||జగద్ధాత్రి|| కలరాహిత్యం|| కలలు కనడం రాలేదు నాకు ఎందుకో మరి....... ఆశలు నిండిన ఊహలు పండాలనే కలలు నా కనుల గుమ్మానికి ఎప్పుడూ అపరిచితలే కలరవాలు కలవరాలు ఎరుగనిది నా కనుదోయి అనుభవాలు అనుభూతులై ఎదురైనప్పుడు వాటిని ఆస్వాదించడమే కానీ రంగుల కలలుగా అవి నాకు ముందరే అగుపించిన వైనమైతే లేదు గాలిలో మేడలు కడుతూ ఆకాశం లో విహరించే రంగురంగుల విహంగాల స్వప్నాలు ఎన్నడూ మరి నా హృదయ వృక్షం పై వాలలేదెందుచేతో ..... ఎప్పటికప్పుడు జీవితం ఆవిష్కరించే సరి కొత్త ఆనంద విషాదాలను యధాతధంగా స్వీకరించడమే తప్ప కల గన్నది లేదు ..... ఊహల్లో తేలలేదు ఎన్నడూ బతుకు సంద్రానికి కల దీపం అగుపడలేదు ఆశల హర్మ్యాలూ కట్టలేదు ఎప్పుడూ అప్పుడప్పుడూ వేదనా భయాలు పీడ కలలై వేధించిన మాట వాస్తవమే కానీ సప్తవర్ణ స్వప్నాలు కనికరించింది లేదు నా కనులను అందరిలా నేను ఉండలేక పోవడం రంగుల కలలు కనలేక పోవడం ఏమన్నా లోపమా నాలో అని భయమేస్తుంది ఒకోసారి కన్న కలలు వెతలై బతుకు భంగపడిన వారిని చూసినపుడు కలలు కనలేని నా అశక్తత నాకు అపురూపమైన శక్తిగా అవుపిస్తుంది అపరిమితమైన అవాస్తవికమైన అభూత కల్పనా జగత్తులోనికి నాకు ప్రవేశం లేనందుకు ఆనందం కలుగుతుంది తెలి మబ్బులలో తేలి పోతూ ఆధాటున భూమి మీదకి రాలి పడటం కలకీ వాస్తవానికీ అనుసంధానం కుదరక రాజీ పడలేక ... గాఢమైన అసంతృప్తితో పరితపించే ప్రహసనం నా జీవితంలో లేనందుకు ... కలల బరువును నా కనుపాపలు మోయాల్సిన అగత్యం తప్పినందుకు ఆనందంగా కలల మాంత్రికుల పాల పడకుండా బతుకు కావడిని మోసుకుంటూ వాస్తవం లోనే ...వాస్తవంగానే .... కష్ట సుఖాలను అనుభూతిస్తూనే ... అప్పుడప్పుడూ జీవిస్తూ ....ఎప్పుడూ బతికేస్తూ ..... !!! ........................................................జగద్ధాత్రి 3.04 పి ఏం 14/3/2014 శుక్రవారం
by Jagaddhatri Dhaathri Jagathi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oT0mSC
Posted by Katta
by Jagaddhatri Dhaathri Jagathi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oT0mSC
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి