పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జులై 2012, ఆదివారం

రామకృష్ణ పెరుగు॥వజ్రకిరీటం॥



వణికిపోతున్ననా ఆనందాన్ని
వడిసి పట్టుకోవటానికి
తడిసి తడవని ఈ దేహంలో ప్రవహించే రక్తాన్ని
పునర్జీవం పొందటానికి
ఇప్పుడు నాకొక నవీన వర్షం కావాలి

నేనూ చిలిపి తనాల నావమీద ఎక్కడానికో
నా పసి తనాన్ని పది కాలాలపాటు భద్రపరుచుకోవడానీకో
దేనికోసమయితేనేం ..?
నాకొక వర్షం కావాలి

నాలో పూరించలేని అగాధాలు పెరిగిపోతున్నప్పుడు
నా జ్ఞాపకాల కింద చిరునామా అయింది వర్షం
బహిష్కరించలేని బలహీనతల మధ్య
వర్షం ఓ గొప్ప ఓదార్పు
వర్షం ఎప్పుడూ వర్షమే
వర్షాన్ని బండ రాళ్ళతో బంధించలేము
దాన్ని గుండె చాళ్ళలో పదిల పరుచుకోవాలి తప్ప
బతుకు కోయిల నిద్ర పోతూ ఉంది
వర్షం కూత సరికొత్త సంగీతమై దాన్ని నిద్ర లేపుతుంది
వర్షం ఒకానొక జీవ తాత్వికరాగం పాడుతుంది
సమాధిలో నిద్రించాక కూడా అది నన్ను నిద్రలేపుతుంది
నా అతిధి,నా ప్రేమిక,నా సమస్తనేస్తమూ వర్షమే

వర్షంలో తడిసిన ప్రతిసారీ నేనూ తలెత్తుకు నిలబడతాను
ఏ వేటకాడు ఒడుపుగా విసిరిన వలలో బందీ కాలేదు
నేను రాసిన నాలుగు అక్షరాలకే
నా ముందు వినమ్రంగా బందీ అయింది

ఆనందంగా నిలువునా తడిపేస్తూ నన్ను ఆశీర్వదించింది
నాలోని ఒక్కో పార్వ్శాన్ని పూల చినుకులతో అభిషేకిస్తూ
నన్ను నవ్య మానవుడిగా ఆవిష్కరించింది..
*22.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి