పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఆగస్టు 2012, గురువారం

క్రాంతి శ్రీనివాసరావు ||మూడు మేరలు ||


అన్నయ్య కొడుకుపెండ్లి ఖమ్మం లో చేయ్యాలనుకొన్నప్పుడు
నాన్న ఎందుకో అలజడిగా కనిపించారు
అమ్మ మెల్లంగా వెల్లడించాక తెలిసింది
మంగలి నారాయణ
చాకలి లక్ష్మయ్య
కుమ్మరి వెంకయ్య
లేకుండా పెళ్ళెట్లా చెయ్యాలని?

కాళ్ళ గోళ్ళు తీసేందుకు
కూర్చునే పీటకింద పోసిన వడ్లను
మెరుస్తున్న కళ్ళతో చూస్తున్న నారయణ

నన్ను చూసి ముచ్చటపడి దగ్గరకొచ్చి
నీ జుట్టేందయ్యా ఇట్టయ్యుంది
అంతొత్తు గుండేది ఇంతపలచనయ్యుందేం మా బతుకుల్లాగా అన్నప్పుడు

పిల్లలెలావున్నరు అంటే
వాళ్ళు వూరిడిచి మేరిడిచి పట్నం బొయ్యు
ఎవడి కొట్లోనో కత్తెర్లేసుకు బతుకుతున్నారు
వూళ్ళో వాడ నచ్చక ఆడికి బొయునంక సొంతిల్లు లేక
మురికి వాడల్లోనే బతుకెలమార్చుకుంటున్నారు

సన్నాయుమేళం బాండొల్లెత్తు కెల్లాక
పెద్దోన్నాయానుగా బొత్తిగా పనిలేదుబాబు
వోడిపొయున కోడిపుంజుల సాపం ఉత్తినే పోద్దాబాబు

పొదిలో పదిలంగా ఉండాల్సిన బతుకు
పట్నం బొయ్యు ఆగమయ్యుండ్రు పోరగాల్లని
బాధని సన్నని నీటి పొర వెనుక దాచేస్తూ చెప్పిన మాటలు
నన్నింకా వెంటాడు తూనే వున్నాయు...............................

తోరణపు ఆకులు కట్టించి ప్రతాణపు పెట్టె బూజానెట్టుకొని ఎదురై
చల్లనిచూపులతో దీవిస్తున్న లక్ష్మయ్యనీ అదే ప్రశ్న అడిగా పిల్లలెలా వున్నారని
ఎముందయ్యా
ఒకడు అపార్ట్మెంటు కిందా మరొకడు రోడ్డుపక్కన
గూడలు పడేదాకా గుడ్డలు ఇత్తిరీ జాత్తాన్నా
గాడిద చాకిరీ తప్పితే గతకటానికే తప్ప ఏం మిగులుబాటులేదయ్యా
వూల్లో చాకిరేవు బెట్టినప్పుడు ఈమాత్తరపు గటక అప్పుడూ వుందిలేయ్యా అంటున్నప్పుడు
కళ్ళళ్ళో చల్లదనం పోయు నైరాశ్యపు నీడలు కమ్ముకోవడం నాకింకా గుర్తే

గరిగ ముంత ఏదన్నప్పుడు గబగబా వస్తున్న వెంకయ్య నడిగా
కుండలింకా చేస్తున్నావా అని

ఘట వాయుద్యంలా గలగలా నవ్వి
కొట్లో కొనుకొత్తున్నా సారిరిగి చాలాకాలమయ్యుందయ్యా
అప్పుడు
గరిగ ముంత నుండి నీల్లపొంతదాక
అన్నం కుండలు నీల్లకడవలు పచ్చడి బానలు
మట్టికూజాలు వొంటిచేత్తో చేసేటోన్ని
ఇప్పుడు కుండలు పగిలిపొయ్యు
మా బతుకులన్నీ ఓటు బొయ్యాయయ్యా
దినబత్తెం గాల్లమై దొరికిన పని జేసుకొంటున్నామయ్యా అన్నప్పుడు
ఆలోచనలన్నీ మనసులో తిరుగుతున్న సారె చక్రం చుట్టుకొని చిక్కుబడ్డాయు



అవతల అప్పగింతలవుతుంటే
నాన్న ఆముగ్గురూ వూరి జ్ఞపకాలను అప్పగించుకొంటు
చుట్టలు కాల్చుకొంటూ చుట్టాలను పక్కన బెట్టి
పల్లెను మళ్ళీ పెండ్లి పందిట్లో బ్రతికించారు

పల్లె పందిరిగుంజకు కట్టేసుకున్న ఆతరం
పందిరిమంచమెక్కాలని పట్నం చేరిన ఈతరం
బావుకున్నది బాగుపడ్డది ఏదీలేదు

సమస్త వృత్తులూ ధ్వంసమై
ఇప్పుడు పెట్టుబడిదారు స్వంతమయ్యాయు

యంత్రభూతాలు వెంటపెట్టుకొని
దొరకొడుకే ఇప్పుడు వృత్తిదారుడయ్యాడు

పిడికిలి బిగియుంచనంత కాలం
పిరికితనం వీడనంత కాలం
పేదరికం పంచలోనె కాపురముంటుంటారు
శ్వేదజలం దొంగలకె చాకిరిచేస్తుంటారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి