రాత్రి ఆకాశంలో
కాసిన చంద్రున్ని
పొద్దున్నే
చేతిలో పట్టుకున్నట్టుండేది
...
డబల్ రొట్టె తింటుంటే
చీ...మా బాపు
నీన్న ఒక్కటే తాగిండ్రా..
గందుకే
ఒక్కటే కొనుక్కుంటా...!
చేతిలో
పవ్వ కీసలు
వట్టుకొనచ్చిన రాజిగాని బాద,
తాతా
మా అవ్వ
పైసల్ రేపిత్తనన్నది
ఒకటియ్యవా..
సత్తిగాని అభ్యర్తన
అమృతాన్ని పంచె
మోహిని
మగవెషమేస్కున్నట్టు
కనవడేటోడు మా డబల్ రొట్టెల హుసేన్ తాత,
సార దాగని మా బాపు
అవసరాల బరువునీ
మా మీద ప్రేమనీ
బడ్జెట్ తరాజు ల జోకి
రూపాయ్ బండి
చేతుళ్ళో
డబల్ రొట్టె గా
తర్జుమా అవగానే
సంబురం
నాతో సావాసానికి
ఉరికచ్చేటిది
గిలాసల పాలు
రొట్టెకి తాగించినాక
మా చిన్నక్కకు కనబడకుండా
నోటి సరిహద్దులు
దాటించేటోన్ని ....
పట్నంలడుగు వెట్టినంక
డబల్ రొట్టె ముచ్చటే
మర్శిపోయినం.
మొన్న
ఊరికి వోతె తెల్సింది
మా పొద్దటాకలికి
ఆనందాన్ని మోస్కచ్చిన
హెరో సైకిలి
ఉరికిన పదారేంద్ల కాలపు
మారథాన్ ల
ఓడిపొయిందాట
గాడెవడో అంగ్రేజొని
పిజ్జా బండి
తాత సైకిలికి
టక్కరిచ్చిందాట
గిప్పుడు
మా హుసేన్ తాత
బెల్టు షాపు కాడ
కీసలేరుకుంటుండు
ఐనా ఆడేం నిరుపేద కాదులే
రొజుకి థీస్ రుపాయ్
ఖర్చు వెడ్తాండు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి