పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఆగస్టు 2012, గురువారం

అఫ్సర్||An Empty Episode-3||



మూడో సన్నివేశం: మాటని శంకించకుండా వుండలేను, వ్యక్త శబ్దాల అపనమ్మకం నన్ను వెంటాడకుండా వుండదు ఎప్పుడూ – “నేనె”ప్పుడూ అవ్యక్తమని చెప్పను కానీ, అవ్యక్తంలోని శబ్దరాహిత్యం నాకెందుకో పెనుకేకలా వినిపిస్తూనే వుంటుంది. కలవరింతల భాష తెలీకపోతే నీకు/ పలవరింతల నిట్టూర్పులు నీలోపల ప్రతిధ్వనించకపోతే ఎందుకో నేనొక దిగులు విగ్రహమై నిలిచిపోతా వొక్క మాటా అనలేక.

1
నువ్వు నన్నెలా కదిలిస్తావో, అదిలిస్తావో ఇంకా ఆ రహస్యం నాకు తెలీదు. నేను నేర్చుకున్న/ నేర్చుకోలేని భాషల్లో ఎక్కడా ఎప్పుడూ నీ రహస్యాలు తర్జుమా కావు. నీకేదో వొక భాష ఇద్దామనే నా వెర్రి ప్రయత్నం వుందే, దాని మీద నాకెప్పుడూ కొండంత జాలి. ఎన్ని కొండలు ఎక్కాలి నీ ఆకాశంలోకి గిరికీలు కొట్టడానికి? ఎన్ని ఎత్తుల మీంచి జారిపడాలి నీలోపలికి వొక పక్షి ఈకనై అతి తేలికగా అలవోకగా, ప్రాణమూ దేహమూ శూన్యమయి పోయినంత హాయిగా రాలి పడడానికి?

2
కలవరింతల రుతువులో నీ పేరు వొక్కటే నాకు మిగిలిన భాష. నిజం కాదని బాగా తెలిసి తెలిసీ నీ చిర్నవ్వు కొసన వేలాడుతూ వుండిపోతా తెల్లారే దాకా-- మళ్ళీ పొద్దు వాలే దాకా. ఈ మధ్యలో వచ్చివెళ్లిపోయే లోకానికి నేనొక వున్మాది వూహని.

3
అబద్దం ఇప్పుడు సయించదు కాబట్టి, వొక్క నిజం చెప్పనా? అప్పుడప్పుడూ నీలోపలి స్త్రీత్వంలో ఎలాగోలా కాసేపయినా బస చేద్దామనుకుంటా. కనీసం వొక జీవితకాలమంత గాఢమయిన కొన్ని క్షణాలు. ఎందుకలా పూల నవ్వుల పక్కనా, తుంటరి ఏరు పక్కనా, చెదిరిన ఆకాశం కిందా, పెంకి మబ్బుల్లోనో కనిపిస్తావ్?! మల్లెలూ, కనకాంబరాలూ, సిందూరాలన్నీ బోసిపోయే రంగుల్ని ధరించి ఎందుకలా వస్తావ్ నా నిద్రారాహిత్యాన్ని ఇంకాస్త పొడిగించే చలికాలపు రాత్రిలాగా.
నేనందుకోలేని ఎత్తుల్లోనో, దిగలేని లోయల్లోనో ఎందుకలా నన్నొక ఎండమావిని చేసి ఆడుకుంటావ్?! ఎలాగూ నువ్వు నీ తెల్లారిన ప్రతీ లోకంలో నన్ను నీలోంచి గెంటేసి నీ పగటి మాస్క్ లోకి నీటుగా దిగడిపోయి, నన్ను మళ్ళీ వొక అపరిచితుణ్ణి చేస్తావ్. నీ మీద ఏ అధికారమూ లేక నేనొక నిట్టూర్పులోకి జారగిలబడ్తాను. నిను తాకే వేళ్ళనీ, నిను ముద్దాడే పెదాలనీ, నిను చుట్టేసే చేతుల్నీ – అకారణంగానే అయినా- వొక ఆకుపచ్చ కంటినై చూస్తా.

4
తేలదు
ఎటూ తేలదు
తెలియదు
ఏమీ తెలియదు.
తేలితే, తెలిస్తే నువ్వు కాదు కదా!

5
తెగిన నిద్రలోంచి మేలుకున్న ప్రతిసారీ
ఇటు తిరిగి నిద్రపోని కళ్ళతో
నా రెప్పల్ని నిముర్తున్న నువ్వే కనిపిస్తావ్!
నాకూ అప్పుడే తెలుస్తుంది, నీ రెప్పలు నిద్రని వెలివేశాయని.

6
అప్పుడిక నువ్వొక కల అని
ఎవరు చెప్పినా నమ్ముతానా నేను?

7
నీ కలలో మునిగి పైకి తేలే వొట్టి కలవరింతనే నేను!
నన్నిలాగే వుండనివ్వు నీ రాత్రిలో
నీ రెప్పల కింది ఆ వెలుగులో
ఆ వెలుగు కింది మసక చీకట్లో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి