పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఆగస్టు 2012, గురువారం

జాన్ హైడ్ కనుమూరి |నీవు వెళ్ళాక|



నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
ఆశేదో గూడుకట్టిన మేఘమౌతుంది
నువ్వెళ్ళాక వర్షించడం మొదలౌతుంది

నీ బాల్యాన్ని భుజంపై మోస్తూ
నా పనులు చేసున్నప్పుడు
నీవు చేసిన సవ్వడులు
ఇప్పుడు జ్ఞాపకాలై రాల్తుంటాయి

ఎదో మిషతో
నువ్వెళ్ళకుండా బంధించాలని చూస్తాను
బాధ్యతల గుమ్మానికి
ప్రాణాలు తగిలించివచ్చావని గుర్తొస్తుంది
బంధించాలనే వూహలన్నీ
పురిలేని దారాలయ్యాయి


చిన్నిచిన్ని పక్షుల్ని చూసి
ఎగరటం ఎలా అడిగిన నువ్వు
అనురాగాలన్నీ
ప్రక్కనపెట్టి
హఠాతుగా ఎగిరేందుకు సన్నద్దమౌతావు

నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు

నీవు చెప్పిన ఊసుల్తో కొన్నిరోజులు
దిగమింగిన బాధల్ని తలపోస్తూ మరికొన్నిరోజులు
నళ్ళీ వచ్చేదెపుడోనంటూ
ఎదురుచూపుల్ని వాకిట్లో ఆరబెట్టి
కేలండరును కత్తిరిస్తుంటాము

అప్పుడప్పుడు
ఇంటిపైన ఎగిరే విమానం చప్పుడులో
నీవున్నావని భ్రమపడి
బయటకొచ్చేలోగా
విశాలాకాశంలో
అదృశ్యమౌతుందా తలపు

నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు

తలపుల్తో పాటు
తలపుల్ని మూసి
చెమ్మగిల్లిన కన్రెప్పల్తో
నిద్ర రాక తూగుతుంటాము

**************
అమ్మలందరికి అంకితం
**************

ప్రవీణ కొల్లి రాసిన |ఇంటికెళ్ళి వచ్చాక| చదవగానే మా అమ్మ గుర్తుకొచ్చింది

తక్షణం అక్షరాలిలా ప్రవహించాయి
జ్ఞాపకంగా తొలి ప్రతినికూడా ఇక్కడపెడుతున్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి