( తొలకరి వానలో చిందులేస్తున్న ఒక చిన్నారి ఫోటో చూడగానే నాలో కలిగిన భావాలు.. )
మృగశిర దాటగానే తలుపు తట్టే వాన
ఎందుకోమరి అలిగి ,రానని మారాం చేస్తోంది..
ఐనా మనసుండబట్టలేక
అప్పడప్పుడు కళ్లాపి జల్లిపోతోంది..
సూరయ్య ఆగ్రహానికి వేడెక్కిన నేలతల్లిపై
జాగ్రత్తగా తప్పటడుగులు వేస్తోంది
మట్టిజాడ కానరాక సిమెంట్ రోడ్లు, డాబాలపై
తధిగినతోం అంటూ తబలావాయిస్తోంది.
అమ్మ వద్దంటున్నా, నాన్న వారిస్తున్నా
చిన్నది మాత్రం ఆ జల్లులోకి ఉరికింది
ఆ చిన్నదాన్ని చూసిన వాన కూడా
నేనేం తక్కువా అంటూ అల్లరి చేసింది...
ఒక చినుకు తలపై పూలజడ కాగా
ఒక చినుకు పాపిటబిళ్లగా అమరింది
ఒక చినుకు ముక్కెరై మెరుపులీనగా
ఒక చినుకు కంటి కాటుకై కూర్చుంది..
ఒక చినుకు చెవులకు లోలాకుగా వ్రేలాడగా
ఒక చినుకు పెదవిని ముద్దాడింది
ఒక చినుకు మెడలో కాసులపేరు కాగా
ఒక చినుకు నడుముకు వడ్డాణమై కూర్చుంది
ఒక చినుకు చేతులకు కంకణమైపోగా
ఒక చినుకు కాలికి పట్టీలా జారిపోయింది..
ఎంత అల్లరిదమ్మ ఈ వాన?
చేయి చేయి కలిపి ఆటలాడింది
మాటలాడనీక ఒళ్లంతా తడిపేసింది..
చిన్నదాన్ని చూడగానే ప్రేమగా కావలించుకుంది.
*18-07-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి