పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

పీచు శ్రీనివాస్ రెడ్డి ||అ క్ష రం||



ఉప్పు కారం లేకుంటే చప్పగానే ఉంటుంది పప్పు
కేవలం , ప్రాసతో పదానికి జీవం పోసిన కవిత్వంలా
భావాన్ని పెనవేసుకున్న అక్షరాలు కవితలా కురవాలి

అక్షరాలు నిలబడాలి
యుద్ధానికి సన్నిద్ధంగా
మనిషిని భయానికి గురిచేస్తున్న చీకట్లను
ప్రశ్నించేలా ...

భావం గర్జించాలి
మనిషిని మింగుతున్న నిరాశ నిస్పృహలను
తరిమేలా ...

భావం బ్రతికించాలి
ప్రతి నిత్యం మనిషి నర నరాన కర్మ జలాన్ని
నింపేలా ...

అక్షరం నిలబడాలి
తనకు తానే సంక్షోభంలో మునుగుతున్న మనిషికి
చేయూతనిచ్చేలా...

అక్షరం తలబడాలి
పళ్ళెంలో వేసుకున్న నాలుగు మెతుకులను
ఎత్తుకుపోయే ...
బలిసిన గద్దల రెక్కలను
నరికే కత్తిలా ...

అక్షరం కురవాలి
అక్కర కోసం అవకాశాన్ని అమ్ముకునే
స్వలాభ చింతనను
కడిగేసే జడివానలా...

అక్షరం వెలుగవ్వాలి
మనిషికి
ప్రకృతి ఇచ్చిన పచ్చదనాన్ని పక్కదోవ పట్టిస్తున్న
పగటి వేషగాళ్ళ స్వార్థపు నీడలను
బయటపెట్టేలా ...

అక్షరం.
దొరలై దోచుకుంటున్న దొంగల బాగోతాన్ని
కాల్చే మంటవ్వాలి...

అక్షరం నిలబడాలి కత్తిలా
అక్షరం నిలబడాలి అండలా
అక్షరం నిలబడాలి వెలుగులా

అక్షరం నిలబెట్టాలి
కవితను సమోన్నత స్థానం పైన
అక్షరం నిలబెట్టాలి
మనిషిని సర్వోన్నత శిఖరం పైన

31-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి