పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Challa Ssj Ram Phani కవిత

ప్రేమకు కళ్ళొస్తే... శిలాజ శరీరంలో గర్భీకరించుకున్న కలలకు ఆకారమైన నీవే కదా అక్షరాలకు ఊపిరైంది! అనిబద్ధ శాఖాచంక్రమణాల అహమహమికతో అలమటించిపోయే ఆకలి క్షణాల ఆఖరి దశలో అక్షరాలకు తొడగడానికి భావాల ఉడుపులైంది! చక్రంతో రమించే తార్రోడ్డును కొలుస్తూ తూగుటుయ్యాల్లా ఊగే గూడుబండిలో సమయానికి గుడికి చేరాలనే తపన నీ నేత్ర దర్పణాల్లో ప్రతిఫలించిన ఆరాటమే కదా అక్షరాలకు ఆయువంది! ప్రేమకు పునాది ద్వేషమని తెలియనితనంలో తెలీక తూలిన మాటల తూటాలు చేసిన గాయాల మాలల్ని మల్లెదండల్లా మోస్తూ అశృపుష్పాలై నీ ముంగిట్లో పూసి అక్షర పరిమళాలై ప్రవహించాను! అగమ్య నాటకాలకు, అక్షర ఘాతుకాలకు ఆదిమపునాది నీ అంతరంగ గుహాంతస్సీమలని తెలిసిన మరుక్షణమే కలం తన్ను తాను గిల్లి చూసుకుని కాలం చేసిన స్ఫూర్తి కోసం అక్షర మౌనం పాటించింది! ఇప్పుడు నాకూ ద్వేషించడం తెలుసు! విషాదినితో వినోదించడమూ తెలుసు! అఖండమవుతున్న అనంత రూప ద్వేషాగ్ని శిఖలకు ఆది భాష్యకారుణ్ణి! విద్వేష ప్రేమలు అభేదాలని నిరూపించగల మాంత్రికుణ్ణి! అంతే! నా అక్షరాలకు కాళ్ళొచ్చాయి! ప్రేమకు కళ్ళొచ్చాయి! * * *

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fAdZ74

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి