పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

జగద్ధాత్రి || అవసరమా?


దాపరికం అవసరమా నేస్తం?
అడిగాను సందేహంగా
అవసరమే ... ఖచ్చితమైన జవాబు
సూటిగా తాకింది చెవిని

కొన్ని మాటలు , కొన్నివిషయాలు
కొన్ని సంఘటనలు కొందరితో చెప్పకూడనివి
చెప్పకూడదు ...అందుకు అవసరమే దాపరికం
నిష్కర్ష స్వరం లో పలుకు సోకింది కర్ణ భేరిని

ఏమో మరి ...పెదవి విరిచాను
ఏది దాయాలో ఏది దాయ కూడదో
నిజంగా నాకు తెలీదు సుమా
అన్నా భుజాలెగరేసి

మనసు , మమత జంట కట్టిన
అనుభూతుల రసావిష్కరణ
మది లో చెలరేగే మధుర తుఫాను
అక్షరాలుగా ఒలికి పోతాను

హృదిని వేధించే బాధలను
మాటలలో పంచుకుంటాను
చుట్టూ ఉన్న సమస్యలకు
కవితావేదన గా ఎక్కడన్నా
పరిష్కారాలు దొరుకుతాయేమో నని
వెదుకులాడుకుంటాను

ఘనీభవించిన భావ ప్రకంపనలను
ఉద్విగ్నతతో ఉల్లేఖిస్తాను
అన్యాయపు వక్ర వర్గాలను
తూర్పార బట్టకుండా ఉండలేను

మనుషుల మది మేధలలో
అలుముకున్న విష మేఘాలను
అనురాగ వర్షమై అలికి వేస్తాను

అనుభవాల , అనుభూతుల సారాన్ని
మరు తరం వారికి పంచి
జీవితమేమిటని ఎరుక కల్గిస్తాను

అందుకే నాకు దాపరికాలు లేవు
తప్పులో ఒప్పులో మెప్పులో దేప్పులో అయినా
మనసు చెప్పిన మాట
మేధ గాంచిన బాట
పదిమందికీ పంచి పరవశిస్తాను
కొందరి హృదినైనా కవితా దివిటీనై
వెలుగుతూ, వెలిగిస్తూ సాగిపోతాను

ఇక ఇప్పుడు చెప్పు దాపరికం అవసరమా?
జీవితానుభవాల సారాన్ని
దాచుకోవడం అవసరమా నేస్తం ??
దాచకుండా చెప్పు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి