పేరు పెట్టి పిలవకపోయినా వస్తువులు పలుకుతాయి
పేర్లు వస్తువులు పెట్టుకున్నవి కాదు
నువ్వు వాటిలోనికి వెళ్లిపో, అరవకు
తలుపులు బాదకు, విరిగిపోతాయి
తమకు తాము తెరుచుకునే దాకా
కళ్లు మూసుకుని గడప ముందు కూర్చో
ప్రయాణం ఎప్పుడు ఎక్కడి నుంచైనా మొదలెట్టొచ్చు
ఒంటరిగా వెళ్లాలి,
కోట్లిచ్చినా తనకు తెలియనిది చెప్పని గైడు దొరకడు
పది మంది తారసపడినప్పుడు కూడా
ఒంటరితనం వదులుకున్నావా, అంతే ఇక,
మంది ఉంటారు, నువ్వుండవు
మంది పెట్టిన పేర్లుంటాయి, నీకూ వస్తువులకు
కావాలంటే నీదే మరో పేజీలోంచి ఒక పదం తీసుకో
ఓహ్, అలా కూడా కాదు,
అడుగు ఎక్కడుందో అక్కడి నుంచే ఒక పాదం పైకెత్తి కదలాలి
నడుస్తూ పోతే ఊరొస్తుంది, ఏదో ఒక ఊరు, అన్ని ఊళ్లూ ఒకటే
పేరు భలే మోసకారి,
అదొక పదం అనుకుంటావు నువ్వు, దానికి అంటుకుని
చాల చీము, చాల నెత్తురు; అదంతా
ఊరు ఒక పేరు తెచ్చుకోడానికీ, నిలబెట్టుకోడానికే ...
ఇక్కడ, ఈ కొండ వారన ఒప్పుడు ఒక ఊరుండేది,
దానికొక పేరుండేది
అందరూ వెళి పోయారు, వాగు ఒక్కటే ఉండిపోయింది, ఉండీ ఉండక
ఏ కొండల్లోంచి రహస్యంగా పారిపోయి వచ్చిందో
ఈ ఇసుకలో కూరుకుపోయింది
క్షణం క్రితం మరణించిన యోధుడి గాయం నుంచి రక్తంలా
ఇసుక నుంచి వాగు స్రవిస్తుంటుంది, అది భూమి గాయం,
బహుశా, భూమి ఉన్నంత వరకు ఉండే గాయం
అమ్మమ్మ వాళ్లూరికి వెళ్తూ నువ్వు కూడా చూసి ఉంటావు
ఎండాకాలం మట్టి వెనుక మాటు వేసిన చిరుత చారను,
వానాకాలం గగన ధారను, ఊట వాగును
పేరా?
ఊరిదా? వాగుదా??
నామకరణం చేస్తే గాని, నువ్వు నీళ్లు తాగవా!!*21.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి