పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

చింతం ప్రవీణ్ || వాడు...


నేను నడుస్తున్నానన్నా మాటే గాని
నా అడుగులు హైజాక్ చేయబడ్డాయ్

నేను బిగించిన పిడికిలిలో
నా ఆవేశం హైజాక్ చేయబడ్డది

నేను నినదిస్తున్న గొంతులో
నా నినాదం హైజాక్ చేయబడ్డది

చివరికి
నా అన్నదమ్ముల బలిదానాల్లో
త్యాగం హైజాక్ చేయబడ్డది

కాంగ్రేసోల్లు...
పచ్చంగోల్లు...
ఒక్కన్ని మించిన దొంగలు ఒకలని
వాన్ని నమ్మినం
వాని జెండాలు మోసినం...

ఆ జెండా వెనకాలే
నడిచినం...
పరిగెత్తినం...
నినదించినం...

ఇప్పుడు
ఆ రంగులమారి జెండా వెనక దాగున్న
నెత్తుటి అజెండా తేటతెల్లమైంది...

నాకేం ఎరుక వాడు

చేతులు కట్టేసి
పిడికిలి బిగించమన్నడని
గొంతు నొక్కేస్తూ
నినాదమివ్వమన్నడని
నడుస్తున్న దారిని తవ్వేసి
పరిగెత్తమన్నడని

నాకేం ఎరుక వాడు
ఆకాంక్షను అంగడి చేసి
ఉద్యమించమంటున్నడని
వేదికలన్నీ కూల్చేసి
ప్రసంగించమంటున్నడని
నిలువెల్లా గాయం చేసి
మందు పూస్తున్నడని...

నిజానికి
వాడెప్పుడూ అంతే...
జనాలు నెత్తురోడుతుంటే
మౌనమే వ్యూహమంటడు
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే
వూరౌతల వుంటడు
పోరాటానికంతటికి
పేటెంట్ దారున్నంటడు...

26.09.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి