పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

డా. రావి రంగారావు // కవీ రైతూ దేశానికి రెండు కళ్ళు //

నాకూ మా నాన్నకూ తేడా లేదు
మా నాన్న హలం పొలంమీద పెట్టి అక్షరాలు రాస్తున్నాడు
నేను కలం కాగితమ్మీద పెట్టి ధాన్యం పండిస్తున్నాను...

మా నాన్న నేల గుండెలు కూలుస్తున్నాడని
నేను కాగితం శీలం చెరుస్తున్నానని
ఆయుధాలతో మే మిద్దరం హింసను ప్రేరేపిస్తున్నామని
మనస్సులకు కత్తులు కట్టుకున్నవాళ్ళు పొగబెడుతున్నారు
మన జాతి ప్రాణాలపై పగబడుతున్నారు...

నా కలంనుండి అక్షరాలు
ఆకలి చీకట్లను తొలగించే
వెలుతురు ధాన్యపు గింజలు,
ఈ గింజలకు విశ్వరూప శక్తి కలిగిస్తామని
చేతు లెత్తి పిలుస్తున్నాయి
ప్రజా హృదయ క్షేత్రాలు...

శ్రమ నంతా పచ్చని అమృతంగా మార్చి
పొలాల నిండు గుండెల్లో భద్రంగా ఉంచి
విషంబొట్టు దొంగలు రాకుండా చూసే
పల్లెపడుచు వడిసెల నా కలం...

ఎన్ని శిశిరాలు వెన్నుపోటు పొడిచినా
ఎన్ని పండుటాకుల అనుబంధాలు వదిలిపోయినా
ఎన్ని గొడ్డళ్ళు తనువును గాయపరిచినా
మళ్ళీ కొత్త చిగురులు తొడిగే చెట్లు
నా కలానికి బంధువులు...

నిద్రపోతున్న మొద్దుల్లాంటి
ఎద్దుల్ని మేలుకొలిపే
చెర్నకోల హెచ్చరికలు
నా కలానికి స్నేహితులు...

ఎండిపోయిన మొక్కల ముఖాల చూచి
ఆదుర్దాగా పరుగెత్తుకొచ్చి
గలగలా ఆప్యాయంగా మాట్లాడుతున్న పంటకాల్వలు
నా ఆలోచనలు...

చిక్కిపోయిన నదీనదాలకు
కొత్త రక్తా న్నెక్కించటానికి
దివి నుండి భువికి దిగివచ్చే
వర్షం జల్లులు నా ఆశయాలు...

చిరునవ్వుల పువ్వుల
పత్తిచేనుమీద పడి
రక్తాన్ని పీల్చేస్తున్న దోమలగుంపు మీద
క్రిమిసంహారక మందులు చల్లటం నా ఆచరణ...

ఎవరైనా పాములుగా మారి
నా దారి కడ్డు వస్తుంటే
గోమాత లాంటి నా కలం
గరుత్మంతుడై వీక్షిస్తోంది...

నా కలం
పీడితునికి చిహ్నం,
శ్రమజీవనానికి సంకేతం,
సామాన్యుడికి ప్రతీక,
ధర్మానికి పతాక...

పాలిస్తున్న ఆవుల్నడిగి
దున్నిపెడుతున్న ఎద్దుల్నడిగి
పంటలు మోసే బండిని అడిగి
కన్న తల్లి నేలను అడిగి
ఓ కొత్త సిరా తెచ్చుకొంది నా కలం...

ఎండిన డొక్కల్ని చేరుకుందామని
బయలుదేరిన పంటను నిప్పుకళ్ళతో
భయపెట్టి దోచుకునే చీకటితో
నా కలం కుస్తీ పోటీ...

ఈ చీకటిని తొలగించటమే
నాకూ మా నాన్నకూ ఆరాటం,
తరతరాలుగా మేం చేస్తున్నాం
ఈ నేలమీద పోరాటం...

నాకూ మా నాన్నకూ తేడా లేదు
మా నాన్న హలం పొలంమీద పెట్టి కవిత్వం రాస్తున్నాడు,
నేను కలం కాగితమ్మీద పెట్టి వ్యవసాయం చేస్తున్నాను...

మా నాన్న హలంతో, నేను కలంతో
తూర్పుదిక్కు నుంచి బయలుదేరాము,
మార్పు కోసం కలిసిసాగాము,
మా మధ్య నడిచివస్తున్నాడు-
మా చిటికెనవేళ్ళు పట్టుకొని
దిక్కుల్ని పలకరిస్తూ చిరునవ్వుతో కిరణభానుడు
ప్రపంచాన్ని పాలించే రేపటి మా వారసుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి