పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జులై 2012, బుధవారం

వంశీధర్ రెడ్డి || ‎* వేప చెట్టు * ||

అప్పుడదో ఆనందం,
ఇంటిపెరట్లో వేపచెట్టు కింద,
ఆరామ్ కుర్చీలో,
కాకుల ప్రశ్నలకు,కోకిలల జవాబులు
తర్జుమా చేస్కుంటూ,

నాతోపాటే పెరిగి పూతేసి
పాతుకుపోయిన వేపచెట్టు,
తుఫాన్ గాలికీ సడలక,
హోరు వర్షానికీ బెదరక,
ధైర్యానికి లివింగ్ ఎక్జాంపులై,

అమ్మోరు పోస్తే వేపాకుల
ఆంటిబయాటిక్ నన్ను పొదిమి,
ఉగాదికి కొంత చేదుని గుర్తుచేస్తూ,
ఇంటి తలుపుకి సగం శరీరం దానమిచ్చి,
పెరట్లో గంభీరంగా, వేపచెట్టు,
థింకర్ స్టాట్యూలా కనిపిస్తూ,

పాతిల్లు కూల్చి కొత్తగా కడుతుంటే,
ఏమైందో, ఎండిపోతూ చెట్టు, ,
ఇల్లు పూర్తై, చెట్టుని చంపేసి,
నాకు శూన్యం మిగిల్చి,
అదో ఆనందం,
లేని వేపచెట్టు కింద,
రాని కాకుల్నీ కోకిలల్నీ ఊహిస్తూ...

పోయినేడాది మొలకేసి మళ్ళీ
మా పాప పుట్టినప్పుడే,
చెట్టుకి ప్రాణాలుంటాయ్,
మనసుతో చూస్తేనే, మనిషిగా చూస్తేనేనేమో..

ఇప్పటికీ అదే ఆనందం,
ఇంటిపెరట్లో వేపచెట్టుకు నీరు పోస్తూ,
కావ్ కావ్ అంటూ కాకుల్ని పిలుస్తుంటే...
*17-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి