పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, సెప్టెంబర్ 2012, సోమవారం

వాసుదేవ్ II గుడిమెట్లు--ఓ శిధిల కథల సంచిక II

గుడికన్నా ముందే పలకరించే
ఆ డైభ్భై ఏడు మెట్లూ డైభ్భై ఏడు కథలు
కష్టం వెనుకే సుఖమన్నది చెప్పడంకోసమన్నట్టు 

*

ఒంపులుతిరిగుతూ ఊరించే ఆ మెట్లమీదే
బాల్యం చిన్నపాదాలతో....
ఒక్కోమెట్టుని వెనక్కి నెడుతున్నాననే ఆనందంలోనూ
అమ్మ చెయ్యి ఆసరాలోనూ కథలు అవసరం అన్పించవు
గతాన్ని ఎక్కడో కలిపేసె ఆలోచనలో అమ్మ
వర్తమానాన్నివొదిలేసె ఖంగారులో నేను
కొన్న జ్ఞాపకాలు......

* * 

ఓ మెట్టు చివర్న అప్పుడె మొలకెత్తుతున్న ఓ గడ్డిమొక్కా
మరోమెట్టుఅంచున కాలానికి లొంగిపోయిన శంఖంపువ్వు
దేన్నుంచి విడివడిందో మరో సంపెంగ రెమ్మా
అవన్నీ పలకరిస్తూ..
ఒక్కోక్కటీ ఒక్కోకథ
జీవితానికి సరిపడా !

* * *

అంత 'దూరం' వచ్చిన తర్వాతకానీ మెట్లాగవు
ఓ సారి వెనక్కి తిరిగిచూస్తే
దాటొచ్చిన జీవితంలా, రెపరెపలాడుతున్న పేజీల్లా
ప్రతీ మెట్టులో ఓ కథ విన్పడుతూనె ఉంది
ఆ కథలన్నీ
ఓ జ్ఞాపకం కూడా!

* * *

అక్కడే
ఓ పిలుపు మళ్ళీ...ప్రతీ మెట్టూ ఓ కథతో
ఎన్ని నగ్నపాదాలని మోసాయో
మరెన్ని కథల్ని విన్నాయో కన్నీటి నేపథ్యంలో
అవన్నీ ఇప్పుడు వెలలేని సంచికలు

* * 

అమ్మ అంటూనే ఉండేది
'నీతో గుడికిరావటం ఓ అనుభూతిరా' అని
అదేంటో అర్ధం కాని వయసు!
ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ
మెట్లంతా రాళ్ళే...జ్ఞాపకాల శిలాజాల్లా

* * * 

ఏం జరిగిందో ఎందుకెళ్ళానో తెలీకుండానే
మెట్లు దిగుతూండగా--
చీరకొంగుతో నాచెయ్యి తుడుస్తూన్న ఆమెలో
తెల్ల రంగు అద్దుకున్న ఆ నవ్వు
అప్పుడేం తెలీదు, అమాయకంగా
ఇదిగో ఇప్పుడే అవగతం
గతాన్నీ ఇలానే చూడమని చెప్పిందేమో..
గుడిని పరిచయంచేసి, ఈ ప్రపంచాన్నిచ్చింది అమ్మ

* * * 

ఆ తెల్ల నవ్వు,ఇంకా గుండెల్లో పదిలం
గుడి...అమ్మ..ఓ జ్ఞాపకం
నిన్న వర్షంలో పట్టుకున్న
ఓ బిందువులా
కథలన్నీ చెప్పి జారిపోతూ!
జీవితపుటల్లో అందమైన బుక్‌‌మార్క్
ఈ గుడి..మెట్లు 

* * *

ఆ గుడింకా ఉంది, మెట్లూ ఉన్నాయి
ఆ జ్ఞాపకమూ ఉంది
అమ్మే లేదు
చేతుల్లోంచి జారిపోయిన తీర్ధంలా
వెళ్ళిపోయింది......
నన్ను ఆ మెట్లమీదొదిలి
ఆ శిధిల కథలన్నీ
బతుకు బాటలో సహచరులు....

22.September.2012
(అమ్మతో గుడికెళ్ళటం--ఆ ఇసుకకొండ గుడికెళ్ళటం జీవితంలొ మధురానుభూతి...జీవితంలో నన్ను వెంటాడే జ్ఞాపకాల్లో ఇదొకటి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి