పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

గరిమెళ్ళ నాగేశ్వరరావు//ఆరోగది//



ఆరోగదిని తెరవొద్దు
దేశానికి.. అరిష్టం.

ఆరోపణలు చెయ్యొద్దు
ఆరోగ్యానికి.. నష్టం.
దరిద్రమొక దావానలం..
దాన్నలా.. తగలడనీ.
ధనమంతా దైవాధీనం
అదలా.. దాగుండనీ.
గనులు తవ్వితే ఏముంటుంది?
ఘనుల గదులు తవ్విచూడు
నవ్వుతూంటుంది.. ధనలక్ష్మి.
లాకర్లో ఇరుక్కుంటె లోకం
ఇంకెలా తీరుతుంది శోకం

పార్టీలను నడిపించే ‘‘పార్టీ’’ఏదో
దాచేసిందట..
చూపుడు వేలి చుక్క సూట్‌కేస్‌లో.
మందుపాతర లోపలి శక్తీ ‘మందే’నట.
సారా కాంట్రాక్టర్ స్పాన్సరింగ్‌లో
సాగుతుంది.. స్వామీజీ ప్రవచనం.
చర్లపల్లి జైలులో సాగుతూంటే అసెంబ్లీ
తీహార్‌లో పాసవుతుందేమో.. తీర్మానం.
లోకపాలకుల లోపలి గుండెల్లో
అదిగదిగో ఊగుతోంది కీలక లోలకం
న్యాయదేవతకి నేత్రదానం..
చేసొద్దాం.. పద.

అన్నాహజారే.. ఆపకు సత్యాగ్రహం
నల్లకోటు మీద తెల్లటోపీ వాలకముందే.
ఆకతాయెవడో.. ఆరోగది తెరిచేస్తాడట

అపరిష్టం.. ఆగుతుందా.. సాగుతుందా..
స్విస్ బ్యాంకు ముందు చిలక జాతకంలో..
అడగండీ ప్రశ్న- అర్జంటుగా.

31-8-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి