కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు || మన మెందుకో అవతలి వారిని త్వరగా అపార్ధం చేసుకుంటాం కానీ లోతుల్లోకి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతి సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం కానీ, ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే అదని గమనించం. పగలూ రాత్రీ తేడా లేకుండా నిద్రాదేవత ఒడిలో ఊయల లూగుతున్నవారిని చూసి ఎంత నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ, వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న విషయాన్ని గమనించలేం. తక్కువ మాటలను, ఎక్కువ వేగంతో చెప్పేస్తే ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం కానీ, రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన పట్టుకోలేం కాక పట్టుకోం. నాకసలు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమే అని ధైర్యానికి ప్రతిరూపంగా భావిస్తాం. కానీ వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు ఓ సారి కదిలిస్తే అది జిత్తులమారితనం కాదు అమాయతను రంగరించుకున్న మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. ఆటలో అరటిపండ్లలాంటి తొక్కలో విషయాలకో వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే, అది ఆధిపత్య ప్రదర్శనో, మితిమీరిన అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు. వారు ప్రేమరాహిత్యపు దాహంతో కొట్టుమిట్టాడుతున్నారనే భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు. లోపటి లోకాల ఊసులు తెలియాలి, మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి. గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి, చాపే చేతులతో హృదయాలను అందుకోవాలి. పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ఓ సారీ నిలబడి భారం బేరీజు వేయగలగాలి. http://ift.tt/1ddpvC2 ►(కొన్నాళ్ళ క్రిందట రాసుకున్న కవిత) 05-04-2013
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ddpvC2
Posted by Katta
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ddpvC2
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి