1.
కవిత్వం ఒక భావోద్వేగం..
కవిత్వం ఒక రాగ ప్రవాహం ..
కవిత్వం..ఒక అనుభవం..
కవిత్వం అనుభూతుల సమాహారం..
2.
ఒక భౌతిక సంయోగానికి...
ఒక రసాయనిక..చర్య జరిగి...
తగిన గణాంకాలన్నీ కుదిరి..
ఎలా ఒక జీవం రూపు దిద్దుకొంటుందో..
ఎలా ఒక కణం ప్రాణం పోసుకుంటుందో..
ఏ పరిధి వరకు..
ఏ అవధి వరకు..
ఏ సరిహద్దుకు...
అచరం..చరమౌతుందో..
మూలకం..స్వయం చలితమౌతుందో..
జడపదార్ధం ...చైతన్యవంత మౌతుందో...
ఎవరు చెప్పగలరు..?
ఎవరు సృష్టి గుట్టు విప్పగలరు..??
3.
దేహ మిథున మథనం లో ..జీవం ఆవిర్భవించినట్టు..
హృదయ మేధో మథనం లో ...కవనం ఆవిష్కృత మౌతుంది..
కన్ను తెరచిన నాటి నుండే...
తనను తాను నిర్మించుకొంటూ...
పాఠాలు..గుణపాఠాలు..నేర్చుకొంటూ..
ధర్మాన్ని ..అనుసరిస్తూ...
కర్తవ్యాన్ని..నిర్వర్తిస్తూ...
ప్రతిఫలాపేక్ష ఉపేక్షిస్తూ..
మానవుడు..మహనీయుడు..
4.
ప్రకృతి చక్కని గురువు..
పరిశీలిస్తే చెప్పలేనంత..చదువు..
పరిశోధిస్తే..అగాధ విజ్ఞాన సింధువు..
5.
ప్రతిఫలమేమి కోరుతుంది.. పూచిన గులాబి
బహుమతులేవి అడుగుతుంది ..పరిమళించిన సిరిమల్లి..
కానుకలేవి ఆశిస్తుంది...వెన్నెల విరజిమ్మే..జాబిల్లి..
నెమలి నాట్యం లో...ఎనలేని పరవశముంది
కోయిల గానంలో...కొలవలేని తన్మయముంది..
దూకే జలపాతంలో..తోక ముడవని తత్వముంది..
సాగే కొండవాగులో...వెనుదిరగని..ధైర్యముంది..
దాహం తీర్చే నదిలో..తొణకని..నిండు దనముంది..
విరిసిన ఇంద్ర ధనువులో...రంగులు చిమ్మిన ఆనందముంది..
పలు వర్ణాల సీతాకోక చిలుకలో..అందం చిందించే నైజముంది..
నీడ నిచ్చే చెట్టులో..ప్రాణ వాయువు అంది౦చే .దాతృత్వము౦ది..
పంట చేలలో..తమ ఉనికి కోల్పోయీ.. ఆకలి తీర్చే త్యాగ నిరతి ఉంది..
6.
ప్రకృతికి ఇవ్వడమే తప్ప..ధర కట్టడం తెలీదు..
మనిషి మినహా జీవులు-
అనుభూతి చెందడమే తప్ప ..అడగడం ఎరుగవు..
ప్రశంసలకు..పొంగవు...విమర్శలకు కృంగవు
సత్కారాలు ..సన్మానాలు..ఆశి౦చవు
బిరుదులూ...పతకాలు ..అర్థించవు
7.
గొర్లుకాసే పిల్లవాడి పిల్లనగ్రోవి పాటకు..కొట్టేదెవరు చప్పట్లు
దుక్కిదున్నేరైతు ఆశుకవితకు..కప్పేదెవరు దుప్పట్లు..
8.
ఒకటికి రెండింతలు..
గోరంతకు..కొండంతలు ..
ఆశిస్తూ అపేక్షిస్తూ..
వక్రమార్గాలన్వేషిస్తూ...
అక్రమ విజయాల..సాధిస్తూ..ఆస్వాదిస్తూ..
వందిమాగదులతో జేజే ధ్వానాలు....
భజంత్రీలతో...భుజం చరుపులూ...
9.
మది పెల్లుబిన భావాన్ని ..అక్షరీకరించడం..
పదాల నాదాన్ని పదుగురి ఎదుట నినదించడం..
ఇవ్వడం నీ సమస్య ..
గ్రహించడం ..ఆగ్రహించడం..సంగ్రహించడం...
అవతలి వారి సమస్య...
నిన్ను నువ్వు ..పరిష్కరించుకో...
నిన్ను నువ్వు సంస్కరించుకో..
నిన్ను నువ్వు సమర్పించుకో..
అంతా సవ్యమే
..అంతా..నవ్యమే
.అంతా..ఆమోద యోగ్యమే..
గిరి గీసుకొంటే..అది బంధనం..
కోర్కెతో రాస్తే..అది శృంఖలం..
మొక్కుబడిగా రాస్తే..అది వ్యాపారం..
స్వేచ్చా విహంగమే కవిత్వం...
స్వతంత్ర హృది జన్యమే...కవిత్వం ..
కవిత్వం చేత ,కవిత్వం కొరకు ,కవిత్వం..
కవి తత్వమే కవిత్వం..
కవిత్వం కావాలి కవిత్వం...!!!
23-09-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి