయసుమళ్ళిన సంఘాన్ని వ్యర్ధ ప్రలాపాలిక చాలించి యువతరానికి దారిమ్మనీ, నవ భావాలకు చోటిమ్మనీ ప్రేరేపిస్తూ ఉగాది వస్తుంది ! స్వార్ధ శక్తులకు కాలం చెల్లిపోయిందని హెచ్చరిస్తూ నోటిస్తే వోటిచ్చే రోజులు మారాయనీ యువ శక్తి ప్రభంజనమై దూసుకొచ్చి దేశ పటాన్ని పునర్లిఖిస్తుందనీ జాతి భవితను తీర్చిదిద్దుతుందనీ భరోసా కలిగిస్తూ ఉగాది వస్తుంది ! అన్న దాతకు అప్పుల్లేని జీవితాన్నీ పీడకలలు లేని నిద్రనీ ప్రసాదించి సకల జనావళికీ కూడూ గూడూ ఒనగూడే ఒరవడి సృష్టించేందుకు ఉగాది వడివడిగా వస్తుంది ! కుళ్లిన వ్యవస్థ లోంచే కొత్త మొలకలు పుట్టుకొస్తాయని ఆశల చిగురుల గుబురుల్లో నవ రాగాల మృదు గమకాలు పల్లవించే కోకిలల కొత్త గొంతులు వినిపిస్తూ కలరవాల కలకలమై అదిగో ... అదిగదిగో ... ఉగాది వస్తోంది ! వసంత శోభను వెంట పెట్టుకుని మళ్లీ మన నేలను హరితసీమగా మార్చేందుకు జయ నామం ధరించి ఉగాది వచ్చింది ! జయ జయ ధ్వానాల మధ్య జయ కేతనమెగరేస్తూ ఉగాది వచ్చేసింది ! *************
by Nagalakshmi Varanasi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9QfYv
Posted by Katta
by Nagalakshmi Varanasi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9QfYv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి