ఈ రోజు నా పుట్టినరోజు
ధాత్రి ధరిత్రి నను ముట్టినరోజు
.. .. ..
పుట్టిన క్షణాన్నె నర్సు దెబ్బలు-
కొట్టినదెబ్బకు నేనేడిచానట.
ఏడుపు విని కన్నవాళ్ళు
కడుపునిండుగ నవ్వినారట !
దెబ్బల-జారి మొదలు ఇక్కడే
జీవితమంతా దెబ్బల తాకిడే
అమ్మపాలు కుత్కెల ఆగితె
లేతగుండుపై అమ్మచరుపులు
చిట్టిచేతుల్లో నేనుజారితె
బండలమీద మోటుదెబ్బలు
బులిబులి అడుగులు కాలుజారితె
గోడలు బాదిన నాటుదెబ్బలు
ముద్ద సహించక నేనేడిస్తే
చెంపను తాకిన అమ్మదెబ్బలు
స్కూలు వెళ్ళనని మొరాయిస్తె
నాన్నవేసిన బెల్ట్ దెబ్బలు
పక్క పోరడు గోలచేసినా
పంతులుమోదిన వీపుదెబ్బలు
క్లాసులోన లెక్కతప్పితే
తోటిపిల్లల చెంప దెబ్బలు
కొత్తసైకిలు తొక్కుమోజులో
మీద కూలిన బండిదెబ్బలు
స్నేహం పేరున ప్రేమవేటలో
గర్ల్స్ చేతిలొ చెప్పుదెబ్బలు
పొట్టకూటికి కొలువులచేరితె
ఉద్యోగంలో విధుల దెబ్బలు
సుఖంకోసమని పెండ్లాడితె
సంసారంలో ఈతి దెబ్బలు
పిల్లలపెంచి సంబరపడితే
కాన్వెంటుల్లో ఫీజు దెబ్బలు
పెళ్ళిచేసి బిడ్డనుపంపితే
అత్తింటోళ్ళ చాటు దెబ్బలు
సదువునేర్చిన జాబుల్రాక
పిల్లలకన్నీ ఎదురుదెబ్బలు
ప్రేమపెండ్లితో కొడుకెల్లిపోతే
తీపిగుండెకు "సన్ స్ట్రోక్"లు
రెక్కలాడని డొక్క ఆగని
వార్ధక్యంలొ వ్యాధి దెబ్బలు
ఊపిరాడక మందుకుపోతే
ఆగినగుండెకు దాక్టర్ దెబ్బలు
పురుటిలొ పుట్టిన పునాది దెబ్బకు
ముగింపు బాదుడె సమాధి దిమ్మే
దేహధారణం దెబ్బలమయము
బతుకుబాటలు బాధలవలయం
జీవితమంతా దెబ్బల పోటులె !
జీవనమంతా బాధల ఓటులే !!
*22.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి